మాస్టర్ ఇ. కె.


“ఈ సమూహము వ్యక్తుల బహిరంగ కలయిక కాదు. వారి హృదయముల అంతరంగ సమీకరణము.”

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య

జగద్గురు పీఠము ఆధ్యాత్మిక మూలము

మాస్టర్  ఇ. కె.

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు, భారతదేశమునందు, ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల అను పట్టణమునందు 1926 ఆగస్టు 11 తేదీన జన్మించిరి. వీరు తెలుగు వాఙ్మయము నందే కాక, సంస్కృతాంగ్ల భాషలలో నిష్ణాతులు. ఆంధ్ర విశ్వవిద్యాలయము నందు ఆచార్యులుగా వృత్తి. ఉత్తేజకరమైన, సహజ స్థితి, శైలిలో బోధనలు చేయుచుండెడివారు. విశిష్టమైన రచనా శైలితో అనంతమైన ఆధ్యాత్మిక సంపదను పంచినవారు మాస్టర్ ఇ.కె.

నిరంతర సేవానిరతితో పలు సేవా కేంద్రములు నెలకొల్పిరి. పసితనమునుండి సద్భావన, అవగాహన కలుగచేయుటకు బాలభాను విద్యాలయములు వారి వలననే అంకురించినవి. హోమియో వైద్య సేవతో లక్షలాది ప్రజానీకానికి సేవ చేసిన అపర ధన్వంతరి. వైద్య బృందములకు శిక్షణనిచ్చి, వందల సంఖ్యలో ఉచిత హోమియో వైద్యాలయములను సేవాభావము, ఆనందము, ప్రేమ తత్త్వములతో ముడి వేసి స్థాపించిన మహర్షి. వారి దివ్య స్పర్శ, సంభాషణములు ఎంతయో స్వస్థత కలుగ చేసెడివి.

సృష్టిలో అంతర్భాగములైన ప్రజ్ఞ-పదార్థముల యొక్క సత్సంబంధమును చక్కగా నిరూపించి, పదార్థమును ప్రజ్ఞ యొక్క ప్రతిరూపముగా నిర్వహించి వేలాది మందిని యోగ మార్గమున నడిపించిన ద్రష్ట! భౌతికమైన ప్రపంచములో ప్రజ్ఞావంతమైన ఆధ్యాత్మిక జీవితము గడుపుట సాధ్యపడునని కళ్ళకు కట్టినట్టుగా తెలియజేసిన ఆచరణశీలి.

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారికి తమ 24వ సంవత్సరములో ధ్యానమునందు క్రమముగా దర్శనము ఇచ్చి మాస్టర్ సి. వి. వి. తమ శిష్యులుగా స్వీకరించిరి. మాస్టర్ సి. వి. వి. నూతన యోగమును తమ కార్యక్రమముగా గుర్తు తెలిసికొని, సత్సంకల్ప బృందములను తయారు చేసి, ఆధ్యాత్మిక యోగ గురు పరంపరతో 1953 నుంచి తమదైన జీవన ప్రవృత్తి సాగించిరి. తమ జీవన ప్రణాళికలో భాగముగా, గురుపరంపరతో తమ సన్నిహిత సంబంధములను గావించి 1958 నుంచి విశ్వాంతరాళమును పరిరక్షించు కర్తవ్యముగా భూమి పైన యోగ ప్రక్రియను సాగించిరి.

1961 లో జ్యోతిష పరాకాష్ఠగా “ఆధ్యాత్మిక జ్యోతిషము” (Spiritual Astrology) తనకు, తాము అనుసరించిన పరమ గురువుల ద్వారా జ్ఞానధారగా అందినది అని, ఈ విజ్ఞానము తమను అనుసరించు వారికై వెలువడినదని తెలిపిరి. 1971వ సంవత్సరము నవంబరు 18వ తేదీన దివ్య ప్రణాళికలో భాగముగా “జగద్గురు పీఠము”ను ఆవిర్భావము చేసిరి. ఈ సంస్థ పరమగురు పరంపరకు వాహిక వంటిది.

ప్రాక్పశ్చిమ సమన్వయమునకై భూగోళమును చుట్టి, పలు పర్యాయములు పర్యటించి, ప్రవచనములు, ఆచరణాత్మక సూచనలు, కుంభ యుగమునకు సంబంధించిన విజ్ఞానము అందించిరి. మాస్టర్ సి. వి. వి. చైతన్య బీజములను వెదజల్లి, యోగ సాధనకు పునాదులు వేసిరి. సనాతన సాంప్రదాయము, విజ్ఞానములను విపులీకరించి, వేదగ్రంథములందలి సూక్ష్మ రహస్యములను తెలియజేసిరి. పైలోకముల నుంచి అందిన అనేక దివ్య విజ్ఞానమునకు సంబంధించిన అనేక విషయములను తెలుగు, ఆంగ్ల భాషలలో గ్రంథస్థము చేసిరి. వేదములు, యోగవిద్య, జ్యోతిషము, మానవ శాస్త్రము, కథా సంపుటములు, పద్య కావ్యములు మున్నగు పలు అంశములు వారి గ్రంథములుగా వచ్చినవి.



Master EK - The New Age Teacher (English) మాస్టర్ ఇ. కె.

భౌగోళికముగా బృందముల ఏర్పాటు, నిరంతర సాధన కార్యక్రమములు 1977 నుంచి మాస్టరు గారు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చిరి. మాస్టరు గారి పర్యటనలో రూపు దిద్దుకున్న బృందములు, తమనుంచి పరంపరగా మాస్టరు గారందించిన విజ్ఞానము, సేవలు కొనసాగించుట అత్యద్భుతము, ఆనందదాయకము. వ్యక్తిత్వ ప్రదర్శన, వ్యక్తిగత ఆరాటము, పేరు ప్రతిష్టలకు దూరముగ, ఆవల నిల్చి సంస్థగా కార్యక్రమములు కొనసాగుతున్నవి.

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు జీవన పర్యంతము అతి సామాన్యము, సరళము, క్రమశిక్షణా పూరకము, పంచి ఇచ్చు స్వభావము, తమ జీవనము ద్వారా ఆచరణ రూపముగా అందించిన మహా మనీషి. బహుముఖప్రజ్ఞాశాలి, వజ్ర సంకల్పురు. 30 సంవత్సరములు పర్యంతము పరమగురువుల కార్య నిర్వహణలో వారు ఈ భూమి జీవుల ఉద్ధరణకై చేసిన కృషి దైవ సంకల్పము మాత్రమే.

1984 మార్చి 17, ఫాల్గుణ పూర్ణిమ (మీనరాశి) నాడు తమ అవతారమును పరిపూర్తి గావించిరి.

గురుదక్షిణ

“నేను ఎప్పుడు ఎవరినీ గురుదక్షిణ కోరలేదు. ఈ రోజు గురుదక్షిణ అడుగుతున్నాను. అదేమిటంటే, నేను ఇప్పటి వరకు ఇచ్చిన శిక్షణ ప్రకారం జీవిస్తూ నేను మీకు నేర్పిన విద్యను బాగుగా అభ్యసించి, మీరు ఒక్కొక్కరు కనీసము మరో పదిమందికి జీవితాంతం శిక్షణ ఇస్తూ, ఇదే గురుదక్షిణ మీరు కూడా పొందండి. ప్రపంచం నలుమూలలా వెదజల్లండి.”

(మోతుగూడెం శిక్షణా శిబిరంలో అంతిమ సందేశం - 1984)

పుస్తకములు