{"timeout":"7000","width":"990"}
  • ధ్యానము
  • క్రతువులు
  • పవిత్ర స్థలములు
  • పరమగురువులు
  • బృంద జీవనము

ధ్యానము

ఆంతరంగికమైన ఎదుగుదలకు ధ్యానమే ఆధారము. ఆ నిశ్శబ్దపు క్షణములలోనే ఆత్మయొక్క నిశ్శబ్ద అభివృద్ధి సంభవించును.

క్రతువులు

ఆరాధన, ప్రార్థనలు, క్రతువులు, మరియు ధ్యానములు మొదలైనవన్నీ అందరిలోని 'ఒకే' వెలుగుతో సంబంధమేర్పరచుకొనుటకు సాధనములు మాత్రమే.

పవిత్ర స్థలములు

పవిత్ర స్థలములలోకి ప్రవేశించేటప్పుడు జాగరూకులమై ఉండాలి. నిశ్చితమైన అభిప్రాయములతో ప్రవేశించకూడదు. ఆ 'సమక్షము'నందు ఉండుట తప్ప ఏమీ చేయరాదు.

పరమగురువులు

పరమగురువుల జీవితములు, వారి చర్యలు, మరియు వారి బోధనల అధ్యయనము మనకు స్ఫూర్తినిచ్చి, మన ఆలోచనా ధోరణులలో మార్పులు తీసుకువస్తాయి.

బృంద జీవనము

బృంద చైతన్యమునకు, బృంద కార్యములకు, స హృదయము ఒక్కటే మార్గము.

జగద్గురు పీఠములో ప్రవేశము


“ఈ సమూహము వ్యక్తుల బహిరంగ కలయిక కాదు. వారి హృదయముల అంతరంగ సమీకరణము.”

జగద్గురు పీఠము | ఎలా ప్రారంభించాలి? సంప్రదించండి

వారధి

జగద్గురు పీఠము ( The World Teacher Trust) ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమ్మేళనము ప్రయోజనముగా ఏర్పడినది. ఈ సంస్థ జగద్గురువైన మైత్రేయ మహర్షి (English) పేరుమీద వెలసినది.

జగద్గురు పీఠమునకు స్ఫూర్తిదాయకులైన మాస్టర్ సి. వి. వి. భిన్నముగా కనిపించే ఈ సృష్టి యొక్క మూలమైన బ్రహ్మమును తెలిసికొనుటకు, మరియు వివిధ రూపములలోని బ్రహ్మమును (చైతన్యమును) అనుభూతి చెందుటకు వలసిన దివ్య శక్తులను గురుపరంపర నుండి అందుకొనుటకు "మాస్టర్ సి. వి. వి. నమస్కారం" అను మంత్రమును ఇచ్చినారు. ఈ “సి. వి. వి.” అను శబ్ద సూత్రము వ్యక్తులను బృందములుగా మలచు ఇంద్రజాలము. ఈ శబ్దము WTT సంస్థకు ముఖ్య భూమిక, వాహికగా తన ఆకర్షణ శక్తితో భౌగోళికముగా అందరినీ కలుపుతూ, వారధి నిర్మిస్తున్న సంగతి అనుభవైకమే.

ఈ “సి. వి. వి.” మంత్రము ఒక తాళం చెవిగా వినియోగపడుతూ ప్రేమ, ఆదరణ, దివ్య సంకల్పము, దీక్షాయుతమైన ఆచరణలతో కూడిన దివ్యమైన ఆకర్షణ ఇచ్చి, అద్భుతమైన ప్రకాశవంతమైన చైతన్య కిరణములు పంచి, వ్యక్తులను బృందములుగా మార్చుట ఎంతో ఆశ్చర్యకరము.

స్ఫూర్తి

మాస్టరు చైతన్యముతో అనుసంధానము చేయుట వలన సద్గురువు ఉపదేశములు అంతఃకరణము నందే జరుగును. ఆ స్ఫూర్తి వలన ఒక గ్రంథము చదవాలని గాని, ఒక ప్రాంతము దర్శించాలని గాని, ఒక విషయము తెలుసుకోవాలనే జిజ్ఞాస గాని లోలోన కలుగుతుంది. ఈ ఆలోచనలు మనవే అన్నట్టుగా ఉంటాయి, కానీ అంతరంగములో సద్గురువే ఆ భావనలు కలుగ చేస్తారు. ఈ విధంగా బాహ్యముగా కనబడుతున్నసద్గురువు కేవలం మన ఆత్మకు ప్రతిరూపమే.

సద్గురువు సూటిగా సాన్నిధ్యమునివ్వరు. ఈ పై ప్రక్రియ ద్వారా జరగవలసినదే. ఈ విధమైన సాన్నిధ్యము వలననే జగద్గురు పీఠములో సభ్యునిగా చేరటము జరుగును.

బృందజీవనము యొక్క ఉదాత్త ప్రయోజనము


జగద్గురు పీఠము తలుపులు లేని గృహము వంటిది. ఇందు మసలుటకు, యోగ జీవనము గడుపుటకు ప్రత్యేక నిబంధనలు లేవు. ప్రవేశము, నిష్క్రమణమునకు సర్వ స్వతంత్రము కలదు. ఇందుండియు యితర గురువుల ఆశ్రమములలో పాల్గొను అవకాశము, స్వేచ్ఛ ఉన్నది.

ఇందు అతి ఉదాత్త బృందజీవనము అలవాటు అగును. అందు సభ్యుడు అనుభూతితో, ఆనందముతో, సంతృప్తితో, ప్రశాంతతతో తనకు తానుగా ఉండదలచు కొనును. షరతులు, నిబంధనల వలన కాదు.

బృందములుగా శక్తి, సామర్థ్యములు

మన పురోభివృద్ధికి, బృందములుగా కలసి మెలసి పని చేసినపుడు జనించు శక్తి, సామర్థ్యములు యోగమునకు పురోగతి నిచ్చును. ఆధ్యాత్మిక చైతన్యము సులభముగా శక్తివంతముగా ప్రసారము జరిగి, ఉన్నత లోకములనుంచి ప్రజ్ఞ అనుభవమౌతుంది. జగద్గురు పీఠములో ప్రధానంగా నిర్వర్తించుకొనవలసినది సమిష్టిగా ప్రార్థన.

యోగసాధన వలన జీవుడు పరిణతి చెందుతాడు. సమిష్టి ప్రార్థనల వలన ఐకమత్యము, ఆదరణ, వాత్సల్యము పెరుగుతాయి. లౌక్యము, భిన్నాభిప్రాయములు తొలగుతాయి. మనిషి అంతరంగములో ఎంత లోతులకు వెళితే అంత ఘర్షణ తగ్గుతుంది. బాహ్యముననే ఉంటే పరస్పర విరుద్ధమైన విషయములందు ప్రజ్ఞ కొట్టుమిట్టాడుతూ ఉంటుంది.

క్రమమైన సమిష్టి ప్రార్థనలు, మరియు గురువుల ప్రవచనములు వినుట వలన అంతరంగము నందు ఏకత్వము అనుభూతమై, బాహ్యమునందు భిన్నత్వము తొలగి, భిన్నత్వంలో ఉండే వారినందరినీ చక్కగా దరిచేర్చి, అందరి ద్వారా సత్కార్యాలు, సేవా కార్యక్రమములు చేయించ వచ్చును. బృందములుగా సమిష్టి సాధన ఒక ప్రయోగశాల వంటిది.

బృందములలో ప్రవేశించుట

మీకు అందుబాటులో ఉన్న బృందములో ప్రవేశము కావలెనన్నను, లేదా మీరే ఒక బృందముగా ఏర్పడవలెనన్నను, పరమ గురువుల యొక్క ఉపదేశములను నిత్యము పాటించుట, అనుసరించుట, అనుస్యూతముగా కొనసాగించుట ప్రధానము. వ్యక్తులు ఆ చైతన్యమును, విజ్ఞానమును అందుకొన్నప్పుడు వారి మధ్య మాస్టరు యోగమునకు సంబంధించిన ఆకర్షణ, రసాయనము జరిగి సత్సంకల్ప కార్యములలో పాలుపంచుకొందురు.

బృంద నిర్వహణ

పరస్పర సహకారము వలన, వ్యక్తిగత అహంకారములో సర్దుబాట్లు జరిగి బృంద ప్రయోజనము నెరవేరుట జరుగును. ఇందు వాద ప్రతివాదనలు, తీక్షణమైన అభిప్రాయములు తొలగి వ్యక్తులు సామరస్యముతో బృందముగా మారుట జరుగును.

కలసి మెలసి ఒక బృంద ప్రయోజనము కొరకు కృషించుటలో అందరి లక్ష్యము ఒకటిగా నుండి, కార్యములు అభివృద్ధి పథములో సాగును. అటువంటి ఉమ్మడి బృందముగా గాక, సభ్యులు వ్యక్తిగతముగా వ్యవహరించినచో బృందములుగా నిలువవు.

బృందములలో ఐకమత్యము లేకపోయినచో స్ఫూర్తితో స్వచ్ఛమైన కార్యములు జరుపలేరు. సభ్యులు ప్రక్కదారుగా, స్వార్థముతో నున్నప్పుడు వారు మార్గము నుండి తప్పించబడి అశాంతికి లోనగుదురు.

బృంద చిత్రము

బాధ్యత స్వీకరించుట

బృందములలో కొందరు కేవలము అతిథులుగా మిగిలి ఉంటే, కొందరు బాధ్యతలు తీసికొనుట జరుగును. స్ఫూర్తి చెంది బాధ్యతలను స్వీకరించి, బృందమున, సంఘ శ్రేయస్సునకు కట్టుబడుట యన్నది క్రమముగా అలవాటు అగును.

శ్రద్ధగా పరికించినచో, ఏవో కొన్ని విషయములలో మనకు పరిచయము, ప్రజ్ఞాపాటవములు సహజముగా ఉండవచ్చును. అటువంటి విషయములలో ఎవరూ చెప్పనవసరము లేకుండా మనమే ఇతరుల శ్రేయస్సునకు, బాధ్యత తీసికొని కార్యోన్ముఖులము కావచ్చును.

అందరినీ ఆదరించి పరస్పర అవగాహన, శక్తి యుక్తులను పంచుకొనుటవలన బృందములు ప్రయోజనకరముగా సాగును.

సమిష్టి కార్యాచరణము

ఒక బృందము జరుపుతున్న కార్యక్రమములు క్రమముగా బయటికి విస్తృతి చెంది సమాజ ప్రయోజనములుగా అభివృద్ధి చెందవలెను. మన పరిసరముల జీవులకు ఎంతగా ప్రయోజనకారిగా ఉన్నామో అంతగా మనము లోలోతున పరబ్రహ్మమునకు చేరువగా ఉన్నట్లు సూచించును.

ఒక వ్యక్తి సమత్వముతో, సహజత్వముతో సంఘప్రయోజనకారి కావాలంటే, అధికముగా తన పేరు ప్రతిష్టలు పెంచుకొనడు. అధికముగా బయట తన పనులు ప్రకటన చేయడు. అదే విధముగా తన శక్తి యుక్తులను, తన సామర్థ్యమును మించి గానీ, తక్కువ గానీ పని చేయడు పని చేయడు.

ఈ విధంగా మన పనితీరులో ఇతర కార్యకర్తల పరిచయము జరిగి అదే రకమైన పనిచేయువారితో కలసి బృందములుగా రూపొందును. ఇది ఆత్మ చైతన్యమును పెంపొందించి సమత్వమును పెంపొందించును.

సంస్థగా WTT

ఈ సంస్థ యొక్క కార్యములు, ధర్మములు ఆశయములు మెచ్చి, పాటించువారందరి కలయికే ఈ సమిష్టి బృందములు. “జగద్గురు పీఠము” భౌగోళికముగా ఎన్నో ప్రాంతములలోని సహ బృందములు కలయికగా నిర్వర్తింపబడుచున్నది.

ఇందు మానసికముగా, ఆధ్యాత్మికముగా, ప్రయోజనకరముగా పాల్గొనటము ద్వారా జగద్గురు పీఠములో చేరినట్లుగా పరిణతి చెందుదురుగాని, ఒక సభ్యునిగా నమోదు చేసుకొనుట వలన కాదు.

మీకేమైనా సందేహములున్నచో, ఇతర వివరముల కొరకై సంప్రదించండి.