మాస్టర్ కె. పి. కె.


“ఈ సమూహము వ్యక్తుల బహిరంగ కలయిక కాదు. వారి హృదయముల అంతరంగ సమీకరణము.”

డా. కె. పార్వతీకుమార్

జగద్గురు పీఠము | ఆధ్యాత్మిక మూలము ముఖ్య సమాచారము రావ్ అండ్ కుమార్ వెబ్సైటులో ఉన్న వివరములు

మాస్టర్ కె. పి. కె.

డా. కె. పార్వతీకుమార్ గారు 1945 వ సంవత్సరము నవంబరు 7 వ తేది ఉదయం 7 గంటల 33 నిమిషములకు విజయవాడ (ఆంధ్రప్రదేశ్) నందు శ్రీమతి రామలక్ష్మి మరియు శ్రీ కంభంపాటి వేంకటప్పయ్య శాస్త్రి పుణ్యదంపతికి జన్మించిరి. డా. కె. పార్వతీకుమార్ గారు బాధ్యతగల గృహస్థులు. పేరున్న ఆర్థిక సలహాదారులు. విజ్ఞానమును వికసింపజేయు గురువు. శారీరక, మానసిక రుగ్మతలను తొలగింపజేయు వైద్యులు. అనేక గ్రంథముల సంకలన కర్త, నిగర్వి, నిర్మలహృదయులు. డా. కె. పార్వతీకుమార్ గారు, వారి జీవితమును సాంఘిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళారంగములలో నిరంతర సేవలకు అంకితము చేసిరి. ఆర్థిక, సాంఘిక సేవారంగములలో, మానవాళి మనుగడలో సుఖము, శాంతి పరిమళింపజేయు సూత్రముగా ఆధ్యాత్మికత అలరారినప్పుడే దానికి సాఫల్యత, సార్థకత సిద్ధించునని వారి నమ్మకము. “మానవసేవయే మాధవసేవ” అను నానుడికి సరైన నిర్వచనము డా. కె. పార్వతీకుమార్ గారి వర్తన ఋజువు చేస్తుంది. వివిధ రంగములలో వారి సేవలను గుర్తించి, గౌరవించి 1997 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ “డాక్టర్ ఆఫ్ లెటర్స్” (Doctor of Letters) పట్టానందించి, ఆదర్శవంతమైన వారి సేవలను కొనియాడినది. 2013 లో వీరిని గౌరవ ఆచార్యులుగా నియామకము గూడా జరిపిరి. 1)

Master K.P.K. - An Expression of Synthesis (English) Master K.P.K. (English)

వీరు మాతృదేశము మొదలుగా ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, మరియు ఐరోపా ఖండములలో గల ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు ప్రచోదనము కలిగించుచూ భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యోగాభ్యాసము ఇత్యాది విషయములలో బోధనలు లెక్కకు మించి వున్నవి. వీరి బోధనలు పలురకములయిన విషయ, విజ్ఞాన వీచికలుగా, నిత్యజీవితమున అనుసరణీయమై, ఆచరణయోగ్యమై, ఆచరించు వారికి సత్యదర్శనమున సత్వర ఫలితములనందించుచున్నవనుట పూర్తి అనుభవముగ నున్నది. డా. కె. పార్వతీకుమార్ గారి ఉపన్యాసములు, ప్రవచనములు, గ్రంథముల యందు వైదిక సాంప్రదాయములలోని ఉపనిషత్తులు, వేదములు, భాగవత, భారత, రామాయణాది పురాణములు, భగవద్గీత మున్నగు సమస్త భారతీయ వాఙ్మయమును, మాస్టర్ జ్వాల్ కూల్ (ఏలిస్ ఏ. బెయిలీ) మరియు మేడమ్ H.P. బ్లావెట్స్కీ ల గ్రంథములలోని విషయములతో సామ్యమును, అనుబంధము, విషయ సమతుల్యములను అపురూపముగా, అన్నియూ ఆయన చేతనే గ్రంథస్థమైనాయా అన్నట్లుగా వివరణ వుంటుంది. సుమారుగా 18 సంవత్సరముల పైన డా. ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారితో సహజీవనము, ఆధ్యాత్మిక కలయిక కలిగి డా. ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు ఆరంభించిన ప్రాక్ప్రశ్చిమ సమన్వయము కొనసాగిస్తూ 60 అంతర్జాతీయ యాత్రలు, 3 పర్యాయములు భూప్రదక్షిణ సతీ సమేతముగా నిర్వహించిన మహాత్ములు.

డా. కె. పార్వతీకుమార్ గారి కార్యప్రణాళిక, నిర్వహణ లెక్కించ తరము కాదు. 500 కి మించిన ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహించారు. వారు జ్ఞాన బోధలు, యోగము, జ్యోతిషము, స్వస్థత, ప్రాణాయామము, కాలము దాని పరిజ్ఞానము, సృష్టి విజ్ఞానము, ధ్యానము, సంస్థల నిర్వహణము, వర్ణములు (Color), మరియు శబ్దతరంగముల (Sound) సంబంధిత విజ్ఞానము, చిహ్నములు (Symbols), యంత్రములు, తంత్రములు, దైవారాధన, సమగ్రత్వములను అనుసంధానము చేస్తూ ఆయన విశ్వరూపమును అనేక సార్లు ప్రకటించిన మహా ప్రవక్త.

డా. కె. పార్వతీకుమార్ గారి ఆధ్వర్యములో అనేక ధార్మిక సంస్థలు దేశవిదేశములలో పరహితము గావించుచున్నవి. పరహితము పరమధర్మముగా, “భగవద్ధ్యానము, స్వాధ్యాయము, పరహితము” లకు త్రిధాబద్ధులయి, ఎందరో ఆస్తికులకు ప్రచోదకులైరి. పరమగురు పరంపర వారికాదర్శము. భగవంతుడు తమను నమ్మి తమకు అప్పజెప్పిన కార్యములు యజ్ఞార్థముగా నిర్వహించి, మరి కొంత కార్యభారమును పరమ గురువుల నుంచి ఎప్పటికప్పుడు అందుకొనుచున్నారు.

డా. కె. పార్వతీకుమార్ గారి గురించి మరిన్ని వివరముల కొరకు పుస్తకము: Master K.P.K. - An Expression of Synthesis చూడండి.

జిజ్ఞాసువుల కొరకు ముఖ్య సమాచారము


దివ్య స్ఫూర్తి

 • డా. కె. పార్వతీకుమార్ గారి జీవితమునకు ప్రథమ స్ఫూర్తి తండ్రిగారైన శ్రీ కంభంపాటి వేంకటప్పయ్య శాస్త్రి గారు. (వీరి జీవిత వివరములు శ్రీ శాస్త్రిగారు అను గ్రంథమున వివరించుట జరిగినది.)
 • డా. ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారి మార్గదర్శకత్వము వీరి జీవితమున నిరంతరము భాసించుచున్నది. ( మన మాస్టరు గారు అను గ్రంథమున వీరిని గూర్చి విశేషముగ వివరించబడినది).

బోధనలు

 • నిశ్చలమైన దైవానుభూతిని నిరంతరము మధురముగా ఆస్వాదించుట. సమాజమునకు నిశ్శబ్దముగ, నియమ బద్ధముగ సేవలందించుట.
 • మాస్టర్ సి. వి. వి. గారి రాజయోగమును, మాస్టర్ ఇ. కె. గారు ప్రతిపాదించిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమములను సమన్వయ పరిచి, భౌగోళికముగా నిత్య ఆచరణ యోగ్యమైన యోగ జీవితమును వేలాదిమందికి సంతర్పణ చేయుచున్న ధన్యజీవులు, ఆరాధ్య గురువులు.
 • దివ్యమైన విషయములను దర్శించి వాటిని సామాన్యులకు సహితము అవగాహనము అగురీతిలో ఆచరణాత్మకముగా వివరించగల దేశికులు.
 • సున్నితముగను, లోతుగను అఖండమైన విజ్ఞాన విషయములు అవగాహన కలుగు రీతిలో వివరించి ఆచరణా పరులుగా తయారు జేయుట వీరి ప్రత్యేక ప్రయోగము.
 • జీవులకు కర్తవ్యము, జీవన విధానము, సంఘర్షణలేని ప్రవర్తనమును ఆకళింపు జేయుట.
 • ప్రాక్ప్రశ్చిమ దివ్యబోధలనన్నింటిని ఆకళింపు గావించుకొనుచు, దివ్య ప్రణాళికను నిర్వర్తించుచున్న పరమగురువుల కార్యక్రమమునకు అంకితమై వారందిస్తూన్న దివ్యజ్ఞానమును సమకాలీన సమాజమునకు అవగాహన అగురీతిలో అనేక గ్రంథములుగా తీర్చి దిద్దిన మహనీయులు.
 • దేశవిదేశముల పర్యంతము అలసటనెరుగక 1981 సంవత్సరము నుండి పర్యటనలు జరుపుతూ 60 కి మించి విదేశ పర్యటనలు, 3 సార్లు భూప్రదక్షిణ గావించారు.
 • 500 కు మించి ప్రత్యేక విషయ సదస్సులు, బోధనలు ఆర్జంటీనా, క్యూబా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయిల్, ఇటలీ, మెక్సికో, దక్షిణ ఆఫ్రికా, స్పెయిను, స్విట్జర్లాండ్, అమెరికా సంయుక్త రాష్ట్రములు, వెనిజ్యులాలందు పర్యటించినపుడు వెలువరించిన 4,500 కు మించిన ప్రవచనములు సీడీలుగా (CD) ముద్రితములయినవి.
 • తపస్సు, స్వాధ్యాయము, పరహితము అను సమకోణ త్రిభుజమును సమన్వయించుకొనిన నిర్మల హృదయులు.
 • క్రమశిక్షణకు మారుపేరుగా శ్రద్ధాభక్తులతో దివ్య కార్యక్రమములను చేపట్టి నిర్వర్తించుట. వీరి ఆలోచన, మాట, చేత, నడక అత్యంత క్రమశిక్షణతో వుండుట. వీరి ప్రతికదలికయందు ఒక నిర్దిష్టత, నియమము మేళవించియుండుట. చేపట్టిన కార్యక్రమములను అంకిత భావముతో తమను సమర్పణ చేసికొని నిర్వర్తించి పూర్తి చేయుట. సౌజన్యము, సౌశీల్యము, సమవర్తనము కలిగిన సౌకుమార్యులు.

రచనలు

 • 135 కు పైగా గ్రంథములు వీరి ద్వారా వెలువడినవి.
 • గ్రంథములన్నియు సాధకుల కోరిక మేర, పలు విజ్ఞాపనల తదుపరి రూపు దిద్దుకొనుట విశేషము.
 • ఆంగ్ల గ్రంథములను, వీరి ఉపన్యాసములను, విదేశీ సోదర బృందములు తమతమ భాషలలోనికి అనువాదము చేసికొని ముద్రించుకొని సమర్పించిరి. ఇవి జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, హీబ్రూ, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో వచ్చినవి.
 • వీరి ప్రసంగములు వీడియో, సీడీ (CD) రూపములలో ఒక లైబ్రరీగా అంతర్జాలమునందు ఏ క్షణములోనైనా వినుటకు వీలుగా నిక్షిప్తము గావించబడి అందరికీ అందుబాటులో నున్నవి.

ప్రచురణలు

 • జగద్గురు మాగజైన్ ట్రస్టుకు అధ్యక్షులు. ఇందు కులపతి బుక్ ట్రస్టు, త్రివేణి బుక్ ట్రస్టు, ధనిష్ఠ ఫౌండేషన్ లు గ్రంథములు ముద్రించుచున్నవి.
 • నావాణి మాస పత్రిక: 1984 నుండి డా. కె. పార్వతీకుమార్ గారు సంపాదకత్వ బాధ్యత వహించి అన్ని వర్గముల వారికి ఆధ్యాత్మిక పరిణామమును, వ్యక్తిగత వికాసమును కలిగించు వ్యాసములను, పరమగురు పరంపర ప్రణాళికను సరళమైన రీతిలో అందించుచున్నారు.
 • వైశాఖ మాసపత్రిక: 1987 నుంచి జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, మరియు ఆంగ్ల భాషలో విదేశీయుల అవగాహన కొరకు సనాతన భారతీయ ధర్మములను అందించుచున్నారు.
 • పారాసెల్సెస్ - ఆరోగ్యము మరియు స్వస్థత: స్విట్జర్లాండ్ దేశమునందు నివసించి, భూగోళమునకు వైద్య విధానమును అందించిన ద్రష్ట “పారాసెల్సెస్” మహనీయులు అందించిన వైద్య విజ్ఞానమును 2003 నుండి డా. కె. పార్వతీకుమార్ గారు సంపాదకత్వ బాధ్యత వహించి అందించుచున్నారు.

స్వస్థ వృత్తము (ఆరోగ్యము)

 • మానవుడు తన ప్రణాళికను సక్రమముగా నిర్వర్తించుకొనుటకు పటిష్ఠమైన ఆరోగ్యము కావలెను. డా. కె. పార్వతీకుమార్ గారు ఆరోగ్యమునకు మూల సూత్రమైన స్వస్థ వృత్తము (Healing) విధానమును చక్కగా తెలిసినవారు. వీరు అనేకమందికి యోగము ద్వారా, మానసిక, శారీరక ఆరోగ్యమును దేశ విదేశములలో అందించుచు, శబ్దము, వర్ణము, ధ్యానముల ద్వారా ఆరోగ్యము చేకూర్చుటయే కాక, బృందములకు ఎంతో స్ఫూర్తిని, సలహాలను అందించుచు భౌగోళికముగా సేవలందించుచున్నారు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమములు

 • జగద్గురు పీఠము: 1971వ సంవత్సరము నందు నవంబరు 18 వ తేదీన పరమగురు పరంపరకు అనుసంధానముగా దివ్యప్రణాళిక ననుసరించి ఆవిర్భవించినది. మాస్టర్ ఇ. కె. గారికి సహకరించుచు, ఆధ్యాత్మిక కార్యక్రమములు నిర్వహించే సేవా సంస్థలకు “క్రమశిక్షణ”, “నిర్దిష్ట విధానము” ఉండవలెనన్న సిద్ధాంతముతో నిర్వహించుచున్నారు. మాస్టర్ ఇ. కె. గారి దేహత్యాగము అనంతరము 1984 వ సంవత్సరము నుండి పూర్తిగా బాధ్యత తీసికొని నడిపించుచున్నారు. వీరు ప్రస్తుత అంతర్జాతీయ, భౌగోళిక గౌరవాధ్యక్షులు. ఇందు 27 దేశములకు సంబంధించిన కార్యక్రమములు జరుగుచున్నవి.
 • వ్యక్తులకు కావలసిన స్ఫూర్తి (inspiration), సహకారము (cooperation), విధానము (procedure) అందజేసి, ఎన్నో సేవాకార్యక్రమములకు శ్రీకారము చుట్టిరి. ఇవన్నియూ వీరి నేతృత్వమున అలరారుచున్నవి.
 • జీవన కార్యక్రమము ఏదైననూ, దానియందు ఆధ్యాత్మిక రుచిని చూపించుట, కల్పించుట వారి ప్రత్యేకత. మేల్కాంచినది మొదలు నిదురించువరకు చేయు ప్రతి పనియందును దివ్యత్వముట్టిపడవలెనని వారి నిర్వర్తన. అనేకమంది పూజ్యులు, గురువులు ఈ కారణముగనే వారి యెడల ప్రేమ పూరిత వాత్సల్యము ప్రకటింతురు.

సామాజిక సేవ

 • సమాజమునకు సేవ చేయవలసిన బాధ్యతను స్వచ్ఛందంగా గ్రహించి డా. కె. పార్వతీకుమార్ గారు ఏర్పరచిన సంస్థ సత్సంకల్ప బృందము (Circle of Goodwill)
 • శంకర్ ఫౌండేషన్ (1985): వ్యవస్థాపక అధ్యక్షులుగా డా. పార్వతీకుమార్ గారు ఈ సంస్థకు స్ఫూర్తినిచ్చి సలహాలనందజేసిరి. ఈ సంస్థ నేత్ర వైద్యాలయమును, మాతా శిశు సంక్షేమ వైద్యాలయమును విశాఖపట్టణము సింహాచలము నందు నెలకొల్పి వేలాదిమందికి ఉచిత వైద్యము చేయుచూ రాష్ట్ర వ్యాప్తముగా పేరుపొందుచున్నది.
 • భవతరణి చారిటబుల్ ట్రస్ట్ (1998): విశాఖపట్టణమున తూర్పు సముద్రతీరమున “భవతరణి” అమ్మవారి ఆలయమునకు వారు వ్యవస్థాపక ట్రస్టీగా వ్యవహరించుచున్నారు. ఈ ఆలయము కలకత్తా నగరములో దక్షిణేశ్వర్ లోని ఆలయమునకు ప్రతీక. ఈ సంస్థ సాంఘిక, లలిత కళారంగములను డా. కె. పార్వతీకుమార్ గారి పూర్తి ప్రేరణ సహకారములతో ప్రోత్సహించుచున్నది.
 • హంసవన పుణ్యక్షేత్రము (1999): ఎంతో అమూల్యమైన రామాద్రి పుణ్యక్షేత్రము వారి అధ్యక్షతకు అప్పగింపబడినది. విశాఖ-భీమిలి మధ్య సాగరతీరము వెంబడే అత్యంత సమీపములో విశిష్టమైన పర్వత పాద ప్రాంతమున ఏర్పడిన ప్రాంగణము. పర్యావరణ పరిరక్షణ. మూలికలవలన స్వస్థత. 33 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహము. ఉచిత వైద్యము, సంస్కృత, సనాతన విద్యాలయము, నిరంతరబోధనలు. 365 కోట్ల శ్రీరామ నామములు ప్రతిష్ఠాపన వలన భూమాత ఉప్పొంగి శక్తిమయముగా ఆశీర్వదించుచున్న స్థితి. దేవాలయముల సముదాయము. సుమారు 150కి పైగా గోవులకు ప్రత్యేక శాలల నిర్మాణము, వాటికి ఎంతో ఆరోగ్యవంతముగా, విశాలముగా వసతులు, పరిరక్షణ బృందము.
 • గణపతి ఆలయములు - మండపములు: డా. కె. పార్వతీకుమార్ గారు ప్రణాళికా బద్ధ జీవనమునకు గణపతి పూజా విధానము ఆవశ్యకత తెల్పి, సిద్ధి గణపతి, బాల గణపతి, యోగ గణపతి, క్షేమ గణపతి, విజయ గణపతి, అభయ గణపతి, బుద్ధి గణపతి పేరిట ఆలయములు, మండపములు నిర్వహించిన స్ఫూర్తిదాయకులు.
 • శ్రీరామ లేఖన మహా యజ్ఞము: డా. కె. పార్వతీకుమార్ గారు తమ పితృదేవుల ప్రేరణతో శ్రీ రామనామ లేఖన మహాయజ్ఞము పేరిట శ్రీ రామ కోటిని వ్రాయుటకు పుస్తకములను అచ్చు వేయించి, శ్రీ రామాద్రి నందు 365 కోట్లను స్తూపముల యందు నిక్షిప్తము చేసిరి. ఇక్కడ నుండి బెంగుళూరు, మైసూరుల యందలి జగద్గురు పీఠము కార్యాలయములలో కూడా ఈ రామకోటి స్తూపములు నెలకొల్పబడుచున్నవి.

లలిత కళలు

 • సంగీత జనకులము: డా. కె. పార్వతీకుమార్ గారు సంగీత ప్రియులు. సంగీత జనకులమునకు అధ్యక్షులు. వేలాదిమంది సంగీత కళాకారులు తీర్చి దిద్దబడుచున్నారు.
 • యోగ గణపతి మ్యూజిక్ సర్కిల్ (1998): సంగీత కళాకారులకు కచేరీలు ఏర్పాటు చేసి బంగారు పతకములతో ప్రోత్సాహమునిచ్చి డా. కె. పార్వతీకుమార్ గారు సేవ చేయుచున్నారు.
 • అభినయ ఆర్ట్స్ అకాడమీ (1992): విశాఖ నగర సాగర తీరమునందు శ్రీ అన్నమాచార్య సుందర విగ్రహ ప్రతిష్ఠాపన డా. కె. పార్వతీకుమార్ గారి నేతృత్వమున జరిగినది. అన్నమాచార్య సంకీర్తన ఆలాపనా నిష్ణాతుల చేత సంగీతవిభావరులు, ఉత్సవములు జరుపుచున్నారు.

కుటుంబ జీవనము

 • డా. కె. పార్వతీకుమార్ గారు బాధ్యతగల ఉత్తమ గృహస్థులు. సాంప్రదాయము, సంస్కారము, సత్యము, ఈ మూడును సమ్మిశ్రమముగా జీవించుచున్నారు. విశ్వవ్యాప్తముగా అనేకమందికి స్ఫూర్తి కలిగించుచున్న వీరు, కుటుంబపరముగా చక్కని సమన్వయము కలిగి యుండుట ఆశ్చర్యము కాదు. వీరి సహధర్మచారిణి శ్రీమతి కృష్ణకుమారి గారు ఆర్షధర్మ పరాయణులు, ఆదరణ, ఆప్యాయత కలిగి డా. కె. పార్వతీకుమార్ గారి కార్యక్రమములలో మనసా, వాచా, కర్మణా సహకరించుచున్న మాతృమూర్తి. వీరికి సౌజన్యమూర్తియైన కుమార్తె, వినయము, ప్రతిభకల కుమారుడు వీరి ఆధ్యాత్మిక జీవనమునకు చక్కని సహకారము అందించు కుటుంబ సభ్యులు.

విద్యా వ్యాసంగము

 • డా. కె. పార్వతీకుమార్ గారు చిన్ననాటి నుండియు ఉపాధ్యాయులకు మరియు తోటి విద్యార్థులకు ఒక ప్రత్యేకాకర్షణగా నిలిచెడివారు. వారి ప్రవర్తన, మృదుత్వము, దీక్ష, ప్రాథమిక విద్యార్థి దశ నుండి విశ్వ విద్యాలయము విద్యార్థి దశ వరకు, వారి ఉపాధ్యాయులకు కూడా ఉత్సాహకరముగాను, గర్వకారణముగాను యుండెడివి.
 • వారు విద్యాభ్యాసమున ఆసాంతము ప్రథమ శ్రేణిలో ప్రథములుగా నిలిచిరి. B.Com (Honours) పరీక్షలయందు (1965 వ సంవత్సరము) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రథమ విద్యార్థిగా నిలిచి బంగారు పతకమును పొందిరి. M.Com. పరీక్షలయందు (1966 వ సంవత్సరము) కూడ అదేరీతిగా బంగారు పతకమును సాధించుటయేగాక, వారు సాధించిన మార్కుల శాతము యొక్క రికార్డు నేటి వరకు ఛేదింపబడలేదు. మరియు వారు జాతీయ మెరిట్ స్కాలర్షిప్ హోల్డర్ గా నిలిచిరి.
 • సమాజమునకు వారందించిన ఎనలేని సేవలను గుర్తించి ఆంధ్ర విశ్వ విద్యాలయము వారు అరుదైన గౌరవమును “Doctor of Letters” 1997 సంవత్సరములో అందజేసిరి. సమాజములోని అనేక సేవా సంస్థలు, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు లెక్కకు మించి గౌరవ సత్కారములు అందించిరి.
 • డా. కె. పార్వతీకుమార్ గారు చక్కని క్రీడాకారులు. విద్యార్థి దశలో క్రికెట్, బాల్ బాడ్మింటన్ జట్లకు కెప్టెన్ గా వ్యవహరించెడివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయములో టెన్నిస్, టేబుల్ టెన్నిస్, కారమ్స్ వంటి క్రీడలలో ఛాంపియన్ గా నిలిచి 1961-66 సంవత్సరముల మధ్య అనేక క్రీడలలో రాణించిరి.

వృత్తి వ్యాసంగములు

 • స్ఫూర్తి, నైపుణ్యముగలవారు ఏదో ఒక రంగములో రాణించుట సహజము. కాని డా. కె. పార్వతీకుమార్ గారు వృత్తి విద్యయందు కూడ ప్రత్యేక తరహాలో ఉత్తీర్ణత సాధించి ఉత్తమ శ్రేణిలో నిలిచిరి. 1970 వ సంవత్సరము నాటికి (P.G. తో సహా 25 సంవత్సరముల వయస్సు పూర్తికాకమునుపే) “ఛార్టర్డ్ ఎకౌంటెంట్”గా అర్హత పొందిరి.
 • అదే సంవత్సరములో ఆంధ్రదేశములో ప్రముఖ ఛార్టర్డ్ ఎకౌంటెంట్ శ్రీ సి. ప్రసాద్ రావు గారితో కలిసి “రావు అండ్ కుమార్, ఛార్టర్డ్ ఎకౌంటెంట్స్” అను వృత్తి సంస్థను స్థాపించిరి.
 • వృత్తిని యథాలాపముగా నిర్వర్తించి, ధనార్జన ప్రధానోద్దేశ్యము కాకుండ, వృత్తిని అంకిత భావముతో నిర్వర్తించి “రావ్ అండ్ కుమార్” సంస్థను నేడు విస్తరింపజేసి అనేకమంది ఛార్టర్డ్ ఎకౌంటెంట్స్ (125 మంది) సమాజములో ఉన్నత స్థితిలో ఉండే విధముగా తీర్చి దిద్దిన ప్రజ్ఞావంతులు డా. కె. పార్వతీకుమార్ గారు. వృత్తిలో వారు అనేక మందికి స్ఫూర్తి అందించి ఆదర్శనీయులుగా నిలిచిరి.
 • వృత్తి సంబంధమైన వ్యక్తులతో సమాజ హితమైన కార్యక్రమములు అనేకము చేయించినారు. వారి చేతులు మీదుగా అనేక సేవాసంస్థలు రూపుకట్టుకొని నేడు సేవలను అందించుచున్నవి. వృత్తి యందు క్రమశిక్షణ, నీతి నియమములు ఆచరింపజేసి వృత్తి సంస్థను సమాజహితము కొరకు పనిచేయు సంస్థగా రూపొందించిరి. పలువురు పెద్దలచే అభినందించబడిరి. వ్యక్తులను శక్తిమంతులుగను, సంస్థలుగను తీర్చిదిద్దుట ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమముగా చేపట్టి ప్రభుత్వమునందు మరియు ప్రజలచే మన్ననలను పొంది, అనేక వృత్తి సంస్థలను, వీరిచే ప్రేరణ పొందిన యువకులచే విస్తరింపజేసి ఒక కుటుంబ వ్యవస్థగా వృద్ధిచేయుట ఒక విశేషము.
1)
ఈ వెబ్సైటులో “డా. కె. పార్వతీకుమార్” అను నామము వాడబడినది.