{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ఉత్తరాయణ సంక్రమణము

“ధ్యానము అనగా చేయునది కాదు, జరుగునది”

ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి సూర్యుని గమనమును, మరియు రోజులోని, మాసములోని, సంవత్సరములోని ముఖ్యమైన బిందువులలోకి సూర్యుని గమనమును మనము జాగ్రత్తగా గమనించవలెను. అలా చెయ్యడము వలన మనము శక్తులలో జరుగుతున్న మార్పులను అనుభవించి, వాటితో లయబద్ధముగా మనము అనుసంధానము చెందవచ్చును.


ధ్యానములు, క్రతువులు | పండుగలు

అతి ముఖ్యమైన సమయములు

ఉత్తరాయణ సంక్రమణము

మనము అంతర్ముఖముగా మౌనముగను, అప్రమత్తముగను ఉన్నప్పుడు, ప్రాతః సమయములో ఆ దినము ఎలా విప్పారుతుందో మనము అనుభూతి చెందవచ్చును. ఉదయము మొదటి రెండు గంటలలో ఆ రోజు యొక్క మౌలికసూత్రము మనకి అందుతుంది. అణువు, మహత్తుల మధ్య అనుగుణ్యము యొక్క జ్ఞానము ప్రకారము, వచ్చే 24 గంటలలో సమయము అనే పుష్పము ఎలా వికసిస్తుందో తెలిసివస్తుంది. ఈ సూక్ష్మమైన లయక్రమమునకు మనము అనుసంధానము చెందితే ప్రకృతిలోనూ మరియు మనలోనూ జరుగుతున్న మహత్తరమైన క్రతువు మనకి దర్శనమవుతుంది.

ప్రతి దినములోను ఉదయము, మిట్టమధ్యాహ్నము, సాయంకాలము, అర్ధరాత్రము అని నాలుగు ముఖ్యమైన భాగములు ఉంటాయి. ఒక మాసములో పూర్ణిమ, అమావాస్య, మరియు రెండు అష్టమి తిథులు ఉంటాయి. సంవత్సరములోని ముఖ్యమైన సమయములను ఉపదేశ సమయములుగా భావిస్తారు – దానికి మనము ఆ సమయములో భూమి మరియు సౌర ప్రజ్ఞలలో జరిగే మార్పులని అర్థము చేసుకుంటే ఆ ప్రజ్ఞలతో అనుసంధానం చెందగలము:

  • ఉత్తరాయణ సంక్రమణము - మకర రాశి ప్రారంభములోని 22 డిసెంబరు సంవత్సరము యొక్క ఉదయము.
  • ఉత్తర విషువత్ - మేష రాశి ప్రారంభములోని 21 మార్చి సంవత్సరము యొక్క మిట్టమధ్యాహ్నము.
  • దక్షిణాయణ సంక్రమణము - కర్కాటక రాశి ప్రారంభములో 21 జూన్ సంవత్సరము యొక్క సాయంకాలము.
  • దక్షిణ విషువత్ - తులా రాశి ప్రారంభములో 22 సెప్టెంబరు సంవత్సరము యొక్క అర్థరాత్రము.

సూర్యుని మరియు చంద్రుని యొక్క గమనములు మనకి ప్రధానమైనవి. సూర్యుడు మన ప్రజ్ఞకు లేక ఆత్మకు ప్రతీక. చంద్రుడు మన మనస్సు లేక స్వభావానికి ప్రతీక. ఈ నాలుగు ముఖ్య దినములో భూగోళము సౌర ప్రజ్ఞతో ప్రత్యేకముగా స్పృశింపబడుతుంది. ఈ దినములలో సౌర ప్రజ్ఞా ప్రసారము ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి యొక్క ఈ పర్వదినములను మనము తప్పకుండా ఆచరించాలని పరమగురువులు ఆశిస్తారు. కాబట్టి మనము ఈ నాలుగు దినములను ప్రజ్ఞతో అనుసంధానము చెందడానికి ప్రత్యేకముగా కేటాయించుకోవలెను. అప్పుడే మనము సౌర ప్రజ్ఞ ద్వారా వికాసము చెందగలుగుతాము. ఈ సమయములలో తేలికైన ఆహారము తీసుకుని, అంతరాయములను అధిగమించి, ధ్యాన భావనతో ఉండవలెను.

ప్రజ్ఞ యొక్క ఊర్ధ్వగతి

కర్కాటక రాశి నుండి మకర రాశి వరకూ సూర్యుడు దక్షిణాయన గమనము చేస్తున్నప్పుడు ఆత్మ పదార్థములోనికి అవరోహణము చెందుతుంది, ప్రజ్ఞ ఉపసంహరణము జరుగుతుంది. ఉత్తరాయణ సంక్రమణము దగ్గర నుంచి సూర్య భగవానుడు తిరిగి వృద్ధి చెందుతాడు; మకర రాశి నుండి ఆత్మ తిరిగి ప్రజ్ఞలోకి ఆరోహణము చెందుతుంది. సుపర్ణుడు, సర్పముల కథలు ఈ రెండు రాశుల అక్షమునకు సంబంధించినవి. సర్పములు అధోముఖముగా గమనము చేస్తాయి; సుపర్ణుడు ఊర్ధ్వముఖముగా గమనము చేస్తాడు. చీకటులకు దేవత అయిన దితి (కద్రువ) ద్వారా సర్పములు జన్మించారని, వెలుగులకు దేవత అయిన అదితి (వినత) ద్వారా సుపర్ణుడు జన్మించారని వేదములలో వివరించారు. వీరిరువురూ విరాట్పురుషుని స్త్రీలు.

ఈ సంకేతార్థములు రాశి చక్రములోని నిగూఢార్థములను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. సంవత్సర చక్రములో రెండు భాగములు ఉంటాయి. మకరము నుంచి కర్కాటకము వరకూ ఉన్న మార్గమును మకర (దివ్య) తోరణమని, కర్కాటకము నుంచి మకరము వరకూ ఉన్న మార్గమును రాజతోరణమని అంటారు. ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్రములో మకరమును పర్వతమని, కర్కాటకమును లోయ అని అంటారు. కర్కాటకమును పునర్జన్మ స్థానముగను, ప్రాణము యొక్క ప్రవేశముగను, మకరమును మోక్షమునకు స్థానముగను, నిష్క్రమణముగను భావిస్తారు. చాలా సంస్కృతులలో సూర్య భగవానుడు కొత్త జన్మము తీసుకోవడము కొరకు మరణిస్తాడని కథలు ఉన్నవి. కాలచక్రములో సృష్టి యొక్క జననము, మరణము గురించి కూడా ఇవి తెలియచేస్తాయి.

రక్షకుని జననము

ప్రాచీన కాలము నుంచి 22 డిసెంబరుని రక్షకుని జన్మదినముగా ఉత్సవములు జరుపుకుంటూవున్నారు. భగవంతుడు మనలో జన్మించి, మనకి ఊర్ధ్వగతులు కలిగిస్తాడనే భావముతో ప్రపంచములోని అనేక ఆశ్రమములలో రక్షకుని జన్మదిన క్రతువుని నిర్వర్తించుకుంటారు. ఈ దినమున ఉత్కృష్టమైన ఆత్మలు కూడా దివ్య ప్రయోజనములను నిర్వర్తించడానికి శరీరములలోకి దిగి వస్తారు.

నిజమునకు, ఏసు క్రీస్తు కూడా మకర సంక్రమణము అర్థరాత్రము గంటలలో జన్మించినాడు. అందువలనే అతనిని కూడా రక్షకుడిగా భావిస్తారు. మొదటి శతాబ్దములలో అతని జన్మదినోత్సవము 22 డిసెంబరు దినముననే జరుపుకునేవారు. కాని తదుపరి కాలములలో, రాజకీయ కారణముల వలన అతని జన్మదినోత్సవమును 25 డిసెంబరుకి మార్చడము జరిగినది. పరమగురువుల అనుగ్రహము వలన, ఈ విషయము ఇప్పటికి కొంత తెలియజేయబడినది. మరిన్ని వివరములు ముందు, ముందు తెలియజేయబడతాయి.

మకర సంక్రమణము అర్థరాత్రము సమయములో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు అతడు కన్యా రాశి నుంచి ఐదవ ఇంటిలో ఉంటాడు. ఇది శిశువు జననమునకు సంకేతము. అందువలనే, సూర్యుడు మకరములో ప్రవేశించినప్పుడు అతనిని కన్య యొక్క శిశువుగా భావిస్తారు. ఋషులు అతని ఎరుపు రంగు ప్రభాత కిరణములను సూర్యుని రక్తముగను, రక్షకుని రక్తముగను భావిస్తారు. ఈ ఉత్తరాయణములో ఉన్న సూర్యుని కిరణములు మన పాపములను తొలగించి, మన భౌతిక బంధములను తొలగించి, మనలో కొత్త ప్రాణ శక్తులను మేలుకొలుపుతాయి. ఇవి ఆధ్యాత్మిక జీవనానికి ఆహారము. సూర్య భగవానుడు ఈ కిరణములను సంవత్సర క్రతువులో మళ్ళీ మనకి ప్రసారము చేసి, మన ప్రజ్ఞను ఊర్ధ్వముఖము చేసుకోవడానికి సహాయము చేస్తాడు.

సాధకులు ఈ రహస్యములతో అనుసంధానము చెంది, ఆధ్యాత్మిక క్రిస్మస్ పండుగ చేసుకోవడము చాలా మంచిది. మకర సంక్రమణపు అర్థరాత్రి సమయములో ధ్యానము చేసుకుని, సూర్య భగవానుడు మూలాధారములో నిద్రిస్తున్న మన ఆత్మలను మేల్కొలిపి, మన కుండలినీ చైతన్యమును ఊర్ధ్వగతి చెందిస్తాడని భావించుకొనవలెను. మకర సంక్రమణమునకు సన్నాహాములు ఒకటి నుంచి మూడు మాసముల ముందు నుంచి ఉన్ముఖమై ఉండుట మంచిది. కాకున్నచో కనీసము రెండు దినముల ముందు మాత్రము ఖచ్చితముగా ప్రయత్నించవలెను.

మకరముతో పోరాటము

జ్యోతిష్య పరముగా, మకర సంక్రమణము ముందు దినమున సైతాను లేక శనిని ఓడించడము అనే ఘట్టము కూడా జరుగుతుంది. దీనినే మకరముతో పోరాటముగా కూడా వర్ణిస్తారు. సైతాను మన నీడ. మనలో వెలుగు ఉంటే, అదే సమయములో వెలుగు యొక్క నీడ కూడా మనతో ఉంటుంది. మనను ఆధ్యాత్మిక మార్గమునుంచి తప్పించడానికి సైతాను తర్కముతో కూడిన సూచనలు ఇస్తాడు. ఉదాహరణకు, మనము చాలా పని చేసాము కాబట్టి ధ్యానము చెయ్యకుండా నిద్రించవచ్చు అని మనకి సూచన ఇస్తాడు.

మన స్వభావమును ఆత్మకి సమర్పణ చేసుకుందామనే భావన మనకి ఉంటే, మనము మన ఆత్మని బలోపేతము చెయ్యవలెను – మన స్వభావముతో పోరాటము కాకుండా దాని సహకారము పొందవలెను. మన ఆత్మ శక్తివంతము అయితే అది మన స్వభావమును సరైన రీతిలో సంరక్షించుకుంటుంది. మనము మన స్వభావమును జయించి, దాని సహకారము పొందవలెను – ఎందుకంటే స్వభావము లేకుండా మనము ఏమీ చెయ్యలేము. స్వభావము కార్యనిర్వాహణాధికారి, ఆత్మ మార్గదర్శి. ఎంత మంచి మార్గదర్శి అయినా కార్యనిర్వాహణాధికారి లేకుండా ఏ పని చెయ్యలేడు – మన మంచి ఆశయములు ఆచరణలో ఉండకుండా ఆశయములుగనే ఉండిపోతాయి.

సూర్య భగవానుడు

మకరములో సూర్యుడు మన మూలమునకు తిరుగు ప్రయాణము చెయ్యడానికి శక్తిని ఇస్తాడు. సూర్యుడు మన సౌర కుటుంబానికి స్వామి, అధిదేవత. మనము అతని కిరణమే గనుక మనము తిరిగి అతనితో ఏకమవుతాము. మన ఆత్మకి ఆతడే మూలము. స్వతహాగా సౌర దూతలము, భగవంతుని కుమారులము, సూర్య కుమారులము అయిన మనము ఈ భూమి మీదకి అనుభూతి కొరకు వచ్చినవారము. అలా వచ్చిన మనము, మన నిజస్వరూపమును మరిచిపోయి భూమి జీవులమని భ్రాంతి పడుతున్నాము. మన నిజ స్వరూపము “నేను”. సూర్యుడు “నేనైన నేను”. “నేను” దానినుంచి వేరు కాదు.

సూర్యుని ఊర్ధ్వముఖ గమనముతో పాటు మనముకూడా సునాయాసముగా చీకటి నుంచి వెలుగులోకి ఆరోహణము చెందవచ్చు. ఇది పదార్థము నుంచి ఆత్మలోకి, అజ్ఞానము నుంచి జ్ఞానములోకి ఆరోహణము చెందడము. అందువలన, మనము కూడా ఊర్ధ్వముఖముగా పయనిస్తూ, మన దైనందిన జీవనములో క్రమబద్ధత, మంచి ఆశయములు మరియు ఆలోచనలు, మాటలు మరియు చేతలు తీసుకుని రావడమే ఈ క్రిస్మస్ (ఉత్తరాయణ సంక్రమణము) పండుగ జరుపుకోవడానికి ఉత్తమమైన మార్గము.

జ్ఞానముతో కూడిన జీవనము

సూర్యని గమనమును మనలోపలి అంతర్గత రాశి చక్రముతో అనుసంధానము చెయ్యవలెనని జ్ఞాన బోధనలు మనకి సూచన ఇస్తాయి. ఈ అనుగుణ్య శాస్త్రమును న్యాస విద్య అంటారు. ఇది ధ్యానమునకు అతి ముఖ్యమైనది. ఈ శాస్త్రము పన్నెండు దళముల అనాహత చక్రమునకు కర్కాటకరాశికి మరియు, మకర రాశికి మరియు ఎనిమిది దళముల ఉన్నత హృదయ పద్మమునకు మకరరాశితోను గల సంబంధమును తెలుపుతుంది. ఈ అష్టదళ పద్మమును మన ఛాతి పైభాగములో దర్శించుకుని, “ఓం నమో నారాయణాయ” అను మంత్రముతో అనుసంధానము చెందవచ్చును.

ఈ విశ్వ ప్రణాళికతో మనము అనుసంధానము చెందడము వలన మనము సమన్వయముతో జీవించగలము. లేకపోతే జ్ఞానము జ్ఞానముగానే మిగిలిపోతుంది, మనము మనముగానే మిగిలిపోతాము. దివ్య లోకములలో ప్రవేశించాలంటే మనము జ్ఞానముతో జీవిస్తూ, బాల్యపు నిరాడంబరతతో కూడి ఉండవలెను. మనము అంతర్ముఖముగా అనుసంధానము చెందిన ప్రతిసారి ఆత్మ ఆనందముతో నిండుతుంది. ఎరుకతో ఉత్తరాయణ సంక్రమణముతో మనము అనుసంధానము చెందడము వలన మనకు ప్రతి సంవత్సరము మరి కొంత ఆనందము పెరుగుతుంది.