{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

దక్షిణాయన సంక్రమణము

“ధ్యానము అనగా చేయునది కాదు, జరుగునది”

ఉత్తరాయణ సంక్రమణము, దక్షిణాయన సంక్రమణము, మరియు రెండు విషువత్ దినములు సంవత్సర చక్రములోని నాలుగు అతి ముఖ్యమైన పండుగలు. ఈ ముఖ్యమైన సమయములలోని శక్తుల సహాయము వలన జ్ఞానము అనేక పొరలుగా మనలో వికసించే అవకాశమున్నది. ఈ పుణ్య సమయములతో అనుసంధానము చెందడము వలన సూక్ష్మ అవగాహనలు మనము పొందగలిగే అవకాశమున్నది.


ధ్యానములు, క్రతువులు | పండుగలు

ప్రకృతిని అనుసరించుట

దక్షిణాయన సంక్రమణము

ఈ ముఖ్యమైన పండుగలను మనము మన జీవన స్రవంతిలో కలుపుకుని, వేడుకగా జరుపుకోవాలనే ఉద్దేశ్యముతో పరమగురువుల పరంపర తీవ్రముగా కృషి చేస్తున్నది. ప్రకృతికి అనుగుణముగా ఉన్న ఈ పండుగలను సద్గురువు శిష్యులైన మనము ఆచరించాలని పరమగురు పరంపర ఆశిస్తున్నది. ఈ పండుగల ఆచరణ ద్వారా మన శక్తి వ్యవస్థ, విశ్వ వ్యవస్థకి అనుగుణముగా మార్పు చెందగలిగే అవకాశము ఉన్నది – ఇది వేరే ఏ ఇతర విధానముల వలన కుదరదు. మనము పరమగురువులను దీని కొరకు ప్రార్థించినప్పుడు వారి సాన్నిధ్యమును మనకు ప్రసాదిస్తారు. మనము బృందములుగా సామూహికముగా సూక్ష్మ లోకములతో అనుసంధానము చెందడము వలన, మనము సామర్థ్యవంతముగా శక్తులను అందుకుని వాటిని మనలో అంకురింపచేసుకొనగలము. అందువలన ఈ దినములను మనము బృంద జీవనములకు కేటాయించుకొనవలెను.

మాస్టర్ సి. వి. వి. గారు తన అనుచరులను ఉత్తరాయణ సంక్రమణ దినమునందు, దక్షిణాయన సంక్రమణ దినమునందు, రెండు విషువత్ దినములందు, మరియు 29 మే (May Call), 29 డిసెంబరు (December Call) దినములందు బృందములుగా కలవమని చెప్పారు. ఆయన ప్రతి సంవత్సరము ఈ ఆరు సమావేశములను నిర్వర్తించారు. ఈ యోగ మార్గమును అవలంబించే వారందరూ ఈ విధముగా స్పర్శ పొంది, దాని ద్వారా అంతర్గత సంబంధమును పదిలపరుచుకొనవచ్చును. మాస్టరు గారు పిలుపునిస్తారు (Master calls) – మనము సిద్ధముగా ఉంటే ప్రతిస్పందించగలము. మాస్టరు గారు ప్రవేశించినప్పుడు మనము అందుబాటులో ఉండడానికి కావలసిన సన్నాహములు చేసుకోవడము మన బాధ్యత.

ప్రకృతిలోని క్రమమును అనుసరించడము ఏడవ కిరణము యొక్క క్రియ – దీని వలన సూక్ష్మ ప్రపంచము బ్రహ్మాండముతో అనుసంధానము చెందుతుంది. సంవత్సరములోని ఈ నాలుగు ముఖ్య దినములు ప్రతి ఒక్కటీ దిశాత్మకమైన మార్పులను తీసుకువస్తాయి. వాటితో మనము అనుసంధానము చెందడము వలన మనలో అద్భుతమైన అంతర్గత పరివర్తనములు కలుగుతాయి.

దైవసమర్పణమునకు దినములు

అనాదిగా ఈ దినములలో క్రతువులు నిర్వహింపబడుతున్నాయి. ప్రస్తుత కాలములో అవి చాలామట్టుకు కనుమరుగైనాయి. చాలామందికి ఉత్తరాయణ, దక్షిణాయన సంక్రమణములు, మరియు విషువత్ దినముల యొక్క అర్థము తెలియదు, మరియు ఆ సమయములలో ప్రకృతి శక్తులలో జరిగే మార్పుల మీద శ్రద్ధ పెట్టరు. ఈ ముఖ్య దినముల దరిదాపులలో మతపరమైన పండుగలు ఉంటాయి, కానీ ఇవి ఖచ్చితముగా ఈ దినములలోనే ఉండవు. కాలము యొక్క గుణములను మనము అర్థము చేసుకొనవలెను. లేకపోతే, ఏదో నామమాత్రముగా ఈ దినములలో ధ్యానము చేసుకుంటాము. వాటి ప్రాధాన్యతను మనము తెలుసుకుంటే, గాఢమైన ఆసక్తితో అంతర్గత కార్యములను మనము నిర్వహించుకుంటాము.

ఈ పండుగలను నిరయన (చాంద్రమాన) పంచాంగము ప్రకారము కాకుండా సాయన (సౌరమాన) పంచాంగము ప్రకారము జరుపుకొనవలెను: సూర్యుడు మనలోని చైతన్యమునకు ప్రతీక, చంద్రుడు మన ఆలోచనా శక్తికి ప్రతీక; సూర్యుడు స్థిరముగా ఉంటాడు, చంద్రుడు మనోభావములకు మరియు చపలచిత్తమునకు కారకుడు. సూర్యునికి మరియు మనకు సంబంధించి భూమిమీద జరిగే మార్పులను మనము అర్థము చేసుకొనగలిగితే, ఈ ముఖ్యబిందువుల దగ్గిర మూడు దినములును – ముందు దినము, ఆ దినము, ఆ తదుపరి దినము – ఈ మూడు దినములను ఉపదేశ దినములుగా పరిగణిస్తారు. కేవలము శాస్త్రము తెలుసుకోవడము వలనగాని, లేకపోతే కేవలము యాంత్రికముగా క్రతువులను నిర్వర్తించడము వలనగాని పరివర్తనలు జరగవు – మన దైనందిన కార్యములను ఈ దినములలో తగ్గించుకుని, విశ్వ ప్రణాళికతో మనము అనుసంధానము చెందడము వలన తత్సంబంధిత పరివర్తనలు జరుగగలవు.

ఈ దినములు దైవ సమర్పణమునకు పండుగలు. అందువలన సరళతతో ఉండడము మరియు ప్రాపంచిక విషయములతో అలిసిపోకుండా ఉండడము సూచింపబడినది. ఈ దినములలో ప్రత్యేకమైన ఆహారము తీసుకోవలసిన అవసరముగాని, నూతన వస్త్రములు ధరించవలసిన అవసరముగాని లేదు. ఈ దినములలో మనకు అధ్యాత్మిక ఆహారము మరియు మన వెలుగు శరీరమునకు సూక్ష్మ వస్త్రములు అందుతాయి అనునది దీని అంతర్గత అర్థము. క్రమముగా మనకు బంగారు మరియు వజ్ర శరీరములు లభిస్తాయి.

సూర్యుని ఉత్తరాయణ మరియు దక్షిణాయన గమనము

భూగోళము నుంచి చూసినప్పుడు సూర్యుడు ఉత్తరాయణ మరియు దక్షిణాయన గమనము చేస్తునట్టుగా కనిపిస్తుంది. భూమి అక్షము యొక్క ఏటవాలు గమనమే సూర్యుడు ఉత్తరము నుంచి దక్షిణమునకు మరియు తిరిగి ఉత్తరమునకు గమనము చేస్తునట్టుగా మనకు కనిపిస్తుంది. ఆరు మాసములపాటు, మకరము నుంచి కర్కాటము వరకు, సూర్యుడు ఉత్తరముగా ప్రయాణిస్తాడు. జీవుడు పదార్థమునుంచి ఊర్ధ్వ గమనము చెందడము దీని ఆధ్యాత్మికపరమైన అర్థము. అందువలన డిసెంబరు 21 రక్షకుని జననముగా భావిస్తారు.

మేష రాశిలో ఉత్తర విషువత్ దినమున సూర్యుడు భూమధ్య రేఖను దాటుతాడు. ఈ భూగోళపు జీవుల ఆత్మలు ఈ సమయములో అత్యుత్తమమైన స్థానమునకు చేరుతాయి. తయారుగా ఉన్నవారికి ఈ సమయములో ఉన్నతమైన ఉపదేశములు జరుగుతాయి – ఇవి గ్రహసంబంధింత ఉపదేశముల కంటే విస్తారమైనవి. ఈ సమయము క్రీస్తు యొక్క పునరుత్థానము మరియు ఊర్ధ్వగమనముగా ప్రసిద్ధిగాంచినది.

దక్షిణాయన సంక్రమణము జూన్ 21 దినమున రక్షకుడు మనలోని వ్యవస్థలో ప్రవేశిస్తాడు. అప్పుడు సూర్యుడు మనకు కనపడునట్టి u-turn తిరిగి దక్షిణాయన గమనము మొదలు పెడతాడు. దక్షిణ విషువత్ దినమున సూర్యుడు మళ్ళీ భూమధ్య రేఖ దాటి, ఉత్తరాయణ సంక్రమణమునకు మకర రేఖ వద్దకు చేరుతాడు.

సంక్రమణములు మీరు ఉత్తరార్థ గోళములో నివసిస్తున్నారా లేక దక్షిణార్థ గోళములో నివసిస్తున్నారా అన్నదానిమీద ఆధారపడి ఉండవు. సూర్యుని ఉత్తరాయణములో ఈ భూగోళము మీద పదార్థము నుంచి ఊర్ధ్యముఖ గమనము ఉంటుంది; దక్షిణాయనములో పదార్థములోకి గమనము ఉంటుంది. విషువత్ దినములు ప్రజ్ఞ మరియు పదార్థములను సమతుల్యముగా అనుభూతి చెందడానికి సహకరిస్తాయి. ఈ సమయములు చైతన్యము యొక్క అత్యుత్తమైన స్థానములు – సమతుల్యత – అందువలన ఈ సమయము యోగ సాధనకు అనుకూలమైన సమయములు.

సూర్య భగవానుని పన్నెండు రాశులలో గమనము అంతర్గత రాశులలో సూర్యాంశ అయిన జీవుని గమనముగా మనలో ప్రతిబింబిస్తుంది. ఇది వృత్తాకార గమనము కాదు: మేషములో సూర్యుడు ఊర్ధ్వ లోకముల నుంచి దిగివచ్చి ప్రాణమునకు ఒక నూతన ప్రేరణ తీసుకువస్తాడు. కర్కాటకములో సూక్ష్మ లోకములలోని ప్రేరణము పదార్థ లోకములలోకి దిగివస్తుంది. అందువలన, కర్కాటకమును జీవుడు దిగి రావడముగను, భౌతిక శరీరములో జన్మించడముగను చెప్తారు. మేషములో శక్తిని శిరస్సులో విద్యుత్ ప్రేరణగా అనుభూతి చెందవచ్చును. వృషభములో ఈ శక్తి నీలపు రంగులో కనిపిస్తుంది, మిథునములో నీలము మరియు పచ్చ రంగుల మధ్య ఉన్న లేత నీల రత్నపు రంగుగా (aquamarine)కనిపిస్తుంది. కర్కాటకములో ఇది బంగారపు వెలుగుగా హృదయ కేంద్రంలోకి దిగివస్తుంది. బంగారపు వెలుగు బుద్ధికి ప్రతీక. దక్షిణాయన సంక్రమణము సమయములో మనము ఈ బంగారు వెలుగుతో అనుసంధానము చెందవలెను, మరియు ఇతరులకు ఈ వెలుగును అందించవలెను. దాని వలన మనము పరివర్తనము చెందుతాము.

గురువు యొక్క సాన్నిధ్యము మరియు వెలుగు యొక్క సమీకరణము

వ్యక్తీకరించబడిన సూర్యుడు, ఆత్మయే సద్గురువు; సూర్యునికి, ఆత్మకు ప్రతీక, ప్రతినిధి గురువు. గురువు తన సాన్నిధ్యమును మన హృదయ కేంద్రములో ఇస్తాడు. హృదయమునకు కర్కాటకరాశి అధిపతి. అందువలన, అనాదిగా కర్కాటక పూర్ణిమను గురు పూర్ణిమగా భావిస్తారు. అందువలన, దక్షిణాయన సంక్రమణ సమయమున శ్రద్ధగా మన ఆత్మను గురువుకు అప్పజెప్పి, వెలుగును అందుకోవడానికి మంచి అవకాశము.

మన శరీరము వెలుగును గ్రహించడానికి వెలుగుతో నిండిన ఆహారము తీసుకొనవలెను – బాగా సూర్యరశ్మి అందుకున్న తాజా కాయగూరలు మరియు పండ్లు, మరియు తాజా నీరు మరియు రసములు. మంచి పదార్థముల వలన మన శరీర ధాతువులు సూక్ష్మముగా తయారవుతాయి, మరియు తేలికైన, శక్తివంతమైన శరీరములు తయారవుతాయి. అందువలన, దక్షిణాయన సంక్రమణము నుంచి మనము మన ఆహార నియమములను పునర్వ్యవస్థీకరించు కొనవలెనని, ఎరుకతో, దీర్ఘముగా శ్వాసను తీసుకొనవలెనని, మరియు సూర్య కిరణములను ఒంటబట్టించు కొనవలెనని వేదములు చెప్తాయి. దీని వలన ప్రాణ ప్రవాహము సవ్యముగా జరిగి, జీవుడు నివసించడానికి తేలికైన, కాంతివంతమైన శరీరమనే గృహమును నిర్మాణము చేసుకోగలము. ఇది మన శరీరములో సరికొత్తగా ప్రవేశించినట్లుగా ఉంటుంది. మన గృహములు కూడా పవిత్రముగా, శుభ్రముగా, కాంతితో నిండి ఉండాలి.

జలము మరియు వాయువు

కర్కాటకము జలతత్త్వపురాశి. దీనికి చంద్రుడు అధిపతి. కాని, దక్షిణాయన సంక్రమణమునకు మరియు నాలుగవ రాశి అయిన కర్కాటకమునకు పంచభూతములలో నాలుగవ భూతమైన వాయువునకు మరియు శ్వాస యొక్క స్పందనముతోను సంబంధము ఉన్నది. శ్వాసతో సాధన ద్వారా మన శారీరిక వ్యవస్థ పవిత్రత చెంది, మనలోని భావావేశములు సుస్థిరపడతాయి. వరుణుడు కూడా కర్కాటకములో చంద్రుని ద్వారా పని చేస్తాడు, క్రమబద్ధమైన శ్వాస ఆధ్యాత్మికమైన వాయువుతో సంబంధమును తీసుకువస్తుంది. ఇది ప్రజ్ఞ వద్దకు మనము ఊర్ధ్వగతి చెందడానికి అవకాశము కలిగిస్తుంది. జ్యోతిష్యపరముగా, ఈ విధముగా మనము పదార్థములో పడి తులా రాశి వరకూ జారిపోకుండా, రాశి చక్రములో వెనుకకు తిరిగి మళ్ళీ మేషమునకు చేరుతాము.

క్రింది లోకములలో జలతత్త్వపు రాశి అయిన కర్కాటకము ప్రతిబింబిత మరియు వక్రీకరణపు రాశిగా చెప్తారు. ఈ దక్షిణాయన సంక్రమణము సమయములో వెలుగుతో సంబంధమును ఎరుకతో, శ్రద్ధగా బలోపేతము చెయ్యకపోతే – ఈ శక్తులను మానసికంగా దర్శనము చెయ్యడము ద్వారా మరియు జ్ఞప్తికి తెచ్చుకోవడము ద్వారా – జీవుని ఉద్దేశ్యమును మరచిపోయి, దైనందిన కార్యక్రమములలో మనలను కోల్పోతాము. జాగురత కర్కాటము యొక్క మూల సూత్రము; మనము ఎరుకతో గుర్తు తెచ్చుకోవడము ద్వారా జీవునితో సంబంధమును ఏర్పాటు చేసుకొనవలెను. బుద్ధి లోకములలో గురువు యొక్క స్పర్శ వలన మనలో జరుగవలసిన మార్పులు జరుగుతాయి, దాని వలన సంవత్సరపు అవరోహణ గమనములో కూడా మనము ఆరోహణము చెందగలము.

సూర్య భగవానుని అవరోహణము

కర్కాటక రాశిలో మొదటి నాలుగు భాగలు లేక డిగ్రీలు ప్రత్యేకముగా ముఖ్యమైనవి. వాటిని పునర్వసు అంటారు, అంటే “మళ్ళీ తిరిగి వస్తాను” మరియు “నివాసము” అని అర్థము. శ్రద్ధతో భగవంతుని మనలోనికి ఆహ్వానిస్తే, అతను మన హృదయములో నివసించడానికి తిరిగి వస్తాడు. సూర్య భగవానుని ద్వారా పనిచేసే విరాట్ పురుషుడు మనకు మూలము, మనము అతని ప్రతీకలము. అతను మనలో ప్రవేశించినప్పుడు, అతని మూలమును మనలోని పవిత్రమైన హృదయ కమలములో అతడు బలోపేతము చేస్తాడు. దాని విద్యుతయస్కాంత శక్తి మన రూపమును అతని రూపమునకు అనుగుణముగా తయారుచేస్తుంది. అతను మనలో వర్తించడము వలన, మనము అతనిలో వర్తించడము వలన సూర్య ప్రణాళిక మన ద్వారా నిర్వర్తింపబడుతుంది. ఇది దక్షిణాయన సంక్రమణ సమయములో మనము అందుకునే ఉపదేశము. అందువలన, దక్షిణాయన సంక్రమణము మరియు కర్కాటక రాశి ప్రవేశము సమయములో సూర్యభగవానుని మనలోకి దిగి రావడమును ధ్యానము చెయ్యమని సూచిస్తారు.