{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ఆధ్యాత్మిక మార్గములో అభివృద్ధి

ప్రాథమిక సూత్రములు

ప్రాథమిక సూత్రముల జ్ఞానము కలిగి ఉండటము మార్గము కాదు, దానిని మెల్లమెల్లగా ఆచరించుట మార్గము: “నెమ్మదిగా వేగవంతము చేయవలెను.”
జీవన శైలి, ఆహారమునకు చెందిన ప్రాథమిక సూత్రములను పాటించకపోయినచో ఆధ్యాత్మిక సాధన వీలుపడదు. వీటికి చెందిన ప్రాథమిక సూత్రములను నిరంతరము పాటించినచో అంతర్గత మార్పులు కలిగి వికాసమునకు దారితీయును. ఆధ్యాత్మిక భావనలు, ఆలోచనలలో పురోగమించినకొలది, సాధారణముగా మార్గము యొక్క మూలసూత్రములను మరచిపోవుదుము.

ఆహారము మరియు ప్రజ్ఞ

ఆధ్యాత్మిక శిక్షణ మొత్తము సూక్ష్మతరమైన శరీర నిర్మాణము వైపునకు దారితీయును. దానికొరకు మనము తీసుకొను ఆహారము ముఖ్యము. మనము తీసుకొను ఆహారము నందు నాణ్యతను పెంచుటద్వారా మన భావనల యొక్క నాణ్యతను పెంచుకొనవచ్చును. మనకు సరిపడు ఆహారమును స్వీకరించినచో అది మనలను శక్తివంతము చేయును. రుచికరమైన ఆహారమును సద్భావనలతో వండవలెను. ఏమి తినవలెను, ఎప్పుడు తినవలెను, ఎంత తినవలెను, మరియు ఎలా తినవలెను అని తప్పక తెలిసి ఉండవలెను. ఈ జ్ఞానమును మనము తప్పక ఆచరణలో పెట్టుట నేర్చుకొనవలెను. శుభ్రము, నిర్మలము అయిన ప్రదేశములో, నిశ్శబ్దముగా, ఉల్లాసవంతమైన భావములు కలిగి భుజించవలెనని సూచించబడినది. మాంసము, పులిసినది, దుర్వాసన వచ్చు పదార్థములను తినరాదు.

ఆధ్యాత్మిక పురోగతి మరియు సేవ

“మనము అందుకున్నదానిని అందుకున్నట్లు పంచవలెను” అన్నది ఆధ్యాత్మిక మార్గమున ధర్మము.
నిశ్వాస చేయకుండా ఉచ్ఛ్వాస చేయలేము. మనము సేవ చేయదలచనిచో మనము సహాయమును పొందలేము కూడా. సేవాత్మక భావము లేకుండా ధ్యానము చేయుట అపాయము. మనము అందుకొన్నదాని కంటే ఎక్కువ పంచినచో, కర్మ విమోచనము కలుగును. కనుక మన పరిసరముల యందు ఎదో ఒక విధముగా సేవ చేయవలెను, దానికి కావలసిన నైపుణ్యము పొందవలెను.

ఆధ్యాత్మిక మార్గములో అభివృద్ధి

స్థానీకరణము చెందిన వ్యక్తిగత ప్రజ్ఞ యొక్క పరిమితులను తొలగించి, దానిని చైతన్యము యొక్క మరింత విశాలవంతమైన కక్ష్యలలోనికి తీసుకువెళ్ళటమే ఈ మార్గము. పలువిధములుగా విభజింపబడిన మానసిక స్థితి నుండి, అంతర్లీనముగా, సంపూర్ణముగా ఉన్న ఉనికితో ఏకత్వము చెందించు దిశగా కొనిపోవుటకే ఈ మార్గము. “యోగము” అనగా కలయిక.

యోగ మార్గము

ప్రాచీన యోగశాస్త్రము, బాహ్య విషయముల యెడల మన మనస్సు మరియు ఇంద్రియముల యొక్క ప్రతిచర్యలను తటస్థీకరించి సంతులనము మరియు సమతుల్యత పొందుటను నేర్పును. యోగమనగా ప్రజ్ఞ యొక్క అన్ని పొరలలో (లోకములు) ఎరుక కలిగి, అన్నిటినీ సమన్వయము చేయుట తెలిసి ఉండుట. వివిధ రకములైన యోగములన్నియు ఒకే యోగమునకు చెందిన భాగములు, శాఖల వంటివి. యోగాభ్యాసము సమన్వయాత్మకమైన అవగాహన పొందుటకు వీలు కలిగిస్తుంది. ప్రతిదినము చేయు యోగాభ్యాసము వలన పవిత్రీకరణ జరుగును.

ముఖ్యమైన సూత్రము

వెలుగును చేరవలెనన్న మనము ఉద్వేగములు మరియు ఆలోచనలు అనెడి ద్వారముల గుండా ప్రయాణించవలసి ఉంటుంది. ఆవేశపూరితములు, ఉద్వేగభరితమైన ఆలోచనలు మనలను పరిమితులను చేసి వెలుగు చేరుటకు అవరోధము కలిగించును. ఇటువంటి అవరోధములను అధిగమించుటకు ఎటువంటి ప్రత్యేకింపులు లేకుండా, స్వలాభము చూసుకోకుండా ఇతరులకు సహాయము చేయుట అనునది ముఖ్య సూత్రము. “నీ పనులన్నియు ఇతరుల శ్రేయస్సు కొరకు అయి ఉండవలెను”.

మానవుని సూక్ష్మ శరీరములు

మానవ దేహము వివిధ దశలకు అనుగుణమైన సాంద్రత గల పొరలను కలిగి ఉంటుంది.

  • ప్రాణమయ శరీరము (The physio-etheric body or vital body)
  • భావోద్వేగ శరీరము (The emotional body)
  • మనోమయ శరీరము (The mental body)


వీటికి మించి అనేక నిరాకార లోకములున్నవి.

ప్రాణమయ శరీరము (The physio-etheric body)

ప్రాణమయ శరీరము భౌతిక శరీరమును పటిష్ఠపరచి ఒక రూపముగా ఉంచును. మరణ సమయములో ప్రాణమయ శరీరము వదిలి వెళ్ళుట వలన భౌతిక శరీరము నశించిపోవును. ఆధ్యాత్మిక జీవనము వలన ప్రాణమయ శరీరము పటిష్ఠము చెంది రూపమును ఆకర్షణీయముగా ఉంచును. దానికి వ్యతిరేకముగా జీవించినచో ప్రాణమయ శరీరము త్వరగా నశించును.

భావోద్వేగ శరీరము (The emotional body)

కోరికలు, అభీష్టములు, సానుభూతి, అసహ్యము, అహంకారము, ఆశయము, ద్వేషము, మరియు భయము మొదలగునవి భావోద్వేగ శరీరము యొక్క లక్షణములు. ఎవరైతే ఈ భావోద్వేగములతో నడిపించబడునో అతనిని జంతులక్షణములు కలవాడంటారు. ఎప్పుడైతే మన భావోద్వేగములను పవిత్రీకరించుకొని ఉన్నత ఆశయముల వైపు మనస్సును మళ్ళించునో అప్పుడు భావోద్వేగములు చల్లారి తపస్సు వైపునకు దారితీసి ఉద్ధారణ జరుగును.

మనోమయ శరీరము (The mental body)

మనోమయ శరీరము ఆలోచనలతో నిండి, విద్యుత్‍ను అందుకొను దీపము వలె, అవి పైన ఉన్న బుద్ధి నుండి శక్తిని అందుకొనును. ఆలోచనలు ఎడతెగక ఒకదాని తరువాత ఒకటి వచ్చుచునే ఉండును. బాహ్యముతో మన అమరిక వలన మనము ఎటువంటి ఆలోచనలను పొందుతామో నిర్ణయించబడుతుంది. మనము ఏర్పఱచుకొన్న అభిప్రాయములు/సిద్ధాంతములు మనల్ని వాటిలో చాలా కాలము కూరుకుపోయేలా చేస్తాయి. ఎప్పుడైతే మనము పై లోకములతో అనుసంధానము చెందుతామో, ఆత్మ నుండి ప్రేరణ పొందుతాము.

ఆత్మ యొక్క పిలుపు

ఆత్మతో సంబంధము లేనిచో, మనము స్వభావము లేక వ్యక్తిత్వము నందు బంధింపబడి ఉందుము. దిగ్బంధము చేసినట్లు అనుభూతి పొందుతాము. అలా మనలో లోతుగా పేరుకు పోయిన అవిశ్రాంతి ఏదో ఒక దానికోసము వెతుకుతుంది, అది మొదట మనకు తెలియదు - అదే ఆత్మను వెతుకుట. బాహ్య ప్రపంచము నందు మిక్కిలి కార్య నిమగ్నత కలిగి ఉండుట వలన కొందరు ఆత్మ యొక్క పిలుపును అణచివేస్తారు. కానీ ఆత్మ నుండి పిలుపు ఎప్పటికి ఆగదు.

వంతెన

ఆత్మకును, వ్యక్తిత్వ స్వభావమునకు మధ్య అగాధము కలదు, దానిపై వంతెన నిర్మించవలెను. బాహ్యములో కరుడుకట్టిన మనస్సుకును, అంతరంగములోని సృజనాత్మక మనస్సుకును మధ్య వంతెన నిర్మించవలెను. ఇది ఆలోచనల పొరల నుండి బుద్ధి అనెడి ఆత్మ చైతన్యపు పొరలలోనికి నడిపిస్తుంది. ఈ వెలుగు వంతెనను నిర్మించుటకు జ్ఞానము, విచక్షణ అవసరము. వంతెన నిర్మాణము పూర్తి అయిన తరువాత ఆత్మ మన వ్యక్తిత్వ స్వభావము ద్వారా ప్రకటిత మవుతుంది. అప్పుడు మనము మన ఆత్మను అనుసరించి జీవిస్తాము.

ఆత్మ మరియు స్వభావము

స్వభావము “నేను” అను ఆత్మకు అద్దము వంటిది. పరావర్తనము చెందిన కాంతి అసలైన వెలుగు కాదు. ప్రతిబింబిము వికారము చెందగలదు, కాని దానికి కారణమైన వెలుగుకు వికారము లేదు. ప్రకృతిరీత్యా ఆత్మ యందు సంకల్పము, ప్రేమ మరియు వెలుగు లేక బుద్ధి ఉన్నవి. స్వభావము నందు ఉన్నత సంకల్పము వ్యక్తిగత కోరిక అగును. ప్రేమ ఉద్వేగము అగును. అర్థము చేసుకొనుట అనునది భావోద్వేగముల ద్వారా మాత్రమే జరుగును. బుద్ధి వ్యక్తిగత శ్రేయస్సు కొరకు ఉపయోగించు మేధస్సు అగును.

శక్తి ప్రవాహము

మానవుని ప్రాణమయ శరీరము శక్తి ప్రవాహములచే వ్యాపించి, కొన్ని ముఖ్యమైన శక్తి కేంద్రములను కలిగి ఉన్నది. శక్తి వలయములుగా తిరుగును: చక్రములు, పద్మములు అను 6 ముఖ్య కేంద్రములు మరియు సహస్రార కేంద్రము కలవు. ఇవి భౌతిక దేహమున స్రావము కలిగిన గ్రంథులుగా ఘనీభవించినవి. చాలా మందిలో ఈ శక్తి కేంద్రములు సరిగా పనిచేయక ప్రాణశక్తి అవరోధింపబడుతుంది. ధ్యానము ద్వారా, ప్రాణాయామము ద్వారా: నెమ్మదిగా, మృదువుగా, దీర్ఘముగా మరియు సమానముగా శ్వాసించి తిరిగి శక్తి కేంద్రములను ఉత్తేజపరచవచ్చును. ఈ కేంద్రములలో పద్మములను ధ్యానించుట ద్వారా మనయందలి వ్యవస్థను ఆత్మ శక్తితో నింపవచ్చును.

కేంద్రములు మరియు కుండలిని

కుండలిని అనబడు ప్రాణశక్తి మూలాధార కేంద్రము నందు నిద్రాణమై ఉన్నది. దానిని జాగృతము చేసినచో అది వెన్నెముక ద్వారా ఊర్థ్వముగా ప్రయాణించును. అప్పుడు నెమ్మదిగా, సహజముగా చక్రములన్నియు పద్మములుగా వికసించును.

హెచ్చరిక: ఈ కేంద్రముల యందు ఏకాగ్రము పనికిరాదు, సూటిగా, బలవంతముగా వాటిని జాగృతి చేయరాదు.

కేంద్రములు మరియు లోకములు

లోకములు కేంద్రములు
దైవము, సంకల్పము సహస్రార కేంద్రము
ఆత్మ, చైతన్యము ఆజ్ఞా కేంద్రము
వివేకము విశుద్ధి కేంద్రము
బుద్ధి లోకము హృదయ కేంద్రము
మనోలోకము మణిపూర కేంద్రము
భావోద్వేగ లోకము స్వాధిష్టాన కేంద్రము
భౌతిక లోకము మూలాధార కేంద్రము