జగద్గురు పీఠము మరియు భగవాన్ దత్తాత్రేయ

“గుమికూడవలసినది తలలు కాదు, హృదయాలు”
జగద్గురు పీఠము | గురుపరంపర పుస్తకము: శ్రీ దత్తాత్రేయ భగవాన్ దత్తాత్రేయ అవతార విశేషములు (English)

The WTT and Lord Dattatreya

జగత్తునందలి గురుతత్త్వము దత్తాత్రేయునిగా అవతరించి ఈ కలియుగము నందు జీవులను అనుగ్రహించు విషయములను గురించి తెలియచేయుటకు జగద్గురు పీఠము ఒక పేజీని (వెబ్ పేజి) అంతర్జాలము నందు కలిగియున్నది.

సనాతన భారతీయ వాఙ్మయము నందు విశ్వేవ్యాప్తమైన గురుతత్త్వము భగవాన్ దత్తాత్రేయునిగా అవతరించెనని చెప్పబడినది. ఈ తత్త్వము సిరియస్ లేక శారమేయ మండలము అను నక్షత్రమండలము నుండి కాలానుగుణముగా అవసరమైనప్పుడెల్లా భూమిపై అవతరించి జ్ఞాన బోధలకు కావలసిన స్ఫూర్తిని అందించుచున్నది.

గురుపరంపర శ్వేత ద్వీపము అనుపేర భూమిపై కలదు. హిమాలయములు కేంద్రమై, అనేక ముఖ్యమైన పర్వత ప్రాంతములలో వారి ఆశ్రమములు కలవు. ఈ గురుపరంపరకు అధ్యక్షత వహించిన వారిని జగద్గురువు అందురు. ఆయన అనుసరించే గురుతత్త్వము శారమేయ మండలములో నున్నది. ఆ తత్త్వమును జగద్గురువు లేక విశ్వగురువు అందురు. జగద్గురువుగా మైత్రేయ మహర్షి, విశ్వగురువుగా భగవాన్ దత్తాత్రేయుడు ఉన్నారు. ప్రేమ మరియు జ్ఞానము యొక్క స్వరూపమే గురుతత్త్వము. ప్రతి సద్గురువు ప్రేమ ప్రధానముగా జ్ఞానమును బోధించును.

దక్షిణ భారతదేశములోని, ఆంధ్రప్రదేశము నందుగల పిఠాపురములో శ్రీప్రాద శ్రీవల్లభునిగా భగవంతుడైన దత్తాత్రేయుడు 14వ శతాబ్దము నందు అవతరించెను. ఆయన 30 సం||లు దేహమునందు జీవించి, అనేక అసాధారణ కార్యములను నిర్వర్తించి, జ్ఞాన సమన్వయమునకు సులభమైన మార్గమును బోధించెను. ఆయన మరల రెండు మారులు నృసింహ సరస్వతిగాను, స్వామి సమర్థగాను అవతరించిరి. ఈ మూడు అవతారములలోను ఆయన నిత్యజీవితములో జ్ఞాన సమన్వయమునకు కావలసిన స్థిరమైన మార్గమును ఏర్పాటు చేసినారు. సాధారణ మానవుడు ఎవరైనా వెలుగు మార్గము నందు సత్యమువైపు ప్రయాణించుటకు కావలసిన మార్గమును సులభతరము చేసిరి.

జగద్గురు పీఠము జగద్గురువు పేరుననే నెలకొల్పబడినది. ఈ సంస్థ యందున్న సభ్యులు మహాత్ములైన సద్గురువుల జీవితములు మరియు వారు అందించు శాశ్వత జ్ఞానములచే స్ఫూర్తి చెందినవారు. జగద్గురు పీఠముయొక్క ముఖ్య ప్రాణశక్తి భగవాన్ దత్తాత్రేయుడే.

జగద్గురు పీఠము ఈ వెబ్సైట్ ద్వారా సత్యాన్వేషకుల కొరకు ఈ ప్రయత్నమును వినయపూర్వకముగా సమర్పించుచున్నది. అన్వేషకులు విషయమును గ్రహించి వారి అంతరంగమునందు అంగీకరింపబడినంతవరకు అంగీకరించగలరు. మా ఈ ప్రయత్నము మంచి ప్రయోజనమును పొందునుగాక.