{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

అంతర్దర్శన ధ్యానములతో పనిచేయుట


“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ధ్యానములు మరియు సూచనలు
పుస్తకము: అంతర్దర్శన ధ్యానములు | పుస్తకము: Occult Meditations (English)
Audios: Occult Meditations

అంతర్దర్శన ధ్యానములు

అంతర్దర్శన ధ్యానములు చేయుట వలన మానసిక మార్పులు కలుగుటకు అవకాశము కలదు. అది అనేక గూఢమైన అనుభూతులకు దారితీయును. చివరకు అది దైవ సన్నిధికి చేర్చును. ఈ ధ్యానములు డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారికి ఆయన అనుసరించిన గురుపరంపరచే, ఆయనను అనుసరించే వారికి ఇవ్వబడినవి. ఈ ధ్యానములు భౌగోళికముగా సమస్త మానవ జాతికి సంబంధించినవి. వీటియందు వివిధ మార్గములలోని తత్త్వ శాస్త్రములకు సంబంధించిన ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక భావములు, మరియు చిహ్నములు కనిపిస్తాయి.

సాధకుడు ప్రతిదినము ఉదయమున, ఆ దినమునకు సంబంధించిన ధ్యానమును చదివి, దానిపై మనస్సు ఉంచి ధ్యానించవలెను. ఆ విధమైన ధ్యానము వలన సాధకుని మానసిక కక్ష్యలో దానికి సంబంధించిన దేవతా ప్రజ్ఞ మేల్కాంచును. మాస్టర్ సి. వి. వి. – ఎవరి నుండైతే ఈ ధ్యానములు ఉద్భవించినవో – ఆ మాస్టర్ సి. వి. వి. గారు ఈ మార్పులకు అధ్యక్షత వహించుచున్నారు.

సాధకుడు ఆ దినమునకు సంబంధించిన ధ్యానమును తప్పక చదవ వలెనని సూచించడమైనది. చదివి, వీలైనంత వరకు గ్రహించి, శ్రద్ధతో, భక్తితో దానిని ధ్యానించవలెను. మరుసటి రోజు ధ్యానములోనికి చూడరాదని సూచించుటమైనది. సాధకుడు అటువంటి ఉత్సుకతను తొలగించుకొనవలెను.

ధ్యానము నందు 15 నిముషములు ఉండవలెను. ధ్యానములో కలిగిన దర్శనము లేక అనుభూతిని ఒక పుస్తకములో సమయము, తేదీ మరియు ప్రదేశము వ్రాసుకొనవలెను. నెమ్మదిగా, ఈ అనుభూతులు బాహ్య ప్రేరణలచే నియమింపబడిన మన ఎరుక యందు వికాసము కలిగించును. ధ్యానము నందు చెప్పబడిన చిహ్నములు, అంకెలు మరియు రంగులు సాధకుని యందలి దివ్య ప్రజ్ఞలను మూడు లోకములలో వికసింపజేయును.

ఈ ధ్యానములు 93 - ఇవి విషువత్‌ (రాత్రి, పగలు సమముగా వుండే కాలము) నుండి సంక్రమణము(ఉత్తరాయణము మొదలు లేక దక్షిణాయనము మొదలు) వరకు వ్యాపించి ఉండును. సంక్రమణము నుండి విషువత్ వరకు అయినచో వ్యతిరేక క్రమములో ధ్యానించవలెను. విషువత్ నుండి మొదలు పెట్టి ఒక సంవత్సరము పాటు చేయవలెనని సాధకునకు నిర్దేశించటమైనది. క్రమశిక్షణతో, స్వచ్ఛందముగ సాధకుడు ఎప్పుడైతే ఈ విధముగా ఏడు సంవత్సరములు చేయునో, మనోవికాసము పొందుట తథ్యము.

సాధారణముగా యోగ సాధకుని మనస్సు బాహ్య ప్రపంచపు విషయములచే ప్రభావితము చేయబడి ఉంటుంది. సాధకుడు దానిని అంతర్ముఖము చేయవలసి ఉంటుంది. మనస్సును అంతర్ముఖము చేసి ఆత్మానుభూతిని ఇవ్వగల సామర్థ్యము ఈ ధ్యానములకు కలదు. మనిషి లోపల విశ్వము కలదు; మనిషి చుట్టును విశ్వము కలదు. తన చుట్టూ ఉన్న విశ్వమును అనుభూతి చెందుటకు, అతని లోపలి విశ్వమును అనుభూతి చెందుట ముఖ్యము. సత్యమును అనుభూతి పొందుటకు ఇది అతి పురాతనమైన పద్ధతి.

చిట్టచివరిగా, ఈ ధ్యానములను ఆంగ్లము (English) నందు మాత్రమే చేయవలెనని గట్టిగా సూచించబడినది. అవగాహన కొరకు అవి ఇతర భాషలలోనికి అనువదించుకొనవచ్చును. కానీ ధ్యానము యొక్క శక్తి దాని శబ్దము నందు దాగి ఉన్నది, అది ఆంగ్లము నందు ఇవ్వబడినది.

ఉదాహరణ: అంతర్దర్శన ధ్యానము N° 25


(April 14, Aug. 29, Oct. 17, March 3)

In His name we live, in His temple we live;
In Him verily we live until He opens His eye in us.
In His name He lives, in His temple He lives;
In Him verily He lives, as He opens His eye in us.
In the meanwhile, let us wait, let us look to Him and not to each other.
Let us call Him in all to find all in Him,
When the life is a Car festival and not a war festival.


వివరణము:

ఇది అత్యద్భుత ధ్యానము. నిజమునకు ఇంతకు మించి చేయదగిన దేమియు లేదు. ఇది భాగవత సూత్రము. శ్రీకృష్ణుని చరమ సందేశము. ఈ ఒక్క ధ్యానము సాధకుని పరిపూర్ణుని గావించి, దైవముగా మార్చును.

అతని పేరున మనము జీవించుచున్నాము. అతని దేవాలయమున మనము జీవించుచున్నాము. దేహమే దేవాలయము. దానిలో మనమున్నాము. నిజమునకు మనయందలి ప్రాణముగను, తెలివిగను దైవమే యున్నాడు. అతడే వివిధ దేవతాశక్తుల రూపమున సృష్టి నిర్మాణము, మన దేహ నిర్మాణము కావించుచున్నాడు.

చాలాసార్లు మనము “నా దేహము, నా మనస్సు, నా జీవితము, నా తెలివి ” అని అంటాము. నిజమునకు ఇవేవి మనము సృష్టించినవి కావు. మనము వాటిని వాడుకుంటాము అంతే. ఎలాగైతే ధనవంతుని కుమారుడు తన తండ్రి ఆస్తిని తనదిగా వాడునో, మనమందరము తండ్రియైన దైవము ఆస్తిని అలా వాడుకుంటాము. కుమారుడు తండ్రి ఆస్తిని వాడినచో తండ్రికి ఎలాంటి అభ్యంతరము ఉండదు. ఇంకా తండ్రి తన కుమారునితో, ఈ ఆస్తి అంతా నీ అనందము కోసమే అభివృద్ధి చేశాను అని చెబుతాడు. కాని దానిని వాడుకొనుటకు అలవాటుపడి దానిని మనదిగా భావిస్తాము. మన దేహానికి సంబంధించినది ఏదీ మనది కాదు. అంతా మనకి ఇవ్వబడినది, కనుక కాలానుగుణముగా వెనుకకు తీసుకొనబడును. కేవలము అనుభూతి మాత్రము మనతో ఉంటుంది.

అతని పేరున మనము జీవించుచున్నాము. దైవము పేరు “నేను” ప్రతి ఒక్కరము కూడా “నేను” అంటాము. అతని పేరు వాడి, అది మన పేరు అని అనుకుంటాము. అతని ఆలయములో మనము నివసిస్తూ, అది మనది అనుకుంటాము. మనము మరపు గలిగిన మనుషులము. మనము జీవించు జీవితము మనది కానప్పటికి, మనదిగా భావిస్తాము. ఒకవేళ మన జీవితమును మనమే నిర్ణయించుకొన్నట్లయితే, మనము మన ఇష్టమున్నంత కాలము జీవించవలెను. నిజమునకు అతడు (దైవము) మూలము, మనము (జీవుడు) అతని ప్రతిబింబము. మూలమైన అతడు దేహములో జీవించదలచి నంతకాలము, ప్రతిబింబమైన మనము దేహములో జీవించగలము. ఎప్పుడైతే అతడు దేహమును వదల నిశ్చయించినాడో, ప్రతిబింబము కూడా వదలి వెళ్ళిపోవును. అనేక దేహములలో అనేక రకములుగా అతడు ప్రతిబింబించును. ప్రతిబింబములకు స్వతంత్ర అస్తిత్వం లేదని, మన అస్తిత్వం అతని అస్తిత్త్వమేనని తెలుసుకొనుము.

మనయందు అతడు కన్ను తెరవనంత వరకే, మనము మన పేరు, మన రూపము, మన జీవితము అను మాయలో జీవింతుము. ఎప్పుడైతే అతడు (దైవము) మనయందు కన్నులు తెరచునో అప్పుడు అతని పేరున మనము జీవించుచున్నామన్న సత్యము అనుభవములోనికి వచ్చును. అతని దేహములో అతడు జీవించును. అతనిలో అతడు జీవించుట నిశ్చయము. ఎప్పుడైతే దైవము మనలో కన్నులు తెరచునో అప్పుడు మాయలేదు, మరియు ప్రతిబింబించుట లేదు. అప్పుడు సత్యము అనుభవములోనికి వచ్చును. మనయందు మనవలె ఉన్నాడని తెలియును. జీవప్రజ్ఞ దైవప్రజ్ఞలో లీనమగును.

ఈ సత్యము బోధపడనంత వరకు, మనము ఏమి చేయవలెను? దైవానుగ్రహము వలన మాయ తొలగునంత వరకు ఏమి చేయవలెను? మాయ, అజ్ఞానము యొక్క బాధలను అనుభవించ వలసినదేనా? అటువంటి అవసరము లేదు. మనము ఎవరిని చూచిననూ అతనినే (దైవమును) చూచుచుండవలెను. ఎవరిని విన్ననూ అతనినే వినవలెను. ఒకరి నొకరు చూచుట కాక దైవమును చూడవలెను. ఇది ఒక ఆనందభరితమైన ఆట, విఫలమైననూ మరల మరల ప్రయత్నించవలెను. అప్పుడు జీవితము జగన్నాథ రథమువలె సాగ గలదు. లేనిచో అది మహా సంగ్రామమే.

ధ్యానములో మనలను వేచి వుండమని చెప్పబడినది. వేచివుండుట అను గుణము సాధకుడు లేక శిష్యునికి ఎంతో ముఖ్యము. వేచివుండే సామర్థ్యము కలవాడే దేనినైనా పొందే సామర్థ్యమును పొందును. స్వీకరణ అన్నది జీవితంలో ఒక భాగము. కాలము ద్వారా జీవితము అందింపబడుతూ ఉంటే దానిని మనము స్వీకరిస్తాము. ఎవరైతే వేచివుండలేరో వారు జీవితము అందించు దానిని పొందలేరు. ప్రతి ఒక పని తరువాత ఇంకొక పని ప్రారంభించే ముందు కొంతకాలము వేచివుండ వలసి ఉంటుంది. ఈ విరామము లేక వ్యవధి మనలను సత్త్వము నందు ఉంచుతుంది. సత్త్వము లో ఉన్నపుడే మనము దివ్యమైన విషయములను పొందగలుగుతాము. కదలిక మరియు విరామము లయాత్మకమైన జీవితమునకు రెండు రెక్కల వంటివి. విరామము ద్వారానే సత్త్వములో ప్రవేశిస్తాము.