{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ఉత్తర విషువత్

“ధ్యానము అనగా చేయునది కాదు, జరుగునది”

మేష రాశి శూన్య డిగ్రీల కోణమునందు వచ్చే ఉత్తర విషువత్, సౌరమాన సంవత్సరమునకు ఆరంభము. ఈ సమయములో సూర్య భగవానుడు ఊర్ధ్వ లోకముల నుంచి ఒక నూతన ప్రేరణను మనకు అందజేస్తాడు. ఈ సమయము ఉచ్చస్థితుడైన సూర్యునకు మరియు అత్యుత్తమమైన జ్ఞానోదయమునకు సంకేతము.


ధ్యానములు, క్రతువులు | పండుగలు
విషువత్ ప్రార్థన యొక్క PDF
విషువత్-దర్శనము యొక్క PDF

ప్రకాశవంతమైన ఆధ్యాత్మిక ప్రజ్ఞ

ఉత్తర విషువత్

ఉత్తర విషువత్ పుణ్య దినమున సూర్యుడు మనకు గోచరించునట్టి ఉత్తర గమనములో భూమధ్యరేఖను దాటుతాడు, మరియు ఈ దినపు మిట్టమధ్యాహ్న సమయములో అతని కిరణములు భూమిని నిట్టనిలువుగా తాకుతాయి. భూమిలో నిలువుగా పెట్టిన ఒక దండమునకు ఆ సమయములో ఎటువంటి నీడ లేకుండా ఉంటుంది. దక్షిణ విషువత్ సమయములో కూడా అలాగే జరుగుతుంది. ఈ విధముగా మన పూర్వీకులు విషువత్ దినములను గుర్తించారు – ఈ దినములలో పగలు, రాత్రి సమయములు సరిసమానముగా ఉంటాయి.

ఉత్తర విషువత్ పుణ్య దినమున భూమధ్య రేఖపై సూర్యుని గరిష్ఠ స్థానము సంవత్సర చక్రములోని మిట్టమధ్యాహ్నపు సూర్యుని యొక్క ఉచ్చస్థితిని లేక ప్రకాశమును తెలుపుతుంది. ఇది మేష రాశి శూన్య డిగ్రీల కోణమునకు సంబంధించినది. మిట్టమధ్యాహ్నపు సమయములో మనకి అత్యధిక వెలుగు ఉంటుంది. అలాగే మేష రాశి అత్యధికమైన ప్రకాశము కలిగిన రాశి – ఇది జ్ఞానోదయమునకు ఉత్కృష్టమైన స్థానము. ఎలా అయితే భూమధ్య రేఖ దగ్గర ఈ సమయములో నీడ అతి చిన్నగా ఉంటుందో, అలాగే సంవత్సర చక్రము యొక్క ఈ మధ్యాహ్న సమయపు వెలుగులో మన స్వభావమును, మన నీడను, సమర్పణ చేసుకోవడానికి సునాయాసముగా ఉంటుంది.

మానవులందరిలోనూ మేషము శిరస్సు యొక్క పై భాగములో ఉంటుంది – ఇది మానవులలో అత్యున్నతమైన స్థానము. మానవుడు భగవంతుని ప్రతీక. మేషమును విరాట్పురుషుని శిరస్సుగా వేదములలో భావిస్తారు. ప్రతి సంవత్సర ఆరంభములో సూర్య భగవానుడు ఊర్ధ్వ లోకముల నుంచి ఒక నూతన ప్రేరణను క్రింది లోకములకు అందజేస్తాడు. ఈ నూతన ప్రేరణము ప్రతి సంవత్సరమునకు ఒక నూతన సందేశము, భూగోళము మరియు భూగోళపు జీవుల అభివృద్ధికి ఒక ప్రణాళిక. మనలో సౌర ప్రజ్ఞ, మోక్షమునకు మార్గము అయిన సహస్రార కేంద్రము నుంచి ఇది క్రిందికి దిగి వస్తుంది.

ఈ విధముగా ఉత్తర విషువత్ సమయములో మనము మన శిరస్సులోని ఈ ప్రకాశవంతమైన ఆధ్యాత్మిక ప్రజ్ఞతో అనుసంధానము చెందవలెను. అలా అనుసంధానము చెంది, ఉపదేశ పూరితమైన వెలుగు ప్రవాహమును, మన “మధ్యాహ్నపు పన్నెండు (twelve noon)” అయిన సహస్రారమును భావన చేసుకొనవలెను. దీనినే పరమగురువు పైథాగరస్ “High Twelve” అని పిలిచారు.

సూర్యునితో అనుసంధానము

విషువత్ పుణ్య దినములలో సూర్య శక్తి నిలువుగా మనలోకి వస్తుంది. భూగోళము మీద వున్న అన్ని జీవులలో ఒక్క మానవులు మాత్రమే ఎరుకతో, నిలువుగా సంచరించగలరు. వృక్షములకు మరియు జంతువులకు ఎరుక లేదు. జంతువులు నిలువుగా సంచారము చెయ్యలేవు.

ఈ విషువత్ దినముల యొక్క శక్తులను మనము చక్కగా గ్రహించడానికి భూమధ్య రేఖ మీద నిలువుగా నిలుచుని, సూర్యుని కిరణములు మన నాడీ మండలములో ప్రవేశిస్తున్నట్లుుగా భావన చేసుకొనవచ్చును. దివ్య మార్గము అయిన సుషుమ్న ద్వారా సూర్య కిరణములు గ్రహింపబడి, శిరస్సు నుంచి మూలాధారము వరకూ మనలను పూర్ణముగా ప్రజ్ఞోపేతము చేయగలవు. ఈ అంతర్ మార్గమును మాస్టర్ సి. వి. వి. గారు “vertical levels” మరియు “chief life” అని అన్నారు. మాస్టరు గారు పదార్థము, ఆత్మల యొక్క శక్తుల మధ్య యోగపరమైన సమతుల్యతను తీసుకువస్తారు.

సుషుమ్న దండము మన అంతర్ముఖ అస్తిత్వమునకు ఆధారము. ఇది వజ్రపు కాంతితో ఉంటుంది. దాని నుంచి మన వజ్ర శరీరము తయారుజేయబడుతుంది. యోగులు ఈ సుషుమ్న దండములో ఉండి, ఆత్మతో అనుసంధానము ద్వారా సూర్యుడితోను, సవితృడితోను, మరియు ఆదిత్యుడితోను గల సంబంధమును అనుభూతి చెందుతారు. ఈ విధముగా ఆత్మ యొక్క నాలుగు స్థాయిలలోనూ ఆత్మ అనుసంధానములో ఉంటుంది.

భూమికి ప్రభువు అయిన సనత్కుమారుడు సూర్యుడు, సవితృడు, మరియు ఆదిత్యుల యొక్క ధ్యానములో ఉంటాడు. పరమగురువులు శక్తి ప్రవాహమును అందుకుని ఈ గోళము మీద జీవులకు ప్రసారము చేస్తారు. ఈ అనుసంధాన ప్రక్రియలో మనము కలిసినప్పుడు గ్రహ, సౌర, మరియు విశ్వ అస్తిత్వమును అనుభూతి చెందగలము. క్రమము తప్పకుండా మనము సుషుమ్నలో ధ్యానము చెయ్యడము వలన మనలోని కుడి-ఎడమలు, స్త్రీ-పురుష శక్తులు పోషింపబడి, సమము అవుతాయి. ఈ సమతుల్య స్థితిలో మనము అర్థనారీశ్వర ప్రజ్ఞ వెలుగులో ఉంటాము. భగవంతుడు అర్థనారీశ్వరుడు, స్త్రీ-పురుష తత్వము. భగవంతుడు మనని అతడి ప్రతీకగా సృష్టించినాడు.

ఊర్ధ్వ లోక శక్తుల అవరోహణము

సంవత్సరములోని రెండు విషువత్ దినముల యందు పగలు యొక్క వ్యవధి ఒకటే అయినప్పటికీ, వాటి శక్తులు మాత్రము వేరుగా ఉంటాయి. ఉత్తర విషువత్ సమయములో సూర్యుడు భూమధ్య రేఖను దాటి ఉత్తరముగా ప్రయాణము చేస్తాడు – శక్తులు పదార్థము నుంచి ప్రజ్ఞకు ఆరోహణము చెందుతాయి, ఇది మూలాధారము నుంచి సహస్రారమునకు ఆరోహణము. దక్షిణ విషువత్ సమయములో సహస్రారము నుంచి మూలాధారమునకు, ఊర్ధ్వము నుంచి అధస్సునకు అవరోహణము జరుగుతుంది. దక్షిణ విషువత్ సూర్య భగవానుని గమనము యొక్క కనిష్ఠ స్థితికి సంకేతము. ఇది సంవత్సర చక్రములోని అర్థరాత్రమునకు, వెన్నెముక చివరలో ఉన్న మూలాధారమునకు సంకేతము.

సంవత్సరములోని రెండు విషువత్ దినముల యందు ప్రజ్ఞ, పదార్థము సమానముగా ఉంటాయి. వేదములలో ఈ స్థితిని “సమన్వయ స్థితి” లేక “యోగ స్థితి” అని అన్నారు. నిష్ణాతులైన యోగులు అవసరమునుబట్టి పదార్థమయ లోకములలో మరియు ప్రజ్ఞామయ లోకములలో సునాయాసముగా గమనము చెయ్యగలరు. వారు అధో లోకములలో ఉన్న జీవులను ఊర్ధ్వ లోకములు చేరగలిగేలా పరివర్తనము చేయగలరు. అలాగే, వారు ఊర్ధ్వ లోకములలో ఉన్న శక్తులను ఈ భూలోకమునకు తీసుకు రాగలరు.

ప్రజ్ఞ, పదార్థము సరిసమానముగా ఉన్న సమయములను యోగ శక్తులకు ఉన్నతమైన సమయములుగా భావిస్తారు. విషువత్ సమయములతోబాటు ఉదయపు, సాయంకాలపు సంధ్యా సమయములు, మరియు అష్టమి తిథులు కూడా అనుకూలమైన సమయములు. ఇవి అన్నీ ఒకే సమయములో వచ్చినప్పుడు సూక్ష్మ లోకముల సహకారము మరింతగా అందుతాయి, మరియు మనము బుద్ధి లోకములలో సునాయాసముగా స్థిర పడడానికి అవకాశము ఉన్నది.

విషువత్ దినములు ముఖ్యమైన ఆధ్యాత్మిక పర్వదినములు. ఇతర దినముల కంటే ఈ దినములలో ధ్యానము మరియు అనుసంధానము సునాయాసముగా జరుగగలవు. మేష రాశి ఆరంభములోని ఉత్తర విషువత్ సమీపములోని దినములు దీనికి ఉత్తమమైన సమయములు. మన పూర్వీకులకు ఉత్తర విషువత్ ప్రాముఖ్యత తెలిసి, రాశి చక్రములో మొదటి రాశిని సంవత్సర ఆరంభముగా ఎంపిక చేసుకున్నారు. అందువలన మనము ఈ ఉపదేశ దినముల కొరకు ఉద్యుక్తము కావలెను. ముఖ్యముగా విషువత్ ముందు దినము, విషువత్ దినము, మరియు విషువత్ తదుపరి దినమును (మొత్తము మూడు దినములను) అంతర్గత సాధనకు కేటాయించుకొనవలెను. ఇది మనలోని శక్తులను మనము సవరణము చేసుకొని ఆత్మతోను, పరిసరములతోనూ అన్యోన్యముగా ఉండడానికి సహకారము అందిస్తుంది. బృందములుగా కలిసి సాధన చేస్తే ధ్యానములో మరింత సమర్థవంతముగా అనుసంధానము జరిగి, ఆత్మ ప్రకాశముతో నిండగలదు.

శిరచ్ఛేదన క్రతువు

ఉత్తరాయణము, దక్షిణాయనములోని విషువత్ సమయములలో సూర్యుడు భూమధ్య రేఖను దాటినప్పుడు, దానిని సంవత్సర చక్రమును కత్తెరతో కత్తిరించి సంవత్సర ఆరంభమును, అంతమును ఏర్పాటుచెయ్యడముగా భావిస్తారు. సంస్కృతములో కత్తెరను “కృత్తిక” అని అంటారు. సూర్యుడు ఉత్తరాయణములో భూమధ్య రేఖను దాటుతున్నప్పుడు అతడు కృత్తికా నక్షత్రములో గమనము చేస్తాడు. ఉత్తర విషువత్ శిరచ్ఛేదన క్రతువును, అధోలోకములలో ఉన్న జీవుడు మరణించి, మహాత్మునిగను, మాస్టరుగను జన్మించడముగా భావిస్తారు.

వేదవ్యాస మహర్షి ఈ క్రతువును దక్ష ప్రజాపతి కథగా మనకి సంకేతార్థముగా ఇచ్చారు. ప్రజాపతి అనగా సౌరమాన సంవత్సరము – అతని శిరస్సు ఛేదింపబడి దానిని మేషము శిరస్సుతో మార్పుజేయబడుతుంది. పూర్వ సంవత్సరపు అంతమునకు, నూతన సంవత్సరపు ఆరంభమునకు సంకేతముగా “మేష క్రతువు”ని భావిస్తారు.

ఈ క్రతువుకి ఇతర కోణములు కూడా ఉన్నాయి: దక్షుడు మనలో అహంకార ప్రజ్ఞగా ఉంటాడు. మనిషి విద్యలోను, సామర్ధ్యములోను వృద్ధి చెందినప్పుడు సాధారణముగా అతని యొక్క విజయముల మరియు సద్గుణముల అహంకారము కూడా అతనిలో వృద్ధి చెందుతుంది. ఎవరయితే ఎంత ఎక్కువ చురుకుగను, తెలివిగను ఉంటే వారికి అంత ఎక్కువగా అహంకారము కూడా ఉంటుంది. పురాణములు దక్ష ప్రజాపతికి అన్ని శక్తులు, సామర్ధ్యములు ఉన్నాయని, అందువలన అతడు అహంకార పూరితుడై ఉంటాడని చెప్తాయి. కాలాతీతుడైన ఈశ్వరుడిని ఆహ్వానించకుండా అతడు ఒక క్రతువుని నిర్వర్తిస్తాడు. అప్పుడు అతని శిరస్సు ఛేదింపబడి, అతనికి మేషము యొక్క శిరస్సును పెట్టడముతో అతని అహంకారము అణచబడుతుంది.

శిరచ్ఛేదన క్రతువు సాధకునికి సహస్రారములో ఉపదేశమునకు సంకేతము. దీని వలన మానవ ప్రజ్ఞకు అంతము, దైవీ ప్రజ్ఞకు ఆరంభము జరుగుతుంది. మేష రాశి సాధకుడిని శంబళతో అనుసంధానము చెయ్యగలిగిన అత్యుత్తమమైన ఉపదేశమునకు సంకేతముగా భావిస్తారు. భౌతిక శరీరములో సహస్రారములో శంబళ ఉన్నది - ఇది సనత్కుమార ప్రభువుతో ప్రత్యక్షముగా సంబంధము కలిగి ఉంటుంది. ఎవరయితే శిరస్సులోని ప్రజ్ఞ తెలుసుకొనగలరో వారు దైవీ లోకములకు ఆరోహణము చెందగలరు.

దక్షుని కథను మేష రాశిలో అధ్యయనము చేయవలెనని పెద్దలు సూచించారు. అప్పుడు మనము మనలోని మేషము యొక్క పశు ప్రవృత్తిని అధిగమించి, సంవత్సర చక్రములో సరైన రీతిలో ప్రవేశించగలము.