సత్సంకల్ప బృందము, భారతదేశము
“ఆచరణాత్మకమగు పరమప్రేమయే సత్సంకల్పము”
సత్సంకల్ప బృందము యొక్క వెబ్సైటు
సేవ | సేవా కార్యక్రమములు
భారత దేశమున జగద్గురు పీఠము బృందములు | హోమియో మరియు వైద్య సేవలు
బృందమును సంప్రదించుటకు
ఈ సత్సంకల్పబృందము, దీనులు, నిరుపేదలు అయిన వారికి వైద్య, విద్య, జంతు సంరక్షణ (గో సేవ), వాతావరణ సంరక్షణ, ఉచిత ఆహార వితరణ మరియు సాంస్కృతిక రంగములలో అవసరమైన సహాయ సహకారములు అందించుటకు గాను, డా. కె. పార్వతీకుమార్ గారి చొరవతో ఊపిరి పోసుకొన్నది.
సంస్థ వివరములు
సత్సంకల్ప బృందము సంస్థ అధ్యక్షులగు డా. కె. పార్వతీకుమార్ గారి మార్గదర్శకత్వమున పనిచేస్తున్న సామాజిక సేవా సంస్థ.
సేవా దృక్పథము కలిగినవారి నుంచి ఆర్థిక, మానవ వనరులను కూడగట్టి, ఆ వనరులను పేద ప్రజల యొక్క ప్రయోజనము కొరకు నిర్వహించబడే స్వచ్ఛంద కార్యక్రమములు, అవసరముల వైపుకు మరల్చుటయే ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశ్యము.
ఈ సంస్థ యొక్క పనితీరు సరళత మరియు వినయముతో నిండియుండును. అటువంటి అభిరుచి ఉన్నవారు ఈ బృందము నందు చేరి తమకు తోచిన విధముగా సంస్థ యొక్క పనులలో సమర్పణ చెందవచ్చును. సత్సంకల్పమనునది మానవ వికాస కార్యక్రమము గావున, ఇందులో కుల, వర్గ, మత భేదములుండవు. “జీవకోటి సేవ” ఒక్కటే వీరి స్వచ్ఛమైన లక్ష్యము.
ఉచిత భోజన వితరణ
ఈ బృందము పేద పిల్లలు, దివ్యాంగులు, నిరుపేద బడి పిల్లలకు ప్రతిరోజూ లేక వారానికి ఒకసారి ఉచిత భోజనమును అందజేయును. మిథిల విద్యాలయపు బడులలో ఈ పద్ధతిలో రోజుకు సుమారు 1,800 మంది పిల్లలు భోజనము చేయుచున్నారు. ఇదేగాక, తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతములలో ప్రతివారము లేక ప్రతినెల అన్నదాన కార్యక్రమములు జరుగుచున్నవి.
విద్య
ఈ బృందము పేద, దీన విద్యార్థుల ప్రయోజనము కొరకై మొదలుపెట్టిన విద్యా కార్యక్రమములలో భాగముగా అన్ని స్థాయిలలో విద్యా బోధన కొరకు అవసరమైన సాయము అందించుటకు పలురకముల కార్యక్రమములు చేపట్టినారు.
ఈ బృందము వారు 7 మిథిలా విద్యాలయము పేర పిల్లల బడులను నెలకొలిపి, మురికివాడలలోని పిల్లలకు ఉచిత విద్యతో బాటుగా పుస్తకములు, బట్టలు, భోజనము అందజేయుచున్నారు. ఇచ్చట ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు తరగతులు నేర్పబడుచున్నది. ఈ బడులు మురికివాడలలోని 6,500 మంది పిల్లల అవసరములు తీర్చినవి.
అంతియే గాక, ఈ బృందము వారు ఇతర బడులలో తమ పిల్లలను చదివించుకొను పేదకుటుంబములవారికి కూడా ఆర్థిక సహాయమును అందించుదురు. ఈ కార్యక్రమము ద్వారా ఇప్పటి వరకూ 2,700 మందికి పైగా పిల్లలు ప్రయోజనము పొందారు. అలాగే, కళాశాల విద్యార్థులకు, వృత్తి విద్యను ఎంచుకున్న వారికి కూడా ఆర్థిక సహాయమును ఈ బృందము వారు అందించుచున్నారు.
పర్యావరణ అభివృద్ధి
విశాఖపట్టణము దగ్గరలోని రామాద్రి కొండ వాలు పైన ఉన్న హంసవనములో మన బృందము వారు పర్యావరణ అభివృద్ధి కార్యక్రమము చేపట్టినారు. ఆంతరంగిక సాధన మరియు ధ్యానము చేసుకొనుటకు వీలుగా దేవాలయముల నడుమ ఒక ధ్యాన మందిరమును నెలకొల్పి, పవిత్ర వృక్షములను నాటి, పచ్చని సహజసిద్ధమైన వనమును ఈ బృందము వారు తయారు చేసినారు.
జంతు సంరక్షణ: గో సేవ
భారతీయ సనాతన ధర్మ విలువల ప్రకారం గోవులు పవిత్రమైనవి గావున, ఈ బృందము వారు హంసవనము మరియు శ్రీ కృష్ణాశ్రమము (బహుళ సేవా కేంద్రము) న, గోవులను స్వస్థ పద్ధతులలో రక్షించి పోషించుటయే గాక, గోక్షీరమును దేవాలయ సేవల కొరకు మరియు పేద పిల్లలపోషణ నిమిత్తము ఉపయోగించుచున్నారు.
ఆరోగ్య సేవలు
ఈ బృందము వారు, తీవ్రమైన అనారోగ్యముతో బాధపడు పేదలకు ఆరోగ్యము చేకూర్చుటకు, వారికి కావలసిన నిజమైన అవసరములకు విధిగా స్పందించుదురు. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రదేశములలో, ఈ బృందము వారు ఉచిత హోమియో వైద్యాలయములు, నేత్ర వైద్యాలయములు, హృదయ సంబంధ పునరావాస కేంద్రములు, స్వాస్థ్య పునరావాస కేంద్రములు నడుపుచున్నారు. ఒక లక్షమందికి పైగా ఈ సేవల వల్ల ఉపకరింపబడ్డారు.
సాంస్కృతిక కార్యక్రమములు
ఈ బృందము వారు, యువ మరియు అభినవ కళాకారుల వృద్ధికి సహకరిస్తూ, సంప్రదాయ సంగీతమును ప్రోత్సహిస్తున్నారు. అలాగే, వేదికలు ఏర్పాటు చేసి నిరంతర సంగీత ప్రదర్శనలు నిర్వహించుట ద్వారా సంగీత కళాశాలలకు మరియూ విద్యాసంస్థలకు సహాయమునందించి, సాంస్కృతిక కార్యక్రమములను ప్రోత్సహిస్తున్నారు.
ఇతర సేవా కార్యక్రమములు
ఈ బృందము క్రమము తప్పక విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో కొన్ని సేవల వివరములేమనగా: పునరావాస గృహములు, పేద మహిళల స్వపోషణ కొరకు కొరకు వారికి వాణిజ్య మరియూ కళానైపుణ్య శిక్షణ, గ్రామాలకు మంచినీరు అందించుటకు ప్రయత్నము, నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమములు, వస్త్ర దానములు, వయోవృద్ధులకు పింఛను సౌకర్యము, దివ్యాంగులకు సహాయము, అంధ బాలబాలికలకు జీవనాధారము మరియూ జంతువుల ఆవాసములు నడుపుట మొదలైనవి.