మే కాల్ డే
“ధ్యానము అనగా చేయునది కాదు, జరుగునది”
29 మే 1910 నుంచి మాస్టర్ సి. వి. వి. గారు తాను ఊర్ధ్వ లోకముల నుంచి అందుకున్న కుంభ చైతన్యపు ప్రజ్ఞను భూగోళమునకు మరియు భూమి మీద ఉన్న జీవులకు ప్రసారము చెయ్యడము ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 29 మే దినమును బృంద ఉపదేశ పర్వదినముగా వేడుక జరుపుకుంటున్నారు. దీనినే “మే కాల్ డే” అని అంటారు.
ధ్యానములు, క్రతువులు | పండుగలు
మాస్టర్ సి. వి. వి.
పుస్తకము: Master C.V.V. - May Call! Vol. 1 (English) | Vol. 2 (English)
పుస్తకము: Master C.V.V. (English) | పుస్తకము: The Aquarian Master (English)
కుంభ యుగము
ప్రతి 2,160 సంవత్సరముల కొకసారి విషువత్ నూతన రాశిలోకి ప్రవేశిస్తున్న సమయములో ఒక నూతన యుగము ప్రారంభమవుతుంది. 1837 సంవత్సరములో విక్టోరియా మహారాణి పాలనతో కుంభ యుగము ప్రారంభమయినది. ఈ యుగపు పథ నిర్దేశిని అయిన మేడమ్ బ్లావట్స్కీ 1831 లో జన్మించినది. 20వ శతాబ్దపు ఆరంభములో అవతారముల కోవకు చెందిన మహా ఉత్కృష్టమైన శక్తి ఒకటి భూమి మీద అవతరించి, మానవజాతిని ఉద్ధరిస్తుందని ఆమె తెలిపి ఉన్నారు. ఆమెకు దివ్య లోకముల ప్రవేశము ఉండడము వలన ఈ భవిష్యవాణిని ఆమె తెలుపగలిగారు. ఆమె తెలిపిన భవిష్యవాణిని బట్టి, ఆమె దేహత్యాగం చేసిన తర్వాత చార్ల్స్ లెడ్బీటర్, అనీబిసెంట్, ఇత్యాది అనుయాయులు ఈ ఉత్కృష్టమైన శక్తిని అందుకోవడానికి జిడ్డు కృష్ణమూర్తి అనే ఒక పరిశుద్ధమయిన జీవుడిని సంసిద్ధుడిని చేసారు.
కుంభ చైతన్య అవతరణము
కానీ దైవ నిర్ణయము వేరే విధంగా ఉన్నది. ఈ రాబోవు కుంభ చైతన్యము భూమియందును మరియు భూమి జీవులలో అత్యంత గంభీరమైన పరివర్తనలను చేసి, పరిణామ క్రమమును వేగవంతము చేస్తుందని ఊర్ధ్వ లోకములలో తెలిసి ఉన్నది. ఈ శక్తి చాలా తీవ్రమైనదని, సాధారణ మానవులు అందుకోలేరని కూడా తెలిసి ఉన్నది. భూమి మీద ఇప్పటివరకూ జరిగిన ఏ సంఘటనలూ దీనితో పోల్చదగినవి కాదు. ఈ సందర్భములో పురాణములలో వర్ణించిన గంగావతరణ కథ గుర్తుకువస్తుంది – గంగా ప్రవాహపు శక్తులను శివుడు ఒక్కడే అందుకోగలిగాడు. అగస్త్య ఆశ్రమవాసులే ఈ రాబోవు కుంభ చైతన్యమును అందుకోగలరని ఊర్ధ్వ లోకములలో నిర్ణయింపబడినది. పరమగురు పరంపరలో అగస్త్య మహర్షి (మాస్టర్ జూపిటర్) అందరి కంటే పెద్దవారు. వేరెవరకీ సాధ్యపడని విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సహాయపడడానికి అగస్త్యులవారు వస్తారు.
ఆ విధంగా అగస్త్యాశ్రమంలోని ఒక ముఖ్య సాధకులు ఈ కుంభ చైతన్యము దిగిరావడానికి 42 సంవత్సరాల ముందు దక్షిణ భారతదేశంలోని కుంభకోణము అనే ఒక చిన్న పట్టణంలో జన్మ తీసుకున్నారు. కుంభకోణం అంటే “కుంభ రాశి కోణము” అని అర్థము. అంతకుముందు కుంభ యుగము వచ్చినప్పుడు కూడా కుంభ చైతన్యము ఇక్కడే అవతరించినది. మాస్టర్ సి. వి. వి. గారు కుంభకోణంలో “కంచుపాటి వెంకటరావు వెంకాస్వామిరావు” గారిగా 4 ఆగస్టు 1868 న జన్మించారు. ఆయన అతి చిన్నవయస్సు నుంచే వేదాలలోని వివిధ శాఖలలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. సంస్కృతము, ఆంగ్లముతో బాటు అనేక భాషలలో మాట్లాడేవారు. చాలా ఆకర్షణీయంగా ఉండేవారు. ఆయన కుంభకోణం పట్టణ మేయరుగా కూడా పని చేసారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రధానమైన వ్యక్తులు ఆయన దగ్గిరే కాలం వెళ్ళబుచ్చుతుండేవారు. ఆయన మంచి గాయకులు కూడాను. ఆయన కావేరీ నదీ తీరంలో గానము చేస్తుండేవారు. ఆయన బాహ్యంగా వైభవోపేతంగా జీవిస్తూ, అంతరంగంలో కుంభ చైతన్య అవతరణ కోసం వేచి ఉండేవారు.
31 మర్చి 1910 న హేలీస్ తోకచుక్క భూమిని తాకినది. సప్తర్షి మండలము, కృత్తికా మండలము, మరియు శారమేయ మండలాల ద్వారా నిర్దేశింపబడిన ఆ చైతన్యము ఆ రోజు అర్థరాత్రి సమయములో మాస్టర్ సి. వి. వి. గారికి ప్రసారం చెయ్యబడినప్పుడు, ఆయన దానిని అందుకోవడానికి మేలుకొని, సంసిద్ధంగా ఇంటి ముందు గదిలో కూర్చుని ఉన్నారు. పెద్ద మెఱుపుతోను, పిడుగుతోను ఆ చైతన్యము ఆ ఇంట్లోకి ప్రవేశించినది. ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉండేవారు ఏమైపోయినారో అని చుట్టుప్రక్కల వాళ్ళు హడావిడిగా పరుగెత్తుకు వచ్చారు. అయితే, మాస్టరు గారు వీరాసనంలో కూర్చుని, గాఢమైన ధ్యానంలో, తేజోమూర్తియై కూర్చుని ఉన్నారు. ఆయనను అలా చూసి, వారందరూ వెనుకకు వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి రాత్రి ఏమి జరిగిందని అడిగారు. దానికి మాస్టరు గారు “నూతన యుగానికి సంబంధించిన చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని నాలోకి ఆహ్వానించుకున్నాను. కాలక్రమేణా దానిని మానవ జాతికి అందజేస్తాను” అని చెప్పారు.
పరమావధి
ఈ చైతన్యమును అందుకున్న తర్వాత ఆయన దానితో పని చెయ్యడం మొదలుపెట్టారు. ఆ చైతన్యం యొక్క ప్రయోజనాన్ని, పరమావధిని అవగాహన చేసుకోవడానికి ఆయన ఎన్నో ప్రయోగాలు నిర్వర్తించారు. జీవులకు భౌతిక పదార్థమయ లోకము నుంచి వెలుగు లోకాలకు ఉద్ధతి కలిగించడమే ఈ కుంభ చైతన్య అవతరణానికి పరమావధి. ఇది జరగడానికి పదార్థములో కావలసిన పరివర్తనలన్నిటినీ కూడా ఈ చైతన్యమే నిర్వర్తిస్తుంది. ఈ పరివర్తనలు జీవులను ఆకాశ (ఈథరిక్) లోకము వద్దకు తీసుకువెళ్తాయి. అప్పుడు వారు అమృతత్వ స్థితిని మరియు పునర్జన్మలలో అంతరాయము లేని ఎరుకను అనుభూతి చెందగలరు. ఆకాశ శరీర సహకారముతో తేలికగా ప్రయాణము కూడా చెయ్యగలుగుతారు. ఈ చైతన్యము ఖనిజ, వృక్ష, జంతు, మరియు మానవ లోకములలో పరిణామ క్రమమును వేగవంతము చేస్తుంది.
28 మే వరకూ మాస్టరు గారు తన అంతరంగములో ఈ చైతన్యముతో ప్రయోగాలు నిర్వహించుకున్నారు. ఆయన ప్రవర్తన చుట్టుప్రక్కల వాళ్ళకు వింతగా ఉండేది: ఆయన వీధిలో నడుస్తుంటే, ఆయన నేలను తాకకుండా గాలిలో తేలుతున్నట్లుగా అనిపించేది. ఆయన ఆరు గంటలపాటు ఉచ్ఛ్వాస, ఆరు గంటలపాటు శ్వాసను బంధించడము, మరియు ఆరు గంటలపాటు నిశ్శ్వాస, మరి ఆరు గంటలు శ్వాసను ఆపి ఉంచేవారని కూడా వారికి తెలిసింది.
మే కాల్ డే - చైతన్య ప్రసారము
29 మే 1910 న మాస్టరు గారు ఆరుగురికి ఉపదేశము ఇచ్చి, వారికి చైతన్య ప్రసారము మొదలుపెట్టారు. అప్పటినుంచి ఈ దినమును బృంద ఉపదేశ పర్వదినముగా వేడుక జరుపుకుంటారు. దీనినే “మే కాల్ డే” అని అంటారు. ప్రతి సంవత్సరము 29 మే దినమున కుంభ చైతన్యములో ప్రవేశిద్దామనుకున్నవారికి మాస్టరు (బ్రహ్మము) పిలుపునిస్తారని మాస్టర్ సి. వి. వి. గారు చెప్పారు. మే కాల్ డే తో పాటుగా, 29 డిసెంబరున “డిసెంబరు కాల్” సమావేశములను కూడా మాస్టరు గారు ఏర్పాటు చేసారు.
శబ్ద సూత్రము
1910 మే కాల్ నుంచి ఆయన కొంతమందిని ఈ చైతన్యానికి వాహికలుగా (mediums)ఎన్నుకున్నారు. ఆయన “సి. వి. వి.” అనే శబ్దాన్ని బీజాక్షరములుగా ఇచ్చారు. ఆయన ఈ మూడు అక్షరముల సంకేత శబ్దముల ద్వారా భూమి అయస్కాంత శక్తికి సంబంధించిన ఆకాశ శబ్ద తరంగాలను ప్రేరేపించడానికి ఏర్పాటు చేసారు. ఆయన మొదట్లో “నమస్కారమ్స్ మాస్టర్” అనే మంత్రము ఇచ్చారు. కొంతకాలమయిన తర్వాత ఈ చైతన్యము ఆయనను “మాస్టర్ సి. వి. వి. నమస్కారమ్స్” అనే మంత్రమును కూడా ఇవ్వమని సూచన చేసింది. మాస్టర్ అంటే బ్రహ్మము నుంచి దిగివచ్చిన చైతన్యమని అర్థము. క్రమముగా “మాస్టర్ యం. యన్. నమస్కారమ్స్”, మరియు “మాస్టర్ ఇ. కె. నమస్కారమ్స్” అనే మంత్రములు ఇవ్వబడినవి.
భౌగోళిక కార్యక్రమములు
ఆయన ఈ యోగ ప్రక్రియను అడిగిన సన్నిహితులకు ఇచ్చారు. చాలామందికి ఆయన చెప్పిన విషయములు, చేసిన పనులు చాలా వింతగా ఉండేవి. ఆయన తన పని భౌగోళికమని, తాను మొత్తము భూగోళానికే శక్తిని ప్రసారము చేస్తానని చెప్పారు: “ఇది ముందు పశ్చిమ దేశాలకు వెళ్లి, అక్కడి నుంచి తూర్పు దేశాలకు తిరిగి వస్తుంది. ఇది మొదట ఐరోపా వెళ్లి, అక్కడినుంచి దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా వెళ్లి, అక్కడినుంచి తిరిగి భారతదేశము వస్తుంది.” ఈ ప్రక్రియ వారు చెప్పినట్లుగానే జరిగింది. భారతదేశము ఛాందస భావాలు, సాంప్రదాయాలతో ముడిపడి ఉండడం వలన ఈ చైతన్యాన్ని వెంటనే అందుకోలేకపోయింది.
సమన్వయాత్మకమైన యోగము
తన జీవిత కాలములో మాస్టర్ సి. వి. వి. గారు 720 మందికి ఉపదేశము ఇచ్చి ఉన్నారు. ఆయన ఈ చైతన్యమును అందుకునే ప్రక్రియను “నూతన యోగము” లేక పూర్వ కర్మలను క్షాళనము చేసే “భృక్త రహిత తారక రాజ యోగము” అని అన్నారు. దీనినే “సమన్వయాత్మకమైన యోగము” అని కూడా అంటారు. అప్పటినుంచి మే కాల్ డే సందర్భంగా ఎంతోమంది ఈ సమన్వయాత్మకమైన యోగమున ఉపదేశం పొందారు. ప్రస్తుతము మే కాల్ డే వేడుకలు 10,000 మందికి పైగా అనేక బృందాలుగా, ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు.
మిథున మాసము
జ్యోతిష్యపరంగా మే కాల్ మిథున మాసములో వస్తుంది. అనాదిగా పరమగురు పరంపర మిథున మాసములో బృందాలకు ఉన్నత కక్ష్యలలోనికి ఉపదేశం చేస్తూ వస్తున్నారు. మానవ జాతికి మరియు అథోలోకాల నుంచి ఉన్నతికిని మిథున మాసము సంకేతము.
ఆకాశము ద్వారా, శబ్దము సహకారముతో, కుంభ చైతన్యంలోకి ఉపదేశానికి పరమగురువులు మిథున మాసమును ఎన్నిక చేసుకుని ఉన్నారు.
పరిపూర్ణము - పరిపూర్ణతను వితరణ చేయుట
మానవ జాతికి పరిపూర్ణతను కలిగించాలనే ఉద్దేశ్యముతో మాస్టరు గారు శక్తులను వితరణ గావించారు. పరిపూర్ణత (fulfil)అనే పదము ఆయనకు చాలా ఇష్టము – “పూర్ణమయిన తర్వాత మరి కూడా ఇంకా నింపుట (There is a Fill after the Full)”, దాని వలన అది పొర్లి ప్రవహిస్తుంది అని ఆయన చెప్పారు. పరిపూర్ణత ఈ యోగమునకు మరియు మే కాల్ నకు ప్రధాన సూత్రము.
ఆయన వైభవోపేతంగా జీవించారు. ఆయన ప్రతి దినము వచ్చిన వారందరికీ షోడశ వ్యంజనములతో భోజనము పెట్టేవారు. ఆయన ధనిక కుటుంబంలో జన్మించారు. ఆయన తనకు ఉన్న చాలా గృహములను అమ్మివేసి, ఆ ధనమును అన్న, వస్త్ర దానమునకు వినియోగించారు. “వితరణ లేక దానము చేసేవారు నాకు దగ్గరగా ఉంటారు” అని ఆయన చెప్పారు.
మనము అనుసరించడానికి వీలుగా ఆయన మూడు సరళమైన సూత్రములను ఇచ్చారు. వాటిని మనము అనుసరిస్తే మన బాహ్య జీవనాన్ని, అంతరంగ జీవనాన్ని ఆయనే నిర్వర్తిస్తారు.
- మొదటి సూత్రము: క్రమము తప్పకుండా ప్రతిరోజు ఉదయము, సాయంత్రము 12 గంటల వ్యవధిలో, వీలయితే ఉదయము 6:00 గంటలకు మరియు సాయంత్రము 6:00 గంటలకు, “నమస్కారమ్స్ మాస్టర్, నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి.” అను మంత్రమును ఉచ్చరించవలెను. హృదయములో గాని భ్రూమధ్యములో గాని మాస్టరు గారి సాన్నిధ్యమును అనుభూతి చెందగలము. తరువాత 15నిమిషములు మౌనముగా ఉండి, మన ప్రాణ శక్తిలో లేక మన ఆలోచనలలో జరుగుతున్న కదలికలను గమనించవలెను. ప్రార్థనలో ఏమయినా సూచనలు అందితే, వాటిని వ్రాసుకుని, ఆచరించవలెను.
- రెండవ సూత్రము: జీవితమును సేవకు అంకితము చేసి, స్వప్రయోజనము కన్నా ఇతరుల ఉపయోగము కొరకు ఎక్కువగా భావన చేయవలెను.
- మూడవ సూత్రము: కనిపించే అన్ని రూపములను మాస్టరుగా దర్శనము చేయవలెను – ప్రీతికరమైన మరియు అప్రీతికరమైన విషయములను కూడా మాస్టరుగా దర్శనము చేయవలెను. ఉన్న సుఖములను అనుభూతి చెందుతూ, సరళముగా జీవించవలెను.
“ఈ సూత్రములను క్రమము తప్పక సాధన చేస్తే, 12 సంవత్సరములలో నువ్వు నా అంతటి వాడిగా అవుతావు” అని మాస్టరు గారు చెప్పి ఉన్నారు. భూగోళము మీద ఏ ప్రాంతమునకు చెందినవారైనా, పైన చెప్పబడిన ప్రకారముగా శ్రద్ధతో సాధన చేసినప్పుడు వారు తమ జీవితములో అద్భుతమైన మార్పులు జరుగుటను గమనిస్తారు.
ఆకాశ కక్ష్యలో స్థిరపడుట
మాస్టరు గారు 11 సంవత్సరములు, 11 మాసములు, 11 దినములు బాటు ఈ యోగముతో పని చేసి, పూర్తి ఎరుకతో దేహమును త్యజించారు. ఆయన తన దేహత్యాగ సమయమును ముందుగానే వెల్లడించి ఉన్నారు. కానీ ఆయన అంతకు పూర్వము 18 సార్లు శరీరమును వదిలి, తిరిగి రావడము చూచిన ఆయన అనుయాయులు ఈ విషయమును నమ్మలేదు.
మాస్టరు గారు తన ఆకాశ శరీరముపై పరిపూర్ణ స్వామిత్వమును సాధించి, దానిని వేల సంవత్సరముల బాటు ఆకాశములో ప్రతిష్ఠించి ఉంచి ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆకాశ కక్ష్యలో వసిస్తూ, జీవులకు సహాయమును అందిస్తూ ఉన్నారు. ఆయన చోటులో మహాప్రాణశక్తిని ఏర్పాటుజేసి ఉంచి ఉన్నారు. ఆయన దానిని “ప్లెంటీ అఫ్ ప్రాణా (Plenty of Prana)” అని పిలిచారు. ఎవరయితే “సి. వి. వి.” అను బీజాక్షరములను ఉచ్చరిస్తారో, వారు ఈ ప్రాణ శక్తిని తమలోనికి ఆహ్వానించుకుని, దాని ద్వారా తమ మానసిక, భావమయ ఉపాధులను పరిశుద్ధపరుచుకోగలరు, మరియు వ్యాధులనుంచి స్వస్థతను పొందగలరు. ఇది నిశ్శబ్దముగా జరుగు విద్యుత్తువలె తీక్షణముగా చొచ్చుకొనిపోవు బృంద కార్యము. కానీ, మాస్టరు గారు తనను ఆవాహన చేసిన ప్రతి శిష్యునితోనూ ప్రత్యక్షముగా పని చేస్తానని చెప్పి ఉన్నారు. ఆయనది తిరుగు లేని సూటియైన మార్గము.
వాహికలు
ఆయన తన శక్తిని ప్రసారము చెయ్యడానికి వాహికలను (mediums) కూడా ఎంచుకుని ఉన్నారు. ఈ వాహికలు మాస్టర్ శక్తి ప్రసారమును విస్తారముగా వృద్ధిగావిస్తారు. ఈ వాహికలు ప్రస్తుత కాలపు శాస్త్రములలో అగుపడని అమూల్యమైన శాస్త్రీయ జ్ఞానమును కూడా అందుకుని, జీవుల చైతన్యమునకు వికాసము కలిగించి తద్వారా విశ్వ మానవ సోదరత్వమును నిర్మాణము చేస్తారు.
మాస్టర్ గురించి ఎక్కువగా మాట్లాడడము, వివరణ ఇవ్వడము కాకుండా, మాస్టర్ లో జీవించమని మాస్టర్ సి. వి. వి. గారి సూచన ఒకటి ఉన్నది. అప్పుడు ఆయన మనలో వసిస్తారు.