వైశాఖ పూర్ణిమ
“ధ్యానము అనగా చేయునది కాదు, జరుగునది”
యోగులు ఏ విధముగా సంవత్సరము యొక్క సంకల్పము మరియు ప్రణాళికతో అనుసంధానము చెందుతారో, అదే విధముగా మనము కూడా సత్సంకల్ప కార్యములు చెయ్యడానికి వలసిన ఒక నూతన సంకల్పశక్తిని అందుకోవడానికి వృషభ పూర్ణిమ సమయములో సంధానము చెంది ఉండవలెను. వృషభాక్షము నుండి వెలువడే సంకల్ప విశ్వ సంకల్ప శక్తులు చంద్రుడి ద్వారా ప్రతిబింబింపబడతాయి మరియు అందుకోబడతాయి. వృషభ పూర్ణిమ సమయములో చంద్రుడు వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్ర మండలము వద్ద ఉంటాడు. అందువలనే వృషభ పూర్ణిమను వైశాఖ పూర్ణిమ అని కూడా అంటారు. అనాదిగా హిమాలయములలో ఈ సమయమును వైశాఖ పండుగగా జరుపుకుంటున్నారు. గౌతమ బుద్ధుని సమయము నుంచి ఈ ఉత్సవములో అతని జ్ఞానోదయమును కూడా పండుగలో జోడించి జరుపుకుంటున్నారు.
ధ్యానములు, క్రతువులు | పండుగలు
పుస్తకము: అంతర్దర్శన ధ్యానములు | వైశాఖ పూర్ణిమ గురించి మరిన్ని వివరములు (English)
చతుర్భుజ అస్తిత్వము
ప్రతి సంవత్సరము వైశాఖ పూర్ణిమ నాడు భూమండలానికి ప్రభువైన సనత్కుమారుడు భూమి మీద జీవులకు ఒక ప్రేరణ ఇస్తాడు. విశ్వాంతర, విశ్వ, సౌర, గ్రహ లోకముల ప్రభువులను నలుగురు కుమారులుగను, వారి నామములను సనక, సనందన, సనాతన, మరియు సనత్కుమారులుగను పరిగణిస్తారు. అస్తిత్వము, అస్తిత్వము యొక్క ఎరుక, మనోమయ అస్తిత్వము, మరియు పదార్థమయ అస్తిత్వములకు సంకేతముగా నలుగురు కుమారుల నామములను చెప్తారు. జ్యోతిష్యపరముగా ఈ నాలుగిటిని వృషభ రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, మరియు కుంభ రాశుల స్థిర చతుర్భుజముగా చెప్తారు. ఈ చతుర్భుజ అస్తిత్వమునే క్రైస్తవ వేదాంతములో జాన్ యొక్క “బుక్ అఫ్ రెవలేషన్సు” లో వివరించారు. ప్రస్తుత కాలములో శాస్త్రపరముగా వీటిని అణు చైతన్యము, స్వ చైతన్యము, బృంద చైతన్యము, మరియు విశ్వ చైతన్యముగా పిలుస్తున్నారు.
శాస్త్రీయ విధానము
అస్తిత్వము, అస్తిత్వము యొక్క ఎరుక, మనోమయ అస్తిత్వము, మరియు పదార్థమయ అస్తిత్వములకు సంకేతముగా పైన చెప్పిన నలుగురు కుమారుల నామములను చెప్తారు. ఇంకొక సిద్ధాంతములో ఈ చతుర్భుజ అస్తిత్వమునే నాలుగు వ్యూహములుగా వివరించారు: వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, మరియు అనిరుద్ధ వ్యూహములు. జ్యోతిష్యపరముగా ఈ నాలుగిటిని వృషభ రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, మరియు కుంభ రాశుల స్థిర చతుర్భుజముగా చెప్తారు. ఈ చతుర్భుజ అస్తిత్వమునే క్రైస్తవ వేదాంతములో జాన్ యొక్క “బుక్ అఫ్ రెవలేషన్సు” లో నలుగురు అశ్వారూఢులుగా వివరించారు. శైవ సిద్ధాంతములో దీనినే పరమ శివుడు, శివుడు, సాంబశివుడు, మరియు శంకరుడుగా భావిస్తారు. ఈ చతుర్భుజ అస్తిత్వమునే వైశాఖునిగ, మురుగన్ గ, శరవణభవునిగా, మరియు సుబ్రహ్మణ్యునిగా కూడా పిలుస్తారు. ఈ చతుర్భుజ అస్తిత్వము అనాదిగా జ్ఞానులకు విదితమే. ప్రస్తుత కాలములో శాస్త్రపరముగా వీటిని అణు చైతన్యము, స్వ చైతన్యము, బృంద చైతన్యము, మరియు విశ్వ చైతన్యముగా పిలుస్తున్నారు. విశ్వాంతర, విశ్వ, సౌర, గ్రహ ప్రజ్ఞలకు వాటి అస్తిత్వమునకే గాక సృష్టిలో వాటి ప్రయోజనమునకు కూడా గుర్తింపు ఉన్నది.
భూమండల ప్రణాళిక
భూమండల ప్రభువు మరియు భూమి మీద ఉన్న జ్ఞానులు వైశాఖ పండుగను భౌగోళికముగా వైశాఖ పూర్ణిమ సమయములో నిర్వహిస్తారు. భూమ్యాకర్షణ వ్యవస్థలో ఉన్న జీవులకు ఈ దినమున భూమండల ప్రజ్ఞ ఒక ప్రేరణ ఇస్తుంది. ఈ ప్రేరణము దివ్య ప్రణాళిక ప్రకారము ఇవ్వబడుతుంది. పరమగురు పరంపర ఈ ప్రణాళికను అందుకుంటారు. పరమగురు పరంపర తమ అంతర్దృష్టితో ఈ ప్రణాళికను గ్రహించి, క్రమముగా తమ శిష్య బృందానికి ప్రసారము చేస్తారు. శిష్య బృందము మానవజాతిలోని నాయకులకు మరియు ఆలోచనాపరులకు ప్రసారము చేస్తారు. ఈ ప్రణాళికను మానవజాతి నాయకులు తమ తమ పరిధులలో దైనందిన కార్యములలోనికి నిర్దేశిస్తారు.
భూమండల ప్రణాళిక కూడా ఈ విధముగా నాలుగు క్రమములలో పని చేస్తుంది:
- భూమండల ప్రభువైన సనత్కుమారుడు,
- పరమగురు పరంపర; వీరి నాయకుడిని హిందువులు మైత్రేయునిగను, బౌద్ధులు మైత్రేయ బుద్ధునిగను, మరియు క్రైస్తవులు క్రీస్తుగను పరిగణిస్తారు,
- పరమగురు పరంపర యొక్క శిష్యులు, మరియు
- వారి యొక్క శిష్యులైన నాగరిక మానవజాతిలోని నాయకులుగా తెలియబడుతున్నవారు.
బుద్ధ పూర్ణిమ
గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారునకు మరియు పరమగురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడు. అందువలనే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందినది. వ్యాపార సంస్థలు కూడా ఈ విధముగనే నాలుగు క్రమములలో పని చేస్తాయి:
- నిర్దేశనాధికారులు,
- కార్యనిర్వాహకులు,
- పర్యవేక్షకులు, మరియు
- కార్మికులు.
శంబళ
భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయపు పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రము నుంచి ప్రేరణము వస్తుంది. దశమ అవతారమైన కల్కి శంబళ గ్రామము నుంచి అవతరిస్తాడని భాగవత పురాణములో ఉన్నది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర యొక్క ముఖ్య కేంద్రములో ఈ ప్రేరణను అందుకుంటారు. ఇది భాగవత పురాణములో వివరించబడినది. పరమగురు పరంపర యొక్క కేంద్రములు భూమి మీద అదనముగా ఆరు ఉన్నవి: జెనీవా, లండన్, న్యూయార్క్, టోక్యో, డార్జిలింగ్, మరియు ఆఫ్రికాలోని ఒక ప్రాంతము. ఈ కేంద్రములను పరమగురు పరంపర యొక్క ప్రస్తుత కాలపు ఆశ్రమములుగా భావిస్తారు. భూగోళపు జీవుల గమ్యము ఈ కేంద్రముల నుంచి బాధ్యతతో నిర్దేశింపబడుతుంది.
వైశాఖ పూర్ణిమ
వృషభ పూర్ణిమ సమయములో, చంద్రుడు విశాఖ నక్షత్రములో ఉన్న సమయములో పరమగురువులు మరియు వారి శిష్యులు హిమాలయ శ్రేణులలో ఉన్న వైశాఖ లోయలో కలుస్తారు. ఈ వార్షిక సర్వసభ్య సమావేశములో ఉత్తములు సంవత్సర ప్రణాళికను అందుకుంటారు (ప్రణాళికను అందుకోవడమే గాని చర్చకు అవకాశము గాని అవసరము గాని ఉండదు). వారు ఆ ప్రణాళికను మిథున పూర్ణిమ సమయములో ఈ క్రింది వారికి ప్రసారము చేస్తారు:
- ఆలోచనాపరులకు మరియు మానవ జాతి నాయకులకు,
- జంతు జాతికి,
- వృక్ష జాతికి, మరియు
- ఖనిజ జాతికి.
ఈ నాలుగు జాతులు భౌగోళిక జీవుల యొక్క చతుర్భుజ అస్తిత్వమును తెలియచేస్తాయి. అనాదిగా ఈ వ్యవస్థ ఉన్నది. కాలక్రమములో ఇది మహా వైశాఖిగను, తదుపరి కాలములో ఇది బుద్ధ పూర్ణిమగను ప్రసిద్ధిగాంచినది. యాదృచ్ఛికముగా జగద్గురు పీఠము యొక్క అంతర్జాతీయ కేంద్రము అదే శబ్ద ఉచ్చారణతో ఉన్న విశాఖపట్టణములో ఉన్నది – ఈ నగరపు పొలిమేరలలో సముద్రమధ్యములో వైశాఖేశ్వరుని ఆలయము కూడా ఉన్నది. అంతర్దృష్టి గలవారు వారి వారి భావ పవిత్రతను బట్టి ఈ అనురూప్యతను అర్థము చేసుకోగలరు.
పూర్ణిమా ధ్యానము
పూర్ణిమ సమయములో ధ్యానము మనసునకు, ఇంద్రియములకు, మరియు శరీరమునకు చాలా మంచిది. ఈ సమయములో ఉన్న సహకారపు మరియు అయస్కాంతపు శక్తుల ద్వారా ఆత్మ ఈ మూడు ఉపకరణములను సులువుగా అనుసంధాన పరచగలదు. ఈ ధ్యానమునందు ఆసక్తిగలవారికి పూర్ణిమ ముందు దినము నుంచి తేలికైన ఆహారమును తీసుకోమని, మరియు భౌతిక వ్యవహారములను కట్టుదిట్టము చేసుకోమని సూచించారు. ఎవరయితే తమ శరీరమును, ఇంద్రియములను, మరియు మనసును పవిత్రమైన ఆలోచన, మాట, మరియు చేతల ద్వారా సంధానపరుచుకుంటారో వారు పూర్ణిమ యొక్క శక్తులను అనుభూతి చెందగలరు; మరియు సూక్ష్మ ప్రయాణము ద్వారా వైశాఖ లోయలో నిర్వహింపబడే జ్ఞానుల వార్షిక మహా సమావేశమును అనుభూతి చెందగలిగే అవకాశము కూడా కలుగుతుంది.
"అంతర్దర్శన ధ్యానముల" నుంచి
ధ్యానము 34
Wash Karma in space.
On the deep blue slate paint ever elevating colours,
ever at the feet of the Master in the Vaisakha Valley.
“నిశీధి నీలమున కర్మమును కడుగుము.
నీలమగు మనోఫలకముపై ఉత్తమము, ఊర్ధ్వము అగు రంగులను చిత్రీకరించుము.
పై సమస్తమును వైశాఖలోయ యందలి పరమగురువు పాద పద్మముల సాన్నిధ్యమున నిర్వర్తించుకొనుము.”
వివరణము
అంతులేని ఆకాశము కంటికి నీలముగా అగుపిస్తుంది. సాధకులు ప్రతినిత్యము తమ కర్మమును ఈ నీలములో కడుగుగొనవలెను. నీలమును ధ్యానించుచు, నీలమును తనలోనికి ఆహ్వానించుకొనవలెను. నీలము గూఢమున తెలుపే. ధ్యానము ద్వారాగాని, ఓంకారము లేక గాయత్రి ఉచ్చారణ చెయ్యడము ద్వారాగాని, స్పష్టమైన ఆకాశపు నీలి రంగును ధ్యానము చెయ్యడము వలనగాని నీలము యొక్క లోతులు తెలియవు. అందులకై సాధకుడు ఈ నీలములో ప్రవేశించి అందులో స్థిరముగా ఉండవలెను. ధ్యానము పూర్తియగు సమయమునకు అతడి మనసు, ఇంద్రియములు, మరియు అతని శరీర ధాతువులలో నీలము నిండి వుండును. ఇది ఆ దినమును మరియు మనసును శుభ్రపరుచుటకు సహకరించును.
ఇట్లు చెయ్యకపోతే, మనసు స్వతహాగా తన పూర్వ కర్మ వాసనలను తీసుకువస్తుంది. మనిషి యొక్క మనసు నిత్యము అప్రియమైన వస్తువులను, సంఘటనలను, ప్రదేశములను, మరియు వ్యక్తులను గుర్తు చేస్తుంది. వాటి వలన తక్షణమే అసూయ, అహంకారము, భయము, అనుమానము, ద్వేషము కలిగి తద్వారా చిరాకు, అలజడి కలుగుతుంది. ఈ పూర్వ కర్మ వాసనలను నియంత్రించి, అరికట్టడానికి, నీలమును ఆహ్వానించడము ద్వారా చిత్తమునకు బల మేర్పరచవలెను. కాని సూటిగా నీలము వద్దకు మనము పోలేము. దీనికి వర్ణముల ఆరోహణా క్రమమును వినియోగించుకొనవచ్చును. ఈ ఆరోహణా క్రమము ఊదా వర్ణము నుంచి గులాబి వర్ణమునకు, సిందూరమునకు, బంగారు వర్ణమునకు, తేనె వర్ణమునకు, లేత నీలి రత్నపు వర్ణమునకు, లేత నీలమునకు, నీలమునకు, నిశీధి నీలమునకు వున్నది. వెలుగు యొక్క విస్తృతియే వర్ణములు. ఉత్తమ వర్ణముల ధ్యానము వలన మనసు పూర్వ కర్మ వాసనలను శుద్ధి చేయును. అనేక వర్ణముల వ్యక్తీకరణలకు అనేక మంత్రములు ఉన్నవి. (వివరములు డా. కె. పార్వతీకుమార్ గారి Mantrams (English) పుస్తకమును చూడుడు)
మనసు నీలములో స్థిర పడినప్పుడు, బుద్ధి లోకపు వెలుగు మరియు శబ్దముల అనుభూతులు సాధకుడిని ఆనందమయ స్థితిలోకి ఉన్నతిని గలిగిస్తాయి. ఇవి అతనికి సత్సంకల్ప కార్యములు చెయ్యడానికి ఉత్తేజమును కూడా ఇస్తాయి. ఈ కార్యములు సాధకుడిని బుద్ధి లోకములలో ఉన్న వైశాఖ లోయలో వసించే సద్గురువు పాదపద్మముల సాన్నిధ్యమునకు చేరుస్తాయి.
వైశాఖ లోయ సూక్ష్మ శక్తులు గల నిగూఢమైన లోయ. ఇక్కడ పరమగురువులు ప్రతి సంవత్సరము సమావేశమవుతారు. సాధకునికి కూడా పరమగురువులను ఈ లోయలో కలవడానికి అవకాశము గలుగుతుంది. వైశాఖ లోయలో సద్గురువు పాదపద్మములను చేరడానికి ఈ క్రింది చెప్పబడిన ప్రక్రియ ఇవ్వబడినది:
- నిశ్శబ్దముగా ఉన్న ప్రదేశములో మనసులోను మరియు శరీరములోను స్థిమితముగా కూర్చొనవలెను.
- మనసును నీలముతో సంధానము చేసి, అంతటా నీలమును దర్శించు కొనవలెను.
- తేజోవంతమైన తెలుపులో సద్గురువు ఆసీనులైయున్నట్టుగా దర్శించు కొనవలెను. ఆయన దక్షిణ హస్తము అభయ ముద్రలో ఉన్నట్లుగను, ఆయన కన్నులు అనుగ్రహమును ప్రసారము చేస్తున్నట్లుగను భావించుకొనవలెను. ఆయన ముఖము అర్థ నిమీలిత నేత్రములతో, మందస్మితముతో ఉన్నట్లుగా భావించుకొనవలెను.
- సద్గురువు చరణ సన్నిధిలో ఉన్నట్లు భావించుకొనవలెను. సద్గురువు మీ కంటే నాలుగు రెట్లు మించి ఉన్నట్లుగను, మీరు సద్గురువులో నాలుగోవంతు ఉన్నట్లుగా భావన చేసుకొనవలెను.
- మంచు శిఖరములతో మరియు తూర్పు నుంచి ఉత్తరమునకు పారుతున్న నదితో కూడిన పుణ్య పర్వత శ్రేణిలో ఉన్న పుణ్య లోయలో మీరు ఉన్నట్లు భావన చేసుకొనవలెను.
- లోయలో వెన్నెల కాంతిని భావన చేసుకొనవలెను.
- చివరగా, పరిపూర్ణమైన నిశ్శబ్దములో చిరు గాలి మిమ్ములను సున్నితముగా తాకుతున్నట్లుగా భావన చేసుకొనవలెను.