నావాణి - దర్శన మాస పత్రిక
డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారి దివ్య పుత్రిక - నావాణి మాస పత్రిక
జగద్గురు పీఠము ప్రచురణలు
ప్రచురణా కార్యక్రమములు
మాస పత్రిక
నావాణి మాస పత్రిక ప్రతినెల 22వ తేదీన వెలువడును.
సంప్రదించుటకు / చందా
Email navani_7@yahoo.com
Phone 0891-2701531
చిరునామా
జగద్గురు పీఠము, రిట్రీట్ సెంటర్
15-7-1, ఏంజిల్స్ ఎన్‍క్లేవ్, కృష్ణా నగర్
విశాఖపట్టణము, ఆంధ్ర ప్రదేశ్ - 530 002
ప్రారంభము
1972 వ సంవత్సరములో డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు మొదటి పాశ్చాత్యయాత్రలో వుండగా ఆకస్మికముగా ఆకాశము నుండి ఆయన మదిలోనికి ఆధ్యాత్మిక మాసపత్రిక విషయం దిగి వచ్చిందని, దానికి నావాణి అని నామకరణము చేసినట్లు ఆయన తెలియచేసినారు. ఆర్భాటాలు ఏమీ లేకుండా నిరాడంబరంగా నావాణి పత్రిక జీవితము ఆరంభ మయినది. 1972 సంవత్సరము నవంబరు 22 న నావాణి మొదటి సంచిక ప్రచురణమైనది. డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారి అభిమాన పుత్రికగ నావాణి పత్రిక వృద్ధిచెందినది. ఏ సంవత్సరాని కాసంవత్సరం “నావాణి” తన స్థానాన్ని నిలద్రొక్కుకుంటూ అనేక జనుల ఆదరాభిమానాలు చూరగొని హృదయాలకు సన్నిహితం కావటం సహజంగా జరిగింది.
(–నావాణి 40 వ జన్మదిన సంచిక నుండి)
1984 నుంచి డా. కె. పార్వతీకుమార్ గారు నావాణి సంపాదకునిగా గురుతర బాధ్యతలను స్వీకరించి, పరమగురువుల ప్రబోధాలను తమదైన శైలిలో అందిస్తూ, జ్ఞాన రుచిని పంచుతున్నారు.
నావాణి సందేశం
1977 సంవత్సరము నవంబరు 22 న నావాణి ఆరవ జన్మదిన సభలో డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు పలికిన సజీవ వాక్యాలు:
“ 'ఓం' అనే ఈవాణి (నావాణి) సృష్ట్యాదిగా మానవులకు అనుగ్రహింపబడినది. అదే 'నావాణి'. కేవలం ఇ.కె. ఉంటేనే నావాణి ఆదరించబడడం అనునది స్థిర ప్రయోజనం లేని పని. నేను దిగి వచ్చాను. 'నేను' మీ అందరిలోకి దిగి రావాలి. జ్యోతి, జ్యోతిచేత వెలిగించబడినట్లు, వెలుగుతున్న ఒక జ్యోతితో మీలోని జ్యోతులను వెలిగించుకోవాలి. మంత్రాలు, జీవితాలను నడపడం గాక జీవితమే ఒక తారక మంత్రం కావాలి. కలికాలంలో చీకటి కరుడు కట్టి ఉంది. ఎంత చిన్న దీపం వెలిగించుకున్నా మీ జీవితమనే గ్రంథాన్ని చదువుకోవచ్చు!”
(–మాస్టర్ ఇ.కె జీవిత చరిత్ర గ్రంథం నుండి)
పరమగురు బోధలు మరియు ఇతర వివరములు
నావాణి పత్రికలో జగద్గురు బోధలు మరియు పరమ గురువులచే ఇవ్వబడిన అనేక సాధనా రహస్యములు అందివ్వబడుచున్నవి. జ్యోతిషపరమైన విషయములు, హోమియో వైద్యవిధానమునకు చెందిన వివరములు, మరియు జగద్గురు పీఠము యొక్క ఇతర ప్రాంతములలో నిర్వహింపబడుతున్న అనేక కార్యక్రమములు తెలియపరచ బడుచున్నవి. రాబోవు మాసములో వచ్చు పర్వ దినముల వివరములు మొదలగునవి కూడా తెలుపబడుతున్నవి.
విశిష్టత
అంతరంగ పరిశుద్ధికి ఈ పత్రిక ఎంతో దోహద పడుతుంది. మానసిక సంక్షోభాన్ని తొలగిస్తుంది. మనశ్శాంతిని కలిగిస్తుంది. సమకాలీన పరిస్థితులతో సతమతమౌతున్నవారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున వారికి ఉత్సాహాన్ని ఊపిరిగా నిలుపుతుంది. జీవన విధానాన్ని ప్రబోధిస్తూ వుంటుంది. పూర్వకర్మానుసారము బాధపడుతున్నవారికి, అలాగే కష్టనష్టాలలో కూరుకుపోయిన వారికి, అశాంతి, అనారోగ్యాదుల వేదన ఉన్నవారికి నావాణి ఆపద్భాంధవిగా సందర్శన మిస్తుంది. ఆదుకుంటుంది. ప్రత్యేకించి ఆత్మబంధువుగా ప్రతిమాసం దర్శనమిస్తుంది. దైవవాక్కు దూతగా దివ్య స్పర్శను కలిగిస్తుంది. పాఠకులను, సాధకులను కర్తవ్యోన్ముఖులను చేయటంలో ఈ పత్రిక ముందుంటుంది. వెనుక నుండి జిజ్ఞాసువులను జ్ఞాన సాధకులుగా నడిపిస్తూ వుంటుంది. పరమగురువుని సంకల్పమే ఈ పత్రికకు పునాది. ఇది సత్యం కనుక శాశ్వతం. ఆత్మజ్ఞానం, ధర్మజీవనం, సత్య దర్శనం, దైవానుభూతి ఇత్యాదులను కల్పించడానికి “నావాణి” మార్గదర్శకంగా ఉంటుంది. నిరంతర స్ఫూర్తిని, నిత్య తృప్తిని కల్పించడమే ఈ పత్రిక విశిష్టత.
(– నావాణి 41 వ జన్మదిన సంచిక నుండి)