{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

గురువు యొక్క ఆవశ్యకత

మార్గ దర్శనము

ప్రజలు వారికి తోచిన విధముగా ప్రయాణము చేయుచూ దానికి సంబంధించిన అనుభవములను పొందుదురు. మార్గసూచనలు లేనిచో ప్రయాణమున దారి తప్పుటకు అవకాశములు ఎక్కువ కలవు. జ్ఞాన బోధల వలన జీవితమునకు మార్గనిర్దేశము కలుగును. అస్పష్టమైన ఆలోచనలు కలవాడు, పొగమంచులాంటి వాడు. పొగమంచులో ప్రయాణము, గుడ్డివాని ప్రయాణము వంటిది.

గురువు సమాచారము అందించి, మద్దతు ఇచ్చి సహాయము చేయును. మార్గము తెలిసి, ఇతరులకు తెలియచేయగలవానిని “గురువు” అని పిలుతురు. ప్రస్తుతకాలములో ఈ పదము పూర్తిగా వక్రీకరింపబడినది. మనకు గురువు అనగా మోసగాడు, లేక దొంగ గురువు. కనుకనే చాలామంది ఎవరినీ కూడా గురువుగా అంగీకరింపక, అజ్ఞానముతో దారి తప్పుచుందురు. ఏ ఒకరిని గురువుగా అంగీకరించలేక ఒకరి తరువాత ఒకరిని మార్చుతూ తిరుగుచుందురు. ఎవరైతే పదార్థమునందు ఆసక్తి, భావోద్వేగమైన మానసిక ప్రవృత్తి కలిగినవారు ఎంత తెలిసిననూ గురువు దగ్గరకు చేరలేరు.

గురువులు, పరమగురువులు లేరని కొందరు కపట వాదనలు చేయుదురు. తనను గురించి తెలుసుకొనవలెని తపించువారికి గురువు దర్శనమిచ్చును. ఎవరి సాన్నిధ్యములో మనలో సరియైన మార్పు కలుగుచున్నదో, ఎవరు నిరాడంబరమైన, ఆదర్శమైన జీవితమును జీవించుచున్నారో, ఎవరిని అనుసరించినచో శాంతి లభించునో వారిని సరియైన గురువుగా తెలుసుకొనవచ్చును. నిస్వార్థమైన సేవాతత్వము, పరిపూర్ణత చెందినవానికి గీటురాయి. నిరాడంబరత లోపించినచో ప్రచారము, స్వీయ-ఉన్నతిని కోరుట, డంభము, ధనార్జన మొదలగు వాటియందు బంధింపబడును.

ప్రతి సద్గురువు ఒకే లక్ష్యము కలిగి ఉంటారు. తన చుట్టు చేరిన జీవులకు వారి నిజ స్వరూపమును గుర్తుచేసి, వారు అమరులని, వెలుగు స్వరూపులని ఎవరికి వారు అనుభవముద్వారా తెలుసుకొనునట్లు వారికి మార్గదర్శకత్వము వహించుటయే వారి లక్ష్యము.

నిపుణత కలిగిన మార్గదర్శి

పర్వతారోహణమునకు వలెనే, అంతరంగ ప్రయాణమునకు కూడా సరియైన సాధనములు, నిపుణత కలిగిన మార్గనిర్దేశకుడు ఎంతో అవసరము. గురువు కొరకు చూడవలసిన పనిలేదు, ఆయన గురించి మనకు తెలిసిన దానికంటే మనగురించి ఆయనకు ఎక్కువ తెలుసు. మనము గురువును గుర్తించగలిగినచో, మనము ఆయనంత గొప్పవారమే. గురువుయొక్క సాన్నిధ్యము సాధకుడు లేక శిష్యునిలో మార్పు కలిగించును, అది అయస్కాంతము వద్ద ఇనుప ముక్కలో కలిగిన మార్పువంటిది. ధ్యానమునకు లేక అధ్యయనమునకు ముందు గురువును గురించిన ఆలోచన, ఆయన సాన్నిధ్యములో చేసిన ధ్యానము వంటిది. గురువుని గురించిన ఆలోచన ఆయన సాన్నిధ్యమును కలిగించును. ఆయన సాన్నిధ్యము మన ప్రజ్ఞను ఊర్ధ్వముఖము కలిగించి మనము చేయు పనిలో నాణ్యతను మెరుగుపరచును.

గురువులకే గురువు

మానవజాతి మొదలైనప్పటినుండి జ్ఞానముకూడా ఉన్నట్లుగా, ప్రాచీన శాస్త్రముల ద్వారా తెలియవచ్చుచున్నది. అలాగే గురుశిష్య సాంప్రదాయము. జీవులు ఆవిర్భవించినప్పటినుండి ఇది ఉన్నది. యోగశాస్ర్తప్రకారము “సమస్త జీవుల హృదయాలలో ఉన్న దైవమే సమస్త గురువులకు గురువు. సమస్త జ్ఞానమునకు, పరిపూర్ణతకు అతడే బీజము.” సంస్కృతమున అతనిని “గురు” వందురు. అదే జీవులయందలి దైవ-ప్రజ్ఞ. అదిఒక తత్త్వము, మనిషి కాదు. మానవుల కంటే ముందే ఈ అంతరంగ గురువు ఉండి ఉన్నాడు. మనకన్నా ముందుగా వచ్చినవారిచే అతడు గురువుగా సేవింపబడినాడు.

గురువు-తత్త్వము(సిద్ధాంతము)

గురువు అనే తత్త్వము లేక సిద్ధాంతము గురువు యొక్క రూపము ద్వారా పనిచేయును. చాలా మందికి గురువుద్వారా పనిచేయుచున్న గురుతత్వము కంటే గురు రూపమే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అటువంటి వారు ఆ గురువు యొక్క వ్యక్తిత్వము చుట్టూ ఒక విధమైన ఆరాధనా విధానాన్ని, మతాన్ని తయారుచేసి ఇతరుల ఎడల అసూయ కలిగి ఉంటారు. కానీ నిజమునకు ప్రతి గురువు, జగద్గురు తత్వమునకు ప్రతినిధియై ఉండును. ఒకే ఒక గురుతత్త్వము అనేక మంది గురువుల ద్వారా పనిచేయును. ఆ గురుతత్త్వమునే జగద్గురువు అందురు.

గురువు మరియు అతని బోధలు

శాశ్వతమైన జ్ఞానమును అందించు గురువులు, ఆదర్శవంతమైన సాధారణ జీవితము కలిగిఉంటూనే అంతరంగ సాధన ఎలా చేయవచ్చునో ఆచరించి చూపించగలరు. ఆధ్యాత్మిక పురోగతి ఆధారముగా, వారు ధ్యానము, ఆధ్యాత్మిక గ్రంథ అధ్యయనము, జీవుల సేవ మొదలైనవి మౌనముగా ఎటువంటి సంచలనము లేకుండా ఆచరించుటను ఉద్ఘాటించెదరు. ఆయా కాలమునకు సరిపోయేటట్లుగా వారు సత్యమును దాని జిజ్ఞాసులకు వారి బోధనల ద్వారా ఆవిష్కరించెదరు. వారి బోధనలు ద్వారా మానవజాతి యందలి ఏకత్వమును, దాని ఉనికికిని ఉన్న సమన్వయమును తెలియచెప్పుదురు. వారు మన జీవితములకు ఆదర్శప్రాయులగుదురు. మనము తరువాతి తరములకు ఆదర్శముగా ఉండుటకు ప్రయత్నించవలెను.

ఆధ్యాత్మిక గురు పరంపర

ఆధ్యాత్మిక జ్ఞానము కాలానుగుణముగా తనంతట తాను బహిర్గతమవుతూ ఉంటుంది. కొన్నిసమయాలలో మరుగున ఉండి, కొన్నిసమయాలలో బయటకు వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ జ్ఞానమును ప్రసారము చేయు సద్గురువులు ఆధ్యాత్మిక గురుపరంపర అని పిలువబడతారు. ప్రాచీన కాలమునుండి వీరు మానవజాతికి వెలుగు మార్గములోనికి మార్గదర్శనము చేయుచున్నారు.

జ్ఞాన జీవనము

సద్గురుపరంపర పైననూ, వారి బోధనల మీదను అనేక రకములైన స్పందనలు ఉంటూ ఉంటాయి, ఎలాఅంటే తిరస్కరణలు, పక్షపాతములు, ఊహాజనితములు అని, కొందరు అల్లరిచిల్లరిగా తమకు వారితో పరిచయాలు ఉన్నట్లుగా తప్పుడు ప్రచారము చేస్తూఉంటారు. చాలా మంది ఈ గురు పరంపర కోసము వెతుకుతూ ఉంటారు, కానీ కనుకొనలేరు, ఎందుకంటే వారు కనీసము ఒక చిన్న సాధనను కూడా అనుసరించకుండుటచేత. సద్గురు పరంపరను అనుసరించువారు సాధారణముగా ఉండి, సామాన్య జీవులలో ఒకడిగా ఉండి, ప్రేమతో, మౌనముగా తన పని తాను చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వారికి ఆదర్శప్రాయుడై, వారికి స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటాడు. తెలిసిన జ్ఞానమును ఎక్కువ మాట్లాడేవాని కంటే, దానిని జీవితమున ఆచరించి చూపించినవాడు ఆదర్శప్రాయుడవుతాడు.

సద్గురువు ఆత్మకు అద్దము

సద్గురువు మనకు ఎవరో కాదు, మన ఆత్మకు అద్దము వంటివాడు. మార్గదర్శనము కోసము మనము మన వెలుపల వెతుకుచుండుటచేత, మనల్ని మనము తెలుసుకోవటము కోసం ఏది తప్పో, ఏది ఒప్పో నిర్ణయించి గురుపరంపర మనల్ని నిర్దేశిస్తూ ఉంటుంది. గురువు ప్రతిపాదనలు చేయును, మనము వాటిని అందుకొని ఆచరించట కాని, ఆచరించకపోవుట కానీ చేయుదుము. గురువు కేవలము మార్గనిర్దేశము చేయును, ఇతరుల కోసము నిర్ణయములు తీసుకోడు. సాధకుని సమస్యలకు కావలసిన జ్ఞానమును అందించి, అతడే ఆలోచించి తగిన నిర్ణయములు తీసుకొనమని తెలియచేయును. సాధకుడు సూక్ష్మ బుద్ధి కలిగి, నిర్ణయ స్వేచ్ఛ కలిగి, దైవీ సంకల్పముతో ఏకత్వము కలిగి ఉండవలెనని సద్గురువు కోరుకొనును.

స్వయం-బాధ్యత

పూర్వపు రోజులలో గురువు, శిష్యునకు బాధ్యతలను అప్పగించేవాడు, నిబంధన ఏమనగా గురువు చెప్పినదానిని ఏదైనా, ప్రశ్నించకుండా శిష్యుడు చేయవలెను. ప్రస్తుతము, శిష్యులు ఇంతకు ముందు కంటే ఎక్కువ స్వతంత్రులైనారు. ఆత్మ యెడల సరియైన బాధ్యతతో ప్రవర్తించేలా నేర్చుకొనవలెను. గురువు ఆత్మతో, ఆత్మ ద్వారా పనిచేయును. జ్ఞాన మార్గమును తెలుసుకొనుటకు కావలసిన స్వేశ్ఛాయుత నిర్ణయములు తీసుకొనుటను మనము నేర్చుకొనవలెను. మనము చేస్తున్న అన్ని బాధ్యతలను అంగీకరించాల్సి ఉంటుంది. గురువు తన సాన్నిధ్యాన్ని తనకు తానుగా ఇవ్వడు, శిష్యుడు అంతరంగములో గురువుని ప్రార్థించవలెను. గురువుయొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి పొంది పనిచేసుకొనవలెను.

అంతరంగము నుండి మార్గనిర్దేశము

గురువు సాధకుని అంతరంగము నుండి మార్గనిర్దేశము చేయును. కొన్ని ప్రాంతములకు వెళ్ళుటకును, కొన్ని నేర్చుకొనుటకును మనకు స్ఫూర్తి కలుగును - జ్యోతిషము, ఛందస్సు లేక హోమియోపతి. మనము ఇది మనకు కలిగిన స్ఫూర్తి అనుకొందుము, కానీ అది అంతరంగము నుండి గురువుచే నిర్దేశించబడినది. వేల సంవత్సరములనుండి ఉన్న పుస్తకము - అకస్మాత్తుగా దానికి ఒకరోజు ఆకర్షితులమవుతాము. ఏదైనా మనము మన అంతర్దృష్టితో ప్రయత్నించినచో దాని హృదయాన్ని అందుకొనగలము. ఈ విధముగా ఎన్నో విషయములు అవగాహన కాగలవు. పదిమంది కొరకు నిస్వార్థముగా పనిచేయగలిగేంతవరకు గురువు మనకు లోపలి నుండి కావలసిన ప్రేరణను అందించుచునే ఉండును.

సాన్నిధ్యమును అనుభూతి పొందుట

సద్గురువుద్వారా లభించు ఈశ్వర సాన్నిధ్యము జిజ్ఞాసువులో కావలసిన మార్పులను కలిగించును. అయస్కాంత సమక్షములో ఇనుపరజను ఎలా అయితే ఒకరమైన ఆకారమును పొందునో, ఆవిధముగా సద్గురు సాన్నిధ్యమున జీవితము, జీవిత సన్నివేశముల యందు చక్కని అనుకూలత కలిగి ఆనందభరితమగును. విద్యుత్తు కాంతిగా ఎలా గోచరమగునో, ఆవిధముగా సద్గురువు ద్వారా జ్ఞానము గోచరమగును. ఈ సాన్నిధ్యము వలన మనలో ప్రజ్ఞా వికాసము కలుగును. ఇది గురువు యొక్క భౌతికమైన సాన్నిధ్యము లేక ఆయన వ్యక్తిత్వము వలననో కాదు, గురువుయొక్క సాన్నిధ్యమును అనుభూతి పొందుటచేత.

సద్గురు సాన్నిధ్యమును ప్రార్థించుటచేత, మనలను అయస్కాంతీకరించుకొనుటకు వీలగును. గురువుని ధ్యానములో ఊహించి దర్శించుట అనగా అయస్కాంతమును ప్రార్థించుటయే. గురుదర్శనము, ఆయన సాన్నిధ్యము వలన ధ్యానము కుదురును. గురు సాన్నిధ్యము వలన మనంతట మనము అందుకోలేని మూలము నుండి కావలసిన సహాయము అందును. ఇది కేవలము అనుభూతియే కాదు, ఆత్మానుభవమును పొందుట.

మార్పులు లేక రూపాంతరము

దీర్ఘకాలము క్రమము తప్పకుండా ధ్యానము చేసినచో, అది మన జీవితములోని పూర్వపు అలవాట్లను తొలగించి, కొత్త తరంగములను స్థిరపరచి జీవితము నందు కావలసిన మార్పుల నిచ్చును. ప్రాథమిక సూత్రము ఏమనగా ప్రపంచమునందు ఎవరిని కలిసినా వారిని ఆత్మ స్వరూపులుగా దర్శించుట. ఏ సంఘటనను కాని, ఏ రూపము యొక్క ప్రవర్తనను కాని తిరస్కరించరాదు. భౌతిక, సూక్ష్మ లోకములందు సమర్థత కలిగి ఉండవలెను: “నేను ప్రపంచములో ఉన్నాను, కాని ప్రపంచము నుండి కాదు”. సద్గురు పరంపర మనకు ఒక ఉదాహరణ, గొంగళి పురుగు సీతాకోకచిలుగా మారినట్లు మనల్ని మనము మార్పుచేసుకొనవచ్చును.

ప్రయాణము

ఈ ప్రయాణము సుదీర్ఘము, అనేక జన్మలు పట్టును. ఒక జన్మలోనే ఇది పూర్తి అగునని అనుకొనరాదు. సరిగా కాల పరిమాణమును అవగతము చేసుకొన్నట్లయితే మన పురోగతి నెమ్మదిగా తప్పక జరుగును. గమ్యమును అర్థముచేసుకొని, మార్గము తెలుసుకొని ఒక్కొక్క అడుగు వేసుకొంటూ ముందుకు సాగవలెను.

“ప్రయాణము యొక్క గమ్యము అవగతమైనచో, మానవుడు ఎన్ని అవాంతరాలనైనా దాటగలడు. దూరముగా నున్న వెలుగును దర్శించినచో ప్రయాణమున ఉన్న కష్టాలను లెక్కచేయక ముందుకు సాగును. ఆ వెలుగు ఎన్ని అడుగుల దూరమున్నదో కూడా లెక్కించడు, అతని హృదయము నందు వెలుగుతున్న వెలుగు కోసం.”(Supermundane III, 634)