{"timeout":"7000","width":"990"}
  • ధ్యానము
  • క్రతువులు
  • పవిత్ర స్థలములు
  • పరమగురువులు
  • బృంద జీవనము

ధ్యానము

ఆంతరంగికమైన ఎదుగుదలకు ధ్యానమే ఆధారము. ఆ నిశ్శబ్దపు క్షణములలోనే ఆత్మయొక్క నిశ్శబ్ద అభివృద్ధి సంభవించును.

క్రతువులు

ఆరాధన, ప్రార్థనలు, క్రతువులు, మరియు ధ్యానములు మొదలైనవన్నీ అందరిలోని 'ఒకే' వెలుగుతో సంబంధమేర్పరచుకొనుటకు సాధనములు మాత్రమే.

పవిత్ర స్థలములు

పవిత్ర స్థలములలోకి ప్రవేశించేటప్పుడు జాగరూకులమై ఉండాలి. నిశ్చితమైన అభిప్రాయములతో ప్రవేశించకూడదు. ఆ 'సమక్షము'నందు ఉండుట తప్ప ఏమీ చేయరాదు.

పరమగురువులు

పరమగురువుల జీవితములు, వారి చర్యలు, మరియు వారి బోధనల అధ్యయనము మనకు స్ఫూర్తినిచ్చి, మన ఆలోచనా ధోరణులలో మార్పులు తీసుకువస్తాయి.

బృంద జీవనము

బృంద చైతన్యమునకు, బృంద కార్యములకు, స హృదయము ఒక్కటే మార్గము.

జగద్గురు పీఠము

“ఈ సమూహము వ్యక్తుల బహిరంగ కలయిక కాదు. వారి హృదయముల అంతరంగ సమీకరణము.”

జగద్గురు పీఠములో ప్రవేశము సంప్రదించుటకు

జగద్గురు పీఠము అనగానేమి

జగద్గురు పీఠము చిహ్నము

దివ్య జ్ఞానమును బోధించిన పరమ గురువుల బోధనల యందు రుచి కలిగి, స్ఫూర్తిని పొందిన మానవాళి ఉద్ధరణకు ఆవిర్భవించినది జగద్గురు పీఠము (The World Teacher Trust). నిరంతర సేవానిరతి, ఆనందము, ప్రేమ తత్త్వముతో నిండి, విశ్వాంతరాళమును పరిరక్షించు పరమ గురువుల వాహికగా ఈ సంస్థ ఆవిర్భవించినది.

ఈ సంస్థ సభ్యులందరూ ప్రకృతి సహజమైన, నిరాడంబర జీవనముతో ప్రేమ తత్త్వమును పెంపొందించుతూ, ధ్యానము, స్వాధ్యాయము, పరహితములు మిళితమైన మనస్సుతో ఉండి, నిశ్శబ్దముగా తమ కార్యక్రమములు నిర్వర్తించుకొందురు.

“సేవయే మూల లక్ష్యము” అన్నది వీరి ధ్యేయము.

చట్టసంబంధిత సంస్థ వివరములు

నామధేయము

ఈ సంస్థ ఆధ్యాత్మిక విధానములను నిత్య జీవితములో అలవరుచుకొనుటకు, “జగద్గురువు” పేరిట నామకరణము చేయబడినది. “జగద్గురువు” విశ్వాంతరాళమునకు సంబంధించిన ప్రజ్ఞయే కాని ఒక మతము, గురువు, సిద్ధాంతమునకు సంబంధించిన వ్యవస్థ కాదు.

జగద్గురు పీఠము ఋషి సంప్రదాయమును, మహర్షులందించిన దివ్య ప్రణాళికను అనుసరించి ఉండును:

సాంఘిక, ఆర్థిక, దైనందిన వ్యవహార జీవనము ప్రకృతి బద్ధముగా నుండుట ఆవశ్యకము. మానవాళి విపరీతమైన కోరికలతో, పదార్థమును పెంచుకొను దృష్టి, ఆ మార్గములో ప్రకృతి విధ్వంస చర్యలు గర్హింప దగినవి, మరియు ప్రకృతి సూత్రముల కన్న విరుద్ధమైనవి.

వ్యవస్థాపకులు, అధ్యక్షులు

మాస్టర్ ఇ. కె.

జగద్గురు పీఠము 1971 వ సంవత్సరము నవంబరు 18 వ తేదీన విశిష్ట ప్రణాళికతో డా. ఎక్కిరాల కృష్ణమాచార్య (Master E.K.) గారిచే స్థాపింపబడినది. ఈ సంస్థ, మాస్టరు గారు ఆచరించి చూపిన జీవన విధానము, వారు అందించిన దివ్య జ్ఞానము, మరియు బోధనలచే స్ఫూర్తి చెంది యున్నది.

మాస్టర్ కె. పి. కె. 1984-2022 డా. కంభంపాటి పార్వతీకుమార్ గారు (Master K.P.K.) అతను ఈ సంస్థ యొక్క గ్లోబల్ గౌరవ అధ్యక్షుడిగా మరియు యూనివర్సల్ హ్యూమన్ బ్రదర్‌హుడ్ యొక్క ఈస్ట్-వెస్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

వీరిరువురి బహుముఖమైన జ్ఞాన బోధలను భౌగోళికంగా సత్ సాధకులకు అందించి, స్ఫూర్తిని పంచి, చక్కని జీవనశైలితో కూడిన సాధనా మార్గమున నడిపించుటకు ఈ సంస్థ పనిజేయుచున్నది.

ఆధ్యాత్మిక మూలము గురించి వివరములు

జగద్గురు పీఠము భౌగోళిక కేంద్రము

జగద్గురు పీఠము భౌగోళిక కేంద్రము( WTT గ్లోబల్) ఏ రాజకీయములకు గాని, సిద్ధాంతములకు గాని బద్ధము కాక, వ్యక్తికీ, బృందమునకు, ప్రాంతమునకు పరిమితము కాక, సక్రమమైన అవగాహనతో, సామరస్యముతో వ్యవహరించు సంస్థ. ఈ సంస్థ ఆశయములు:

  • ఆధ్యాత్మిక విద్య ద్వారా మానవులలో ప్రజ్ఞా వికాసము కలిగించుటకు, తద్వారా పరిపూర్ణత్వము సాధించుటకు వలసిన అన్ని విషయములు సాధనాపరముగా తెలియజేయుట.
  • మానవులకు గల బాధలను తొలగించుటకు (వైద్య, విద్య, ఆర్థిక విధానముల ద్వారా) తమవంతు సహకారము అందించుట.
  • మానవులలో గల మానసిక, నైతిక విలువలను పెంపొందించుటకు కార్యక్రమములను ఏర్పరచుట.
  • జాతి, మత, కుల వివక్షత లేక ఆధ్యాత్మిక విద్య యొక్క రహస్యము మరియు ఆవశ్యకతలను ప్రచోదనము గావించుట.
  • సత్యదర్శనమునకై ఉన్ముఖులైన వారికి ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానమును ఆచరణాత్మకముగా ప్రసాదించుటకు నిరంతరము కృషి చేయుట.

జగద్గురు పీఠము భౌగోళిక కేంద్రము గురించి వివరములు

ఉద్దేశ్యము మరియు గమ్యము

సమాజములో గల ఇతర సంస్థలు, బృందములతో సహకరించుట, మన్నించుట ఒక సంస్కారముగా భావించుట. సమస్త సాధనలను, సేవా కార్యక్రమములను సక్రమమైన అవగాహన చేసికొని నిశ్శబ్దముగా, క్రమశిక్షణతో దీర్ఘకాలము ఆచరించుట.

ప్రాచీన భారతీయ సాంప్రదాయ బద్ధమైన జీవనము నిర్వర్తించుకొనుట, నిర్వర్తింపజేయుట. సనాతన సాంప్రదాయమును గౌరవించి, ప్రయోజనము పొందుట. భూమిపై గల సకల సిద్ధాంతములు, మతముల యందుగల ధర్మమును గ్రహించి మన్నించుట.

మూఢ విశ్వాసములు, మతావేశములకు తావులేకుండుట. ఇతరులను విమర్శించుట గాని, ఖండించుట గాని చేయకుండుట.

సాధక సోదర బృందములు

ఈ సంస్థకు అనుసంధానముగా అన్ని రకముల జీవన ప్రవృత్తులలో, భూగోళ పర్యంతములో బృందములుగా ఏర్పడి వున్న సాధకులున్నారు.

ప్రధానముగా “సత్సంకల్పము” ధ్యేయముగా వివిధ అంశములలో విశ్వమానవ శ్రేయస్సునకు కృషి సల్పుతున్నారు.

బృందముల గురించి వివరములు జగద్గురు పీఠములో ప్రవేశము

ధర్మానుష్ఠాన సంస్థ

అనుస్యూతక ధర్మానుష్ఠాన జీవన ప్రబోధక సంస్థ

ఈ సంస్థ జీవన స్రవంతిలో కాలముతో పాటుగా, నిరంతరముగా “స్వయం నియంత్రణ” గా ధర్మమును అవగాహన చేసికొని పాటించుట, సాధనా మార్గములో సూత్రములు తమ ప్రయోజనమునకై పాటించుట యున్నది గాని, నిబంధనలు ఏమియూ లేవు. పరమగురువుల బోధనల స్ఫూర్తియే సోదర బృందములను నడిపించుచున్నది.

బృందములు తరచుగా కలిసి తమ అనుభవములను పంచుకొనుట జరుగును.

ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ బృంద జీవనములు భారతదేశములోను, ఐరోపా (English), ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండములలోనూ (English) జరుగుచున్నవి.