మాస్టర్ యమ్. యన్.
“ఈ సమూహము వ్యక్తుల బహిరంగ కలయిక కాదు. వారి హృదయముల అంతరంగ సమీకరణము.”
శ్రీ మైనంపాటి నరసింహము
జగద్గురు పీఠము గురుపరంపర మూలములు
వీరి పూర్తి నామము “మైనంపాటి జ్వాలానరసింహము”. 1883 సంవత్సరము ఆగస్టు 25 న నెల్లూరు జిల్లా నాయుడుపేట గ్రామములో జన్మించారు. న్యాయవాదిగా వృత్తిధర్మము నిర్వర్తిస్తూన్న వీరు డిసెంబరు 1919 లో మాస్టర్ సి. వి. వి. గారి నుంచి ఉపదేశము పొందిరి. తమకు కావలసిన శాంతి పూర్తిగా పొందినట్లుగా తెలిపిరి.
మాస్టర్ సి. వి. వి. యోగవిద్య యందు ధృవతారగా నిలిచి, మాస్టరు యోగ బృందములనన్నిటికి వారి త్రికరణ శుద్ధిని బట్టి యోగమును నిర్వర్తింపచేసిన సిద్ధులు. వారి గృహము నందే “సత్యయోగా స్కూలు” ను నెలకొల్పి, అనేక కుటుంబములకు యోగసాధన నేర్పి కర్మబంధములనుండి విముక్తి చేసిరి.
వీరిని “ఒంగోలు మాస్టరు” గారని, “చిన్న మాస్టరు” (Little Master) అని, “ఒంగోలు స్వామి” అని అందరూ భక్తితో తలచేవారు. వారి గృహము అన్నివేళలలోను సంవత్సర పర్యంతము, పండుగ వాతావరణముతో కళకళలాడుతూ, వారి దివ్య స్పర్శ కొరకు ఆకర్షితులై వచ్చు బృందములతో వెలసిల్లేది. అనేక యోగ చమత్కారములు గావించి, వివిధమగు కోర్సులను సాధకులకు అందజేసి యున్నారు.
ప్రాణము సరిదిద్దుటకు, యోగమును నిర్వర్తించుటకు మాస్టర్ సి. వి. వి. యోగమును వినియోగించి వారు నిర్వర్తించిన యోగ చికిత్సలు అత్యద్భుతములు. వారి ప్రణవనాదమున పరవశించిన సాధకుల బృందములతో పాటుగా పశువులు కూడా పరవశము చెంది శ్రీ కృష్ణుని వేణు నాదమునకు గోకులములోని పశువులవలె ఆనందించెడివి. వారి శిష్యసాధకులు యోగమున పరిపూర్ణులై ఎంతోమందికి ఈ యోగవిద్యను పరంపరగా పంచి ఇచ్చుట అద్భుతవిషయము.
వీరి స్పర్శ యున్నచో సాధకులయందు అగ్ని ప్రజ్వలనము జరిగి కుండలిని చైతన్యము ఊర్ధ్వగతి చెందును. యోగసంతర్పణము కొరకు వీరు పశ్చిమ దేశములలో ఎక్కువగా కృషి సల్పుచున్నారు. మాస్టరు సి.వి.వి. కుంభ ప్రజ్ఞయగు వాయువుగా వ్యాపించి యుండగా, ఆ తత్త్వమును అవతరింప చేయుటకు అగ్నితత్త్వమై మాస్టర్ యమ్. యన్. అలరారుచున్నారు. వీరిరువురూ అనిల, అనల ప్రజ్ఞలుగా భూగోళమంతయు వ్యాపించి యున్నారు.
యోగ సిద్ధులగుట చేత ఎన్నియో లీలలు చూపి, లీలా ప్రాయముగనే స్వచ్ఛందముగా ప్రార్థనా సమయమున తన దేహమును 1940 మార్చి 11వ తేదీన విసర్జించిన ప్రతిభావంతులు మాస్టర్ యమ్. యన్.