{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

వివాహ సంస్కారము

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | క్రతువులు
Re-establishing the Family System (English)
పుస్తకము: Marriage - The Sublime Sacrament (English)

ఒక సంస్కారము లౌకిక విషయములలో చిక్కుకున్న మానవుని, వాటి నుండి విముక్తి కలిగించి, మనిషిగా, ఆ పై దివ్య పురుషునిగా పరివర్తన చెందుటకు ఎంతో సహాయ పడును. అలాంటి సంస్కారముల లో వివాహ సంస్కారము అతి ముఖ్యమైన సంస్కారము.

వివాహ సంస్కారము ద్వారా ఆత్మ పరిశుద్ధమయి, పరివర్తన చెందుట సులభమగును. అంతేగాక ముఖ్యముగా, స్త్రీ-పురుష శక్తుల మధ్య సమతుల్యత సాధించుటకు ఈ సంస్కారము చాలా అవసరము. ఈ సంస్కారము మనిషిని పవిత్రీకరించుటకు ఒక సాధనము. సంస్కారము ఒక నిర్దేశిత మార్గమును సూచించును. దానిని విధి విధానములతో అనుసరించినచో మానవులు తమలో అవసరమైన పరివర్తన సాధించగలరు.

వివాహము స్త్రీ-పురుష శక్తుల మధ్య జరుగును. స్త్రీ పురుషులు ఒకే తత్త్వమునకు ఉన్న రెండు రూపాలు. పురుష శక్తికి నిశ్చలత్వము, వితరణము, విస్తరణము, బహిర్గతపరచుట వంటి గుణములు కలవు. అలాగే స్త్రీ శక్తి కి అభావము, స్వీకరణ, కలిగిఉండుట, ఏకత్వము/కలిపి ఉంచుట వంటి గుణములు కలవు. ఈ రెండిటి కలయికయే మనిషి ఉనికికి అర్థము. అవి సమానమైన శక్తులు కాని ఒకటి ఇంకొకదానిపై ప్రబలత్వము చూపదు. ప్రకృతి ఈ రెండు శక్తుల తో నిండిఉన్నది. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నవి. అవి ఎల్లప్పుడూ కలిసి ఉండును. వాటిని విడదీయలేము. ఒకటి లేకుండా ఇంకోదానికి ఉనికి లేదు. అవి రెండూ కలిసి ఉన్నప్పుడు వాటి శక్తి అత్యుత్తమ దశలో ఉండును.

వివాహ సంస్కారము యొక్క ముఖ్య ఉద్దేశ్యము స్త్రీ-పురుష శక్తుల మధ్య సమన్వయము సాధించుట. తద్వారా ఆ స్త్రీ, పురుషులు తమ జీవితమున అన్ని దశల యందు ప్రేమను అనుభూతి చెందగలరు. ఒక జంట భౌతిక, భావమయ, మానసిక, బుద్ధిమయ, మరియూ ఆనందమయ కోశములందు ఏకత్వము సాధించినచో వారు ఒకటవుదురు. అనగా, ఎక్కడ పరిపక్వత అవసరమో అక్కడ ఒకరు ఇంకొకరిని తమలోకి స్వీకరింతురు. ఒకరి బలము ఇంకొకరి బలహీనతలను తొలగించును.

విభిన్నమైన రెండు శక్తుల సంగమమే/కలయికయే వివాహ సంస్కారము. విభిన్నతను స్వీకరించుట; మార్పును మన జీవితములో ఒక భాగము చేసుకొనుట ద్వారా మానవునికి విశాల దృక్పధము అలవడును. కుటుంబ వ్యవస్థ ద్వారా మనము స్వీకరణ గుణమును అభ్యసించవలెను. అనగా, కుటుంబసభ్యుల యొక్క అభిప్రాయములను అంగీకరించుట ద్వారా ఇది సాధ్యమగును. ఈ విధముగా ఒకరితో ఒకరు అన్నిటి యందు సారూప్యత సాధించి కలిసి ప్రయాణము చేయగలరు.

స్త్రీ, పురుషుడు కలిసి జీవించుటకు వారి మధ్య అనుకూలత చాలా అవసరము. ఇద్దరి మధ్య అనుకూలత లోపించినచో వివాహము జరిగిననూ అది విఫలమగును. బాహ్య రూపము, అందచందముల అనుకూలత అనవసరము. ఒకరి మానసిక అవసములనుబట్టి వారికి ఎటువంటి వారు అవసరమో నిర్ధారించుకొనవలెను. భౌతిక శరీరమే కాక ప్రతి వారి లోపల వారి మానసిక శక్తుల యొక్క సమాహారమైన ఒక అంతశ్శరీరము కలదు. దాని గుణములు నిద్రాణమై ఉండి, అంత సరళముగా బహిర్గతముకావు. బాహ్య రూపము ద్వారా వాటిని కనుగొనడము అసాధ్యము. జీవితము పట్ల ఒకరి వైఖరి, వారి జీవితాశయముల ఆధారముగా వారి గుణములు/మానసిక స్థితిని తెలుసుకోవచ్చును. పూర్తిగా ప్రతికూలమైన వైఖరులు,ఆశయములున్నచో స్త్రీ పురుషుడు కలిసి జీవించలేరు, ముందుకు సాగలేరు. ఉదాహరణకు ఒకరికి మానవసేవ చేయవలెనన్న సత్సంకల్పము ఉన్ననూ ఇంకొకరు ప్రాపంచిక/విషయాసక్తి కలిగియున్నచో వారిరువురి వైఖరుల మధ్య చాలా అగాధముండును. వారు జీవితమున ముందుకు సాగి ఒక అందమైన కుటుంబమును నిర్మించలేరు. అందువలన మానసికమైన మరియు అతీంద్రియమైన అనుకూలత ముఖ్యముకాని లౌకికమైన విషయానుకూలత అనవసరము.

వివాహములో సంపూర్ణమైన (వంద శాతము) అనుకూలత అనునది చాలా తక్కువ. కొన్ని ప్రతికూలమైన అంశములుకూడా ఉండును. వాటిని ఓర్పుతో, అవగాహనతో చక్కదిద్దుకొనవలెను. వివాహమనేది జీవితములో ఒకేసారి జరిగే సంస్కారము. కావున భావయుతమైనది కాకుండా సమతుల్యమైన ఆలోచన చాలా అవసరము. కొద్ది కాలము తరువాత భావములు చెదిరిపోవును. ఆ పై సత్యమును ఎదుర్కొనవలెను. అందువలన భావనల కంటే వివేకముతో కూడిన ఆలోచనలే మేలు. అంచేత వివాహ విషయములలో ఆవేశము కన్న వివేకము ఆవశ్యకము.

సంస్కారము మరియూ దాని అర్థము

వివాహ సంస్కారము ఓంకార శబ్దముతో ప్రారంభమగును. అది మన చుట్టూ ఉన్న వాతావరణమును పవిత్రీకరించి క్రమత్వమును ఏర్పరచును. పవిత్రమైన ఓంకారము సర్వ దేవతలకూ ఆర్ద్రత తో కూడిన ఆహ్వానము. ఓంకారము తరువాత అగ్ని ప్రజ్వలనము చేయబడును. కంటికి కనిపింపకున్ననూ సమస్త దేవతలు అచ్చట ఉపస్థితులై ఉందురు.

వివాహ సంస్కారమున ముగ్గురు ముఖ్యమైన వారుందురు. ఒకరు బ్రహ్మ, అనగా వివాహము జరిపించు పురోహితుడు. ఆయన బృహస్పతి యొక్క స్వరూపము. వరుడు అంగారక/కుజ గ్రహ శక్తి యొక్క స్వరూపము. వధువు శుక్ర గ్రహ శక్తి యొక్క స్వరూపము. అంగారకుడు మరియు శుక్రుడు పరస్పర విరుద్ధమైన/ప్రతికూలమైన శక్తులు; అవి బృహస్పతి ద్వారా ఏకమవుతాయి. అంచేత వివాహము బృహస్పతి, అంగారకుడు, మరియు శుక్రుల మధ్య త్రిభుజాకార/ముక్కోణపు సంస్కారము. బృహస్పతి ద్వారా రెండు భిన్నమైన శక్తులు ఏకత్వమును సాధించి తద్వారా సంతతిని పొందును. ఆ సంతానము బుధ గ్రహము యొక్క స్వరూపము. ఇది వివాహ సంస్కారము యొక్క గ్రహ పరమైన అవగాహన.

వరుడు పురుషుడు.వధువు ప్రకృతి. ఆ ఇద్దరి సంగమము విశ్వ సృష్టికి మూలము. ఆ కారణముగా వివాహ సంస్కారము అన్ని సంస్కారములలోకి అత్యంత ఉత్తమమైనది మరియూ పవిత్రమైనది. వివాహము జరిగిన ప్రతీసారీ ఆ పరిసరములందు శాంతి నిండును.

ఆ పరిసరములలో ఉన్న పంచభూతముల ద్వారా వ్యక్తమైన భగవంతుడు/పరమాత్మ ఆ వివాహమునకు సాక్షిగా ఉన్నాడని, బ్రహ్మగారు (పురోహితుడు) పలుకుదురు. కనిపించే ఈ పంచభూతములు కనిపించని ఆ భగవంతుని మరియు దేవతల ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తాయి. వరుడు మరియు వధువు ఈ విషయమును అంటే తమ వివాహము ఇంత పవిత్రమైన పరిసరములలో జరుగుచున్నదని గ్రహించాలి. ఆ పై బ్రహ్మ గారు తదుపరి కార్యక్రమమునకు ఉపక్రమింతురు.

వరుడిని మరియు వధువును బ్రహ్మగారు ఈ క్రింది విధముగా ఆశీర్వదించెదరు:

  • కలిసి ఉండుట ద్వారా జీవితము యొక్క వైభవమును/శోభను తెలుసుకొనుట
  • ధర్మ మార్గమును అనుసరించి తెలుసుకొనుట
  • జీవితములో అన్ని కోణములు/దశలను అనుభవించుట
  • సత్సంతానమును పొందుట ద్వారా ఈ భూమిపై కుటుంబ వ్యవస్థను కొనసాగించుట.

వివాహము ఒక సంస్కారము. వైవాహిక జీవితము జీవించుచూ, స్త్రీ పురుష శక్తుల సంగమము ద్వారా అమరత్వమును సాధించుట జీవితము యొక్క పరమార్థము. ఈ ప్రయాణములో స్త్రీ శక్తి, పురుష శక్తికి సహాయపడును. పురుష శక్తి, స్త్రీ శక్తికి సహాయపడును. తద్వారా ఒకరి జీవితమును ఉద్ధరించుటకు ఇంకొకరు తోడ్పడుదురు. సంతోషకరమైన వైవాహిక జీవితము దీర్ఘాయువును ప్రసాదించును. ఇది ప్రకృతి రహస్యము.