ధ్యాన ప్రక్రియ
“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”
ధ్యానములు, క్రతువులు | ధ్యానము యొక్క అవగాహన
ధ్యానమునకు సూచనలు
జ్ఞాన బోధలు మరియు దైనందిన సాధన
మానవుడు జ్ఞానమును కనుగొనలేదు. తాను జ్ఞానమును స్వంతము చేసుకొనలేడు. కాబట్టి ఇవ్వడము కూడా సాధ్యము కాదు. తాను కేవలము జ్ఞానాన్ని వ్యాప్తి చేయగలడు. జ్ఞానము ప్రాక్పశ్చిమాలకు అతీతమైనది. అది అద్వైతము-ఆత్మ యొక్క వెలుగు. జ్ఞానముతో అనుసంధానమునకు సిద్ధముగా ఉన్న వారికి అది అందివస్తుంది. విషయముల కొరకై పరుగిడుట కంటే, ప్రస్తుత కర్తవ్యమును ఎరిగి సరైన సమయం కొరకు ఓరిమితో వేచి ఉండుట జ్ఞానము. జ్ఞానము యొక్క స్ఫూర్తితో దినచర్య జరుగుతున్నదా: ఏమి తినవలెను, ఎట్లు తినవలెను? దినచర్యలో స్వచ్ఛత ఉన్నదా? ధ్యానము, స్వాధ్యాయము, సేవలలో సమతూకము కలదా ? అని చూచుకొనవలెను.
ధ్యానము
ధ్యానము చేయుట కాదు; ధ్యానము జరుగును. ఉన్నతమైన వెలుగు(ప్రచోదనము)ను, స్పందనను చేరుకొనుటకు ధ్యానమునందు ఉండవలెను. భావముల యొక్క మూలమును చేరుట, “నేను ఎవరు?” అని శోధించుట , అనునది ప్రాథమిక ధ్యానము. ధ్యానము యొక్క రహస్యము ఏమనగా: మనము ధ్యాన స్థితిని పొందుటకు ప్రయత్నము అవసరము లేదు, కాని, ధ్యానము కాని ఇతర స్థితులను వదిలివేయవలెను.
ప్రయోగము
ప్రతి ప్రయోగమునకు సంసిద్ధత అవసరము. తగిన నియమములు పాటించుట అవసరము. సరైన సన్నాహము లేనిచో ఇబ్బందులు తప్పవు. ధ్యానము ఎవరికి వారు చేసుకొనే ప్రయోగము. మనిషి పరివర్తన చెందు క్రమము.
అనుభవము
ధ్యానము మనకు తలంపుల అవరోధములకు అతీతముగా నిర్మలమైన అనుభూతి ఇచ్చును. ఈ అనుభూతి ప్రబలమైన విద్యుత్ శక్తి ప్రసారము వలె ఉండును. ఈ స్థితిని ఒక ఘటనగా గమనించుటకు సాధకునిగా స్పృహ కలిగి ఉండము. ఈ స్వచ్ఛమైన అనుభూతిలో ఆలోచనకు తావుండదు. అసలు మనకు ఈ అనుభూతి యొక్క కాలవ్యవధి కూడ తెలియదు.
అనుభూతిలో లీనమగుట
మంచి సంగీతము విను సమయములో మనము కొద్దిసేపటి తరువాత దాని యందు లీనమవుతాము. అనుభూతి పూర్తి అయిన తరువాత కొద్ది సేపటికి, దానిని వ్యక్త పరచుటకు ఒక తలంపు వచ్చును. పండిత మేధస్సు గల కొద్ది మందికి ఈ అనుభూతి చెందుట కష్టమగును. ఎందుకనగా, అనుభూతి మనసు సంగీతము యందు లీనమగుట వలన కలుగును కాని మనసు ఘనీభవించి, పదముల అర్థము యందును, సంగీత శాస్త్రమును గమనించుట వలన జరగదు.
మేల్కొనుట
గమనిక కలుగు స్థితిని, మనము నిద్ర నుండి మెలకువలోనికి వచ్చు మార్పుతో పోల్చవచ్చును. నిద్రలో మనము అస్తిత్వముతో విలీనమవుతాము. మనము నిద్ర లేచినపుడు మనము లేచామని తెలుస్తుంది, కాని ఎలా మేలుకున్నామో తెలియదు. నిద్ర లేవడం మన నిర్ణయం కాదు. సముద్రము నుండి అల వేరుగా బయటికి వచ్చినట్టు అస్తిత్వము నుండి ఎరుక కలిగి, మేల్కొనెదము. తరువాత భావములు కలిగి, దినచర్యలో భాగముగా మనము బాహ్య ప్రపంచమునకు వెళ్తాము.
వెళ్ళుట మరియు తిరిగి వచ్చుట
రోజూవారీ కార్యక్రమముల ద్వారా మనము బాహ్య ప్రపంచములోకి వెళ్తాము. మన ఇంద్రియములు, మనసు ప్రాపంచిక విషయములలో నిమగ్నమై మనలను కూడా వాటి లోనికి లాక్కొనును. ఇలా మనము మన ఉనికి యొక్క ఎరుకను కోల్పోయెదము. ధ్యానము ద్వారా మళ్ళీ మన ఉనికి యొక్క స్మృతి కలిగి తిరిగి మన మూలమునకు చేరెదము. ఇదంతయు సముద్రము యొక్క ఆటు, పోటు వలె ఉండును.
ఆలోచనలు మరియు "నేను"
ఆలోచనలు ఎక్కడ నుండి వస్తాయి? ప్రాణము యొక్క పుట్టుక స్థానమే ఆలోచనలకు మూలము. తలంపులు(ఆలోచనలు) రావడానికి ఏ అనుమతీ అవసరం లేదు. మనము మేల్కొనిన వెంటనే మనము వద్దనుకొన్నా ఆలోచనలు వస్తాయి. మనము వాటిని గమనించగలము కాని వాటి పై పట్టు సాధించలేము. సాధారణంగా మన గురించి మనకు తెలుసు అనుకుంటాము. మన గురించి మనము ఏమి అనుకొంటామో(ఆలోచిస్తామో), నిజమని నమ్ముతామో, అది మనము కాదు. మరి “నేను” అనునది ఎక్కడ నుండి వస్తుంది?
ప్రధానమైన ధ్యానము
మన ఆలోచనల యొక్క మూలము తెలుసుకొనుట (“నేను ఎవరు?”), ప్రధానమైన ధ్యానము. మనము ఆలోచన కాని, భావము కాని, లేదా శరీరము కాని కాదు. మనము, ఆత్మలకు మూలమైన పరమాత్మ నుండి ఉద్భవించిన ఆత్మగా ఉంటాము. అదే మన అసలైన గుర్తింపు. “నేను”, మనలోని చైతన్యముగా వ్యవహరించి, మన ఆలోచనల ద్వారా వ్యక్తమగును. మనము ఒక పేరు, ఒక రూపము, ఒక లింగము, ఒక దేశమును అనుసరించి, మన ఇంద్రియముల ద్వారా బాహ్య ప్రపంచము లోనికి వచ్చెదము.
అంతరంగములోనికి దారి
ప్రతిదినము ధ్యానము చేయుటకు సంధ్యా సమయము ఉత్తమము లేదా 12 గంటల విరామముతో ఒక ఖచ్చితమైన సమయాన్ని ఎంచుకోవలెను. ధ్యానము చేయుటకు ప్రశాంతమైన స్థలమును ఎంచుకోవలెను. ఆ తరువాత ఉత్తర లేదా తూర్పు ముఖంగా ఒక సౌకర్యవంతమైన ఆసనములో వెన్నెముక నిలువుగా నిలిపి, కనులు మూసుకొని కూర్చొనవలెను. అదనంగా మనము దీపము వెలిగించి, ధూపము వేసుకోవచ్చును.
విధానము
మనము కనులు మూసుకొని 3 నుండి 7 మార్లు మంద్రముగా, క్రమమైన పద్ధతిలో ఓంకారము చేయవలెను. మనము మన హృదయములో వెలుగుతో నిండి వికసించిన ఒక బంగారు పద్మమును ఊహించి దర్శించవలెను. 15 నిముషముల పాటు మౌనముగా లోపల జరుగునది గమనించవలెను. మన శరీరములో సర్దుబాట్లు జరుగుతాయి. చైతన్య(శక్తి) ప్రవాహమునకు అడ్డంకులు తొలగిపోతాయి. వచ్చుచున్నఆలోచనలను గమనించవలెను. మెల్లగా ఆలోచనల ప్రవాహము మందగించును. మనసు దాని కేంద్రస్థానమునకు చేరును.
ఓంకార మంత్రము, ధ్వని(శబ్దము)
మన భౌతిక, మానసిక, భావమయ కక్ష్యలను క్షాళన చేయుటకు శబ్దము చాలా అవసరము. ఒక మంత్రము స్వస్థత (హీల్) చేయు అయస్కాంత శక్తిని ఉత్పత్తి చేయును. మంత్రము యొక్క శబ్ద తరంగములు (vibrations) ముఖ్యము కాని, మంత్రము యొక్క అర్థము, పలుకుట (స్పీచ్) కాదు. మంత్రము ఉచ్ఛరించేప్పుడు మనము బాహ్యమునకు వచ్చి, దానిని వినుట ద్వారా ఆ శబ్దము యొక్క మూల స్థానమునకు చేరెదము. మనము ఉచ్చరించే ఓంకారము మన లోపల నిశ్శబ్దముగా జరుగుతున్న ఓంకారముతో మనలను అనుసంధానించును. ఓంకారమును యాంత్రికంగా ఉచ్చరించకూడదు.
శ్వాసక్రియ
మనసులో కలవరముగా ఉన్నప్పుడు కాని, అధికముగా మాట్లాడినప్పుడు కాని మన శ్వాసక్రియ పెరుగును. మనము ప్రయత్నపూర్వకంగా మనసును శ్వాసక్రియతో అనుసంధానించడం వల్ల శ్వాసక్రియ నిదానించును. శ్వాస నిదానమయ్యే కొలదీ మనసు నెమ్మదించును. శ్వాసక్రియ మనలో జరుగును కాని అది చేయబడదు. ఒక దశ లో ఉచ్ఛ్వాస నిశ్వాసగా ఎలా మారుతుందో మనము గమనించాలి. అలాగే నిశ్వాస ఉచ్ఛ్వాసగా ఎలా మారుతుందో గమనించాలి. అక్కడ ఆలోచనలు ఆగుతాయి. మనసు మరియు శ్వాసక్రియ, స్పందన (pulsation)తో విలీనమైనప్పుడు ఉనికి యొక్క నిశ్శబ్దము మాత్రమే ఉండును.
వికాసము
ధ్యానమునందు అవగాహన ఉండుట సరిపోదు. దానిని ఆచరణలో పెట్టినప్పుడే, ధ్యానము ప్రభావము చూపును. ప్రతిరోజూ పవిత్రమైన ఓంకారాన్ని ఉచ్చరించి, ఆ శబ్దాన్ని విని, 5 నుండి 15 నిముషములు ధ్యానము చేసినచో, మనలో అంతర్గత పెరుగుదలను తెలుసుకోగలము. క్రమముగా మన బాహ్య జీవనము పొందికగా రూపొంది, అంతర్జీవనమునకు అనుసంధామగును. తద్వారా మన జీవితము ప్రశాంతమగును.