{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ధ్యానమునకు సూచనలు

ధ్యానము

అంతరంగములో పెరుగుటకు ధ్యానమే ఆధారము. ఆత్మ యొక్క నిశ్శబ్దమైన వృద్ధి మౌనము నందు జరుగును. దీని ద్వారా ఆత్మ తన ఎరుకను తాను తెలుసుకొన గలుగుతుంది. ధ్యానము, ఆత్మ, అనాత్మల మధ్య అనుసంధానము కలిగించుటద్వారా యోగమును సిద్ధింప చేస్తుంది. అనేక రకములైన ధ్యానములు కలవు. ఈ క్రింద చెప్పబడిన ధ్యాన విధాన సూచనలు ప్రస్తుత కాలమునకు సరియైనవి.

కాలము

ధ్యానమునకు సరియైన సమయమును ఎంచుకొని దానికి కట్టుబడి ఉండవలెను. సమయపాలన విజయమునకు ముఖ్య కారణము. ఆధ్యాత్మిక మార్గములో ఇది అతి ముఖ్యము. కాలమును గౌరవించినచో, కాలముచే గౌరవింపబడతాము. ప్రతిరోజు ఒకే సమయమునకు ధ్యానము చేయగలిగి ఉండాలి. ఉదయము 6:00 గంటల మరియు సాయంకాలము 6:00 గంటల సమయము ధ్యానమునకు నిర్దేశింపబడిన సరియైన సమయములు. ఎవరికైనా ఈ సమయములు వీలుకానిచో, వారు 12 గంటల వ్యవధిలో ఒక సమయమును నిర్ణయించుకొని క్రమము తప్పకుండా ప్రతిరోజు ఆ సమయములో ఉదయము, సాయంకాలములలో ధ్యానమునకు కూర్చొన వలెను. మొదటగా 4:00 గంటల నుండి 8:00 గంటల మధ్య ఏదయినా ఒక సమయమును ఎంచుకొని, ఉదయము, సాయంకాలము ఆ సమయమునకు ధ్యానము చేయవలెను.

ధ్యానము చేయు సమయము పొడిగించవచ్చు, కానీ ధ్యానము మొదలు పెట్టుట మాత్రము ఒకే సమయమునకు జరుగవలెను. ప్రాతఃకాలమునకు రెండు గంటల ముందు సమయము ధ్యానమునకు చాలా అనుకూలమైనది. సాయంసంధ్యా సమయము కూడా చాలా ప్రయోజనకరమైనది. పూర్ణిమ, అమావాస్య మరియు అష్టమి తిథులు ధ్యానమునకు ముఖ్యముగా చాలా అనుకూలమైన దినములు. విషువత్ పుణ్యదినములు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ దినములు ధ్యానమునకు వినియోగించుకొన వలెను.

ప్రయత్నము

ఉదయముననే నిద్రలేచి, పళ్ళుతోముకొని, కాలకృత్యములు తీర్చుకొని, స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు ధరించవలెను. ఈ విధముగా చేసినచో శరీరము, మనస్సు తేలికగా, పరిశుభ్రముగా మరియు పవిత్రముగా అనిపించును.

కూర్చొను విధానము

కన్నులు లఘువుగా మూసుకొని, ఉత్తరము వైపునకు గాని, తూర్పు వైపునకు గాని తిరిగి, చాప మీదగాని, కుర్చీ మీదగాని కూర్చొనవలెను. “శరీరమునకు సుఖముగా ఉండే ఎటువంటి ఆసనమైననూ” ధ్యానమునకు అనుకూలమే అని చెప్పబడినది. అందరూ పద్మాసనములో కానీ, క్రిందకానీ సుఖముగా కూర్చొనలేరు. కూర్చొనిన విధానము శరీరమునకు బాధ కలిగించినచో మనస్సు దానిని గురించియే ఆలోచించును కానీ, భౌతికమును దాటి వెళ్ళలేదు. అందువల్ల శక్తి ప్రసారము సరిగా జరుగదు. సాధ్యమైనంతవరకు వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చొనినచో, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతిని పొందగలము.

ఓంకారము

దీర్ఘముగా, నెమ్మదిగా, మృదువుగా మరియు ఒకే విధముగా మూడు సార్లు ఓంకారమును ఉచ్చరించి వినవలెను. తరువాత ఒక నిమిషము మౌనముగా ఉండవలెను. ఓంకారమును ఉచ్చరించునపుడు శబ్దము యొక్క ఉత్పత్తి స్థానమును గమనింపవలెను. ఈ స్థానమును గమనించుట వలన మాత్రమే మనము అంతర్ముఖులము కాగలము. బాగా వినగలిగినచో, మనయందు ఓంకారము నిత్యమై, శాశ్వతమై జరుగుచున్నదని తెలియును. మనస్సు, ఇంద్రియముల ద్వారా బాహ్యమునకు వెళ్ళుట ధ్యానమునకు వ్యతిరేకమైన స్థితి. యాంత్రికముగా ఓంకారమును ఉచ్చరించినచో, ఎన్నిసార్లు ఉచ్చరించామో కూడా గుర్తువుండదు. కనుక ఓంకారమును పూర్తి ఎరుకతో ఉచ్చరించవలెను. ఉచ్చరిస్తూ, దానిని వింటూ, దాని ఉత్పత్తి స్థానమును కనుగొనవలెను.

భావనా దర్శనము

బంగారు వర్ణపు మెరపు కాంతులతో ఉన్న కమలమును హృదయ కేంద్రములో ఊహించవలెను. ఓంకారము ఉచ్చరించు ప్రతిసారి ఆ కమలము విచ్చుకొనుచున్నట్లు భావించవలెను. 3 లేక 7 సార్లు ఉచ్చారణ పూర్తియగు సరికి పూర్తిగా విచ్చుకొనిన హృదయ కమలమును దర్శించవచ్చును. ఆ కమలము మధ్య భాగములో మాస్టరుగారు ఆసీనులై ఉన్నట్లుగా దర్శించవలెను. మాస్టరుగారు నవ్వుతూ, మన కన్నులలోనికి చూస్తూ మనల్ని ఆశీర్వదించుచున్నట్లుగా దర్శనము చేయవలెను.

ప్రార్థన

పైన చెప్పిన విధముగా మాస్టరు గారిని దర్శిస్తూ, ఈ క్రింది విధముగా ఉచ్చరించవలెను:

నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి.
నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి.
నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి. టు యువర్ లోటస్ ఫీట్


కుంభచైతన్యపు వాహికలుగా తయారు కావటానికి మాస్టరుగారిచే ఇవ్వబడిన బీజాక్షరములు “నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి.”. దీనిని ఇతర మంత్రముల వలె అనేక సార్లు జపించనవసరములేదు అని మాస్టరుగారు చెప్పివున్నారు. సి.వి.వి. అను శబ్దమును ఉదయము, సాయంకాలము ఒక్కసారి ఉచ్చరించిన చాలును.

తరువాత 15 నిమిషములు మౌనముగా ఉండవలెను. ప్రసారము చేయబడిన చైతన్యశక్తి, శరీరము నందలి మూలమూలలకు వ్యాపించుటకు కనీసము 15 నిమిషములు పడుతుంది అని మాస్టరుగారు చెప్పినారు. సి.వి.వి. అను బీజాక్షరములను జపించిన తరువాత మనలో చైతన్య ప్రసారము జరిగి నిద్రాణమై ఉన్న శక్తిలో కదలికలు ప్రారంభమగును. ఇవి మన దేహమునందలి వెన్నెముకలో జరుగును. అవసరమైన సర్దుబాట్లు శరీరము నందు జరుగును. శక్తి, చైతన్య ప్రసారమునకు అడ్డంకులు తొలగింపబడి చక్కగా శక్తి ప్రసారము జరుగును. జరుగవలసిన మార్పులు జరుపబడును. ప్రాణ ప్రసారమునకు కావలసిన మార్పులు, ప్రాణము యొక్క వృద్ధి ప్రాణమయ కోశమునందు జరుపబడును. మాస్టరుగారు దీనిని “మరమ్మత్తు పని” (repair work) అని అన్నారు. ఉదయము, సాయంకాలము చేయు ప్రార్థనలను “బండి బాగుచేయుటకు ఆపుట” (parking the vehicle for repair) గా అర్థము చేసుకొన వచ్చును. ప్రస్తుత మానవ శరీర నిర్మాణము పరిపూర్ణ మైన జీవితమును అనుభవించుటకు అనర్హమైనదిగా మాస్టరుగారు నిర్ధారించి ఉన్నారు. శరీరము నందు మార్పులు జరుగనిదే ఆత్మానుభవమును పొందలేరు. కనుక మాస్టరుగారు ఆత్మానుభవమును పొందుటకు కావలసిన సర్దుబాట్లను మరియు శరీరముల యందు మార్పులను ప్రతిపాదించినారు.

అంతరంగములో గమనించుట

బీజాక్షరములను ఉచ్చరించిన తరువాత, మౌనముగా ఉన్న సమయములో మనలోపల అంతరంగములో ఏమి జరుగుతున్నదో గమనించవలెను. ఏమి జరుగును? మా అనుభవము ప్రకారము ఎన్నో జరుగును. సామాన్యముగా గమనించ గలిగేది మనలో జరుగుచున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసలు. మనము వీటితో పుట్టాము గనక, అవే జరుతాయిలే అని మనము వాటిని గమనించము. మనము ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనిస్తూ ఉన్నట్లయితే, మనస్సు మెల్లగా లోపల జరుగుతున్న ఈ క్రియ వైపు మళ్ళింపబడి, వాటి ఉత్పత్తి స్థానమును చేరును. అప్పుడు హృదయ కేంద్రము మరియు ప్రాణ స్థానము తెలియబడును. అప్పుడు హృదయ కేంద్రములోనికి ప్రవేశము జరుగును. అప్పుడు మనము బుద్ధిలోనికి ప్రవేశించి తనను మనస్సుగా కాక, తనని తానుగా గమనించును. మనస్సు హృదయము నందు లయమగుట ద్వారా భౌతిక, మానసిక మరియు కామమయ శరీర కక్ష్యలలో అనేక మార్పులు మొదలగును. ఆ మార్పులు వల్ల అనేక సర్దుబాట్లు జరిగి ఆ కక్ష్యలు పునర్నిర్మింపబడతాయి. ఆత్మానుభవము పొందుటకు కావలసిన విధముగా శరీరమునకు అర్హత కలిగించుటయే దీని లక్ష్యం. దివ్యప్రజ్ఞ, మనస్సులోనికి, ఇంకా స్థూలలోకాల లోనికి దిగి మనిషిని మహాత్మునిగా చేసి అతనిని మరణము లేనివానిగా, దివ్యమైనవానిగా చేయును. దీనినే మాస్టరు సి.వి.వి. గారు “అమరత్వము” (physical immortality) అన్నారు.“

తన స్వస్థానములోనికి మనస్సు అంతర్ముఖమగుటను “Dip Deep” అని మాస్టరుగారు అన్నారు. అంతర్ముఖము అయిన కొలది, మనస్సు తన ప్రతిబింబమైన శ్వాసను కలయును. ఈ రెండునూ ఒకదానికొకటి చేరువైనచో, ఒకటిగా కలసిపోవును. అదే స్పందన. అప్పుడు స్పందనాత్మక చైతన్యము మాత్రమే ఉండును, మనస్సు, శ్వాస నిలచిపోవును. దీనిని వివరించి చెప్పుట చాలా కష్టము. అది ఒక నిశ్చలమైన స్థితి, గుండె చప్పుడు ఆగిపోవును, కానీ నీవు మరణించలేదు. ఈ క్రమము మొత్తమును మూడు విధములలో సంగ్రహించవచ్చును:

  • ఉదయము, సాయం సంధ్యలలో కాలమును పాటించుము
  • బీజాక్షరములను ఉచ్చరించుము
  • అంతరంగములో గమనించుము


ఏ నమ్మకమునకు సంబంధించిన వారైనా, భూగోళము మీద ఏ ప్రాంతమునకు చెందినవారైనా ఈ చెప్పబడిన ప్రకారము సాధన చేసి యోగానుభూతిని, సమన్వయత్వమును పొందవచ్చును. ఎవరు దీనిని 5 సంవత్సరములు సాధన చేస్తారో, వారు అన్నిటిని, అందరిని కలుపుకొని, అంగీకరించి సమగ్రతను సాధించు సామర్థ్యమును పొందగలరని మాస్టరుగారు చెప్పివున్నారు. అతని బాహ్య జీవితము వ్యవస్థీకరింపబడి, ఆంతరంగిక జీవితముతో సమన్వయింపబడి, చక్కని సామరస్యపూరిత జీవితమునకు దారితీయును.

10 సంవత్సరములు ఈ సాధనను క్రమము తప్పక చేసినవాడు తన వాహిక అవుతాడు అని మాస్టరుగారు చెప్పివున్నారు. తన వాహిక అగుటకు మరి రెండు నిబంధనలను మాస్టరుగారు ఇచ్చివున్నారు:

  • కనిపించే అన్ని రూపములను మాస్టరుగా ధ్యానము చేయవలెను. ( మాస్టరు అనగా సమస్త జగత్తుకు మూలమైన తెరవెనుక ప్రజ్ఞ. దానినే అందరి జీవులయందు, అన్ని రూపముల యందు దర్శనము చేయవలెను. అన్ని రూపములు దివ్యమైనవిగాను, అన్నిటియందు ఒకే ప్రాణము వ్యక్తీకరింపబడి ఉన్నదనియు తెలియవలెను. ఈ సాధన మనయందలి ఎన్నో భిన్నమైన కోణములను తటస్థపరచును.)
  • స్వప్రయోజనము కొరకు పనిచేయరాదు. ( సత్యమేమనగా ఎవరూ కూడా తన సొంత లాభము కొరకు పనిచేయుటలేదు. మన స్వలాభము కొరకు మనము పనిచేయున్నామన్న భావన కలిగివున్నాము. నిజమునకు మనము ఇతరులకొరకు పనిచేయుచున్నాము. మనము ఎదైనా కొన్నప్పుడు, అది మనకొరకు కొన్నాము అని అనుకుంటున్నాము. కాని మనము దానిని తయారు చేసినవానికి ధనము చెల్లించుచున్నాము. ఈ భావనము ప్రతి ఒక్కరూ సులభముగా పెంచుకొనవచ్చును. సందేశమేమనగా, ప్రతిఒక్కరు ఇతరులకొరకు పనిచేయవలెను. ఇతరులకొరకు పనిచేయుటయందే ఎక్కువగా ఉన్ముఖత చెంది ఉండవలెనని మాస్టరుగారు కోరుచున్నారు.)

అభ్యాసము

పైన చెప్పిన విధముగా ధ్యానమును సాధన చేసినచో, క్రమముగా మార్పులు జరుగును. మొదటగా ప్రస్తుతము ఉన్న అలవాట్లు, పద్ధతులకును, చెప్పబడిన క్రొత్త విధానమునకును ఘర్షణ జరుగును. చాలా మంది పాత పద్ధతులకు, అలవాట్లకు లోబడిపోయి నూతన విధానమునందు స్థిరపడలేరు.

ఈ నూతన విధానమునకు అనుసరించినచో, క్రమముగా ఇది స్థిరపడును. ఇది పాత అలవాట్లను, పద్ధతులను తొలగించి నూతన విధానమును స్థిరపరచును. చివరిగా శరీరమునందలి ప్రజ్ఞా కేంద్రములను వికసింపజేసి, శరీరమును శుద్ధి పరచి, కారణ ప్రజ్ఞను అభివృద్ధి పరచును. ప్రతిరోజూ 30 నిమిషములు సమయము దీనికొరకు కేటాయించినంత మాత్రమున చెప్పబడినదంతా పొందలేము అని దయచేసి గుర్తుంచుకొనవలెను. ధ్యానములో పొందిన దివ్యానుభూతిని రోజంతా, భావము, భాష, ఆచరణల యందు నిర్వహించుకొనుట ప్రతిఒక్కరూ అభ్యాసము చేయవలెను. ఆ స్థితి నుండి క్రిందకు జారిపడకుండా రోజంతా ప్రతి ఒక్కరూ గమనించుకొనవలెను. రోజంతా ధ్యానస్థితిని కలిగి ఉండేటట్లుగా అలవాటు చేసుకొనవలెను.